ఇకపై ఇద్దరిదీ ఒకటే ప్రాణం

2 Jan, 2018 01:08 IST|Sakshi

తల్లి కాబోతున్న భార్యను భర్త కాలు కింద పెట్టనివ్వకుండా అపురూపంగా చూసుకుంటే ఆ భార్య మనసు ఆనందంతో నిండిపోతుంది. ఇక్కడున్న ఫొటోలు శ్రియ కళ్లల్లో ఆ ఆనందం చూడొచ్చు. విష్ణు ఎంచక్కా జడ అల్లుతున్నారు కదా. శ్రీ లక్ష్మీప్రసన్న పిక్చర్స్‌ పతాకంపై అరియానా, వివియానా, విద్యా నిర్వాణ సమర్పణలో మోహన్‌బాబు నటించి, నిర్మించిన చిత్రం ‘గాయత్రి’. మదన్‌ రామిగాని దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో మంచు విష్ణు, శ్రియ కీలక పాత్రలు చేశారు. కొత్త సంవత్సరం సందర్భంగా ‘ఇకపై ఇద్దరిదీ ఒకటే ప్రాణం’ అనే క్యాప్షన్‌తో విష్ణు–శ్రియల ఫొటోను విడుదల చేశారు.

పుట్టబోయే బిడ్డ గురించి శ్రియ కలలు కంటుంటే.. విష్ణు ఆమెకు జడ వేస్తున్న ఈ ఫొటో భలే పసందుగా ఉంది కదూ. అన్నట్లు.. ఇకపై ఇద్దరిదీ ఒకటే ప్రాణం అంటే.. వారి జీవితాల్లోకి కొత్తగా రాబోయే బేబి గురించి అయ్యుండొచ్చని ఊహించవచ్చు. ‘‘ఇప్పటివరకు నేను చేసిన మోస్ట్‌ చాలెంజింగ్‌ రోల్స్‌లో ‘గాయత్రి’లో చేసిన రోల్‌ ఒకటి. నా కెరీర్‌లో వన్నాఫ్‌ మై బెస్ట్‌ సాంగ్‌ కూడా ఈ సినిమాలో ఉంది. నా ఫస్ట్‌ లుక్‌ ప్రేక్షకులకు నచ్చిందని అనుకుంటున్నాను’’ అని పేర్కొన్నారు విష్ణు. ఫిబ్రవరి 9న విడుదల కానున్న ఈ చిత్రానికి సంగీతం: తమన్, ఎగ్జిక్యూటివ్‌ నిర్మాత: విజయ్‌ కుమార్‌. ఆర్‌. ఈ సంగతి ఇలా ఉంచితే.. రియల్‌ లైఫ్‌లో మంచు విష్ణు సతీమణి విరానిక సోమవారం బాబుకు జన్మనిచ్చారు. ఈ విషయాన్ని  విష్ణు సోషల్‌ మీడియా ద్వారా తెలిపారు.

మరిన్ని వార్తలు