పదే పదే నన్ను డిస్టర్బ్‌ చేస్తున్నాయి

17 May, 2020 07:17 IST|Sakshi

‘షీలా కీ జవానీ’, ‘చిక్నీ చమేలీ’, ‘జర జర టచ్‌ మీ’ అంటూ ఐటంసాంగ్‌లతో చిలిపి చూపులు రువ్వే కత్రినా కైఫ్‌లో చిన్నపాటి తాత్వికురాలు ఇలా మెరిసి అలా మాయమవుతుంది. ఆ మెరుపులను పట్టుకోగలిగితే అవి ఇలా ఉంటాయి....

మదిలో...
అకారణ ఆందోళన, అకారణ భయం... ఇలాంటి సమస్యలను బాలీవుడ్‌లో చాలామంది ప్రముఖులతో పాటు నేను కూడా ఎదుర్కొన్నాను. ఆలియా భట్‌ తన సమస్యల గురించి చెప్పుకుంది. డిప్రెషన్‌తో తాను ఎలా పోరాడింది దీపికా చెప్పింది. ఆమె డిప్రెషన్‌ నుంచి బయటకు రావడానికి ఎంతోమంది వ్యక్తులు సహకరించారు. ఇక నా విషయానికి వస్తే పుస్తకాలు, ఇతర విషయాలు తోడ్పడ్డాయి. పనికిరాని విషయాలను మదిలోకి ఆహ్వానించి వాటి కింద నలిగిపోతుంటాం. అందుకే వాటిని దూరంగా పెట్టడం అవసరం. ఈ విశ్వం అనేది నా వల్లో, మీ వల్లో నడవడం లేదు. మరి అంతగా ఆందోళన పడాల్సిన అవసరం ఏమిటి? ఈ విశ్వాన్ని ఎవరైతే నడుపుతున్నారో, మనల్ని తీసుకెళ్లాల్సిన సమయంలో తీసుకువెళతారు. స్థూలంగా అర్థం చేసుకోవాల్సిన విషయమేమిటంటే, మనకు ఉన్నది ఒకటే జీవితం, ఏదో ఒకరోజు మనం వెళ్లిపోవాల్సిన వాళ్లమే. ఈ ఎరుక ఉంటే చాలా సమస్యలకు  పరిష్కారాలు దొరుకుతాయి.

కొత్త ద్వారాలు
వృత్తిపరంగా, వ్యక్తిగతంగా సున్నితంగా ఉండేదాన్ని. కాని ఇప్పుడు నాలో మార్పు వచ్చింది. నా చుట్టూ జరిగే విషయాలను లోతుగా విశ్లేషిస్తున్నాను. ఇబ్బంది పెట్టే ఆలోచనలను మనసు నుంచి ఖాళీ చేయించడం నేర్చుకున్నాను. ఆరోజు ‘బార్‌ బార్‌  దేఖో’ సినిమా షూటింగ్‌ కోసం థాయ్‌లాండ్‌ వెళుతున్నాను. కొద్దిరోజుల క్రితం ఏదో జరిగింది... అంతే దాని గురించే ఎన్నో ఆలోచనలు. పదే పదే నన్ను డిస్టర్బ్‌ చేస్తున్నాయి. ఇది మంచి పద్ధతి కాదు అనిపించింది. దీని నుంచే ఎన్నో విషయాలను నేర్చుకున్నాను. కొత్త ప్రపంచానికి ద్వారాలు తెరుచుకున్నట్లు అనిపించింది. గతంలో ఈ ప్రపంచం దారి ఒకవైపు, నా దారి ఒకవైపు అన్నట్లుగా ఆలోచించేదాన్ని. ఇప్పుడు మాత్రం నేను ప్రపంచంతో కలిసి నడుస్తున్నట్లుగా ఉంది.

పగటి కలలు
చిన్నప్పుడు నేను నాదైన ప్రపంచంలో ఉండేదాన్ని. ‘ఇలా జరిగితే బాగుంటుంది కదా!’, ‘అలా జరిగితే బాగుంటుంది కదా!’ అని కలలు కనేదాన్ని. నా పగటి కలలు నన్ను నలుగురిలో కలవకుండా చేశాయి. ‘అసలు నేనేనా సినిమాల్లో నటిస్తున్నది?’ అని అప్పుడప్పుడూ నాకు నేనే ఆశ్చర్యపోతుంటాను! ‘అలా జరిగి ఉండాల్సింది కాదు’, ‘నేను అలా చేసి ఉండాల్సింది కాదు’ అంటూ గతాన్ని తలచుకొని బాధ పడను. ప్రతి సంఘటనా పాఠాన్ని నేర్పే అనుభవం, ఒక ప్రయాణం అనుకుంటాను. అనుభవాలు నేర్పించే పాఠాల వల్ల మానసిక పరిణతి వస్తుంది. ఇక నేను నమ్మే విషయాలకు వస్తే, ప్రతి వ్యక్తికీ తనదైన లక్ష్యం, గుర్తింపు ఉండాలని, ఎప్పుడు ఇతరులకు భారం కాకూడదనుకుంటాను. ఇక నా లోపాల గురించి చెప్పాల్సి వస్తే... అన్ని విషయాలను సమానంగా బ్యాలెన్స్‌ చేయడంలో విఫలమవుతున్నానేమో అనిపిస్తుంటుంది.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా