మాటల్లేవ్‌... ఇళయరాజా పాటల్లేవ్‌!

19 Mar, 2017 23:34 IST|Sakshi
మాటల్లేవ్‌... ఇళయరాజా పాటల్లేవ్‌!

‘‘అమెరికా టూర్‌ ప్రారంభానికి ముందు ఇళయరాజా నాతో ఈ అంశాన్ని చర్చిస్తే ఆయనతో మాట్లాడేవాణ్ణి. కానీ, లీగల్‌ నోటీస్‌ వచ్చిన తర్వాత నేనూ లీగల్‌గానే స్పందించవలసి (నేనెప్పుడూ అలా చేయాలనుకోను) ఉంటుంది లేదా చట్టాన్ని అంగీకరించాలి. నాకూ ఆత్మగౌరవం ఉంది’’ అని ప్రముఖ గాయకుడు ఎస్పీ బాలసుబ్రమణ్యం అన్నారు. ‘ఎస్పీబీ50’ పేరుతో ఇటీవల అమెరికాలో నిర్వహించిన మ్యూజిక్‌ కన్సర్ట్‌లో సింగర్స్‌ ఇళయరాజా పాటలు ఆలపించారు. తన అనుమతి లేకుండా తన పాటలు పాడడంపై ఎస్పీబీకి ఇళయరాజా లీగల్‌ నోటీసులు పంపారు.

దీనిపై ఎస్పీబీ స్పందిస్తూ –‘‘నాతో పాటు గాయని చిత్ర, చరణ్, మ్యూజిక్‌ కన్సర్ట్‌ నిర్వహకులకు లీగల్‌ నోటీసులు అందాయి. ఇళయరాజా అనుమతి లేకుండా ఆయన పాటలు పాడితే... కాపీరైట్‌ చట్టాలను ఉల్లంఘించినట్లేననీ, అందుకు భారీ మొత్తంలో ఆర్థిక జరిమానా చెల్లించడంతో పాటు చట్టపరమైన చర్యలను ఎదుర్కోవాల్సి ఉంటుందని వాటిలో పేర్కొన్నారు. ఈ చట్టాలపై నాకు అవగాహన లేదు. గతంలో ఇతర దేశాల్లో మ్యూజిక్‌ కన్సర్ట్‌లు నిర్వహించినప్పుడు లేనిది, ఇప్పుడీ అమెరికా టూర్‌ ప్రారంభించిన తర్వాత ఎందుకు నోటీసులు పంపారో అర్థం కావడం లేదు. ముందు చెప్పినట్టు నాకు చట్టాలపై అవగాహన లేదు. ఇదే చట్టమైతే.. నేను పాటిస్తా. ఈ పరిస్థితుల్లో ఇకపై ఇళయరాజా పాటలు పాడలేము. కానీ, షోలు జరుగుతాయి. భగవంతుడి దయ వల్ల ఇతర స్వరకర్తలకు నేను చాలా పాటలు పాడాను.

వాటిని ‘ఎస్పీబీ50’లో ఆలపిస్తాం. శ్రోతలు ఎప్పటిలా ప్రేమాభిమానాలు చూపిస్తారని ఆశిస్తున్నా. ఈ అంశంపై ఎవరూ కఠినంగా స్పందించొద్దని విజ్ఞప్తి చేస్తున్నా. ఇదంతా భగవంతుడి లీల అయితే... భక్తిశ్రద్ధలతో శిరసావహిస్తా. సర్వేజనా సుఖినోభవంతు’’ అన్నారు. ‘‘కన్సర్ట్‌ నిర్వహకులకు నష్టాలు రావాలనీ, స్నేహితుడు ఇళయరాజాకు అసౌకర్యం కలిగించాలానీ అనుకోవడం లేదు. ప్రేక్షకులకు విషయం తెలియజేయాలనే సోషల్‌ మీడియాలో ఈ పోస్ట్‌ చేశా’’ అన్నారు ఎస్పీబీ.