ఇక నేను రిటైర్ కావాలనుకుంటున్నా

11 Sep, 2014 23:51 IST|Sakshi
ఇక నేను రిటైర్ కావాలనుకుంటున్నా

 తమ అభిమాన తారల నుంచి ఏ మాట అయితే వినకూడదని అభిమానులు కోరుకుంటారో... ఇటీవల సమంత నోటి నుంచి ఆమె అభిమానులు అలాంటి మాటే విన్నారు. ‘‘నా చేతినిండా సినిమాలున్నప్పుడే నేను నటనకు ఫుల్‌స్టాప్ పెట్టేస్తా’’ అని ఇటీవల ఓ ఇంటర్వ్యూలో సమంత పేర్కొన్నారు. ఈ మాటలు అభిమానులకు షాకింగ్‌గా ఉంటాయని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.
 
 అయితే, చేతిలో సినిమాలేవీ లేనప్పుడు ‘ఇక నేను రిటైర్ కావాలనుకుంటున్నా’ అని ప్రకటించే బదులు, ఫుల్ బిజీగా ఉన్నప్పుడే అలా ప్రకటిస్తే, గౌరవంగా ఉంటుందన్నది సమంత అభిప్రాయం అయ్యుండొచ్చు. కానీ, ఆమె సన్నిహితులు, మిత్రులు మాత్రం ఇప్పుడప్పుడే ఇలాంటి నిర్ణయాలు తీసుకోవద్దని వెనక్కి లాగుతున్నారట. అందుకని, రిటైర్‌మెంట్ విషయంలో బలమైన నిర్ణయం తీసుకోలేకపోతున్నానని సమంత చెప్పారు. ఈ మాటలు అభిమానులకు కొంత ఊరటగా ఉంటాయని చెప్పొచ్చు.