శ్రమశిక్షణ

18 Nov, 2018 05:42 IST|Sakshi
జాన్వీ కపూర్‌

ఉదయం ఓ సినిమా లొకేషన్‌.. మధ్యాహ్నం మరో సినిమా.. సాయంత్రం ఇంకో సినిమా.. ఇలా ఒకప్పుడు శ్రీదేవి షిఫ్టులవారీగా పని చేసేవారు. అలాగే క్యారెక్టర్‌ డిమాండ్‌ చేస్తే ఎంత కష్టం అయినా పడటానికి వెనకాడేవారు కాదు. ఆమె కుమార్తె జాన్వీ కూడా అచ్చం తల్లిలానే. ఒక పాత్ర కోసం జాన్వీ రోజుకి దాదాపు 14 గంటలు ట్రైనింగ్‌ తీసుకుంటున్నారంటే చిన్న విషయం కాదు కదా. ఇంతకీ జాన్వీని ఇంతలా కష్టపెడుతున్న ఆ పాత్ర ఏ సినిమాలో అంటే? కరణ్‌ జోహార్‌ దర్శకత్వం వహించనున్న పీరియాడికల్‌ మూవీ ‘తక్త్‌’లో జాన్వీ ఈ పాత్ర చేయనున్నారు. కరణ్‌ నిర్మాతగా జాన్వీని పరిచయం చేసిన ‘ధడక్‌’ హిట్‌ అనే విషయం తెలిసిందే.

ఇప్పుడు సెకండ్‌ సినిమాకే జాన్వీకి భారీ పాత్ర ఇచ్చేశారు కరణ్‌. సవాల్‌గా తీసుకున్నారు జాన్వీ. పైగా రణ్‌వీర్‌ సింగ్, కరీనా కపూర్, ఆలియా భట్, అనిల్‌ కపూర్‌ వంటి స్టార్స్‌తో ఆమె ఈ సినిమాలో నటించబోతున్నారు. ఈ అవకాశాన్ని పూర్తిగా సద్వినియోగం చేసుకోవాలనుకున్నారు. అందుకే ఈ సినిమాలో తన పాత్ర కోసం శిక్షణ తీసుకుంటూ గంటల తరబడి శ్రమిస్తున్నారట. పీరియాడికల్‌ చిత్రం కాబట్టి డైలాగులు, డ్యాన్స్‌కి ప్రాధాన్యం ఎక్కువ ఉంటుంది. అందుకే ఉదయం సుమారు 10 గంటల నుంచి రాత్రి 2 గంటల వరకూ సమయాన్ని లెక్క చేయకుండా డ్యాన్స్‌ క్లాస్‌లు, డైలాగ్స్‌ పలకడం ప్రాక్టీస్‌లో మునిగి తేలుతున్నారట జాన్వీ. ఈ చిత్రం వచ్చే ఏడాది ఆరంభం కానుంది.

మరిన్ని వార్తలు