కొత్త శౌర్యను చూస్తారు

31 Jan, 2020 02:56 IST|Sakshi
బుజ్జి, రమణతేజ, ఉష, గౌతమ్, నాగశౌర్య, కె.రాఘవేంద్రరావు, శంకర్‌ప్రసాద్‌

– నాగశౌర్య

‘‘నటుడిగా నాగశౌర్య ఎలాంటి పాత్రలోనైనా ఒదిగిపోగలడు. గెడ్డం తీస్తే క్లాస్‌గా కనిపిస్తాడు. గెడ్డం ఉంటే ఫైటర్‌గా ఉంటాడు. కీరిటం పెడితే కృష్ణుడిలా, క్యాప్‌ పెడితే కౌబాయ్‌లా ఉంటాడు. ‘ఊహలు గుసగుసలాడే’, ‘ఛలో’ వంటి సక్సెస్‌ల సమయంలో నా కన్ను నాగశౌర్యపై పడింది’’ అన్నారు ప్రముఖ దర్శకులు కె. రాఘవేంద్రరావు. నాగశౌర్య హీరోగా నటించిన చిత్రం ‘అశ్వథ్థామ’. రమణ తేజ దర్శకత్వంలో ఉషా మూల్పూరి నిర్మించిన ఈ చిత్రం నేడు విడుదలవుతోంది.

ఈ సందర్భంగా జరిగిన విలేకరుల సమావేశంలో రాఘవేంద్రరావు మాట్లాడుతూ– ‘‘కొత్తగా ఇండస్ట్రీకి వస్తున్న దర్శకులు, సాంకేతిక నిపుణులు మంచి మంచి సినిమాలు తీస్తున్నారు. ‘అశ్వథ్థామ’ చిత్రం చూడలేదు. కానీ ఈ చిత్రం నా ఊహకు ఓ కమర్షియల్‌ కుటుంబ కథా చిత్రంలా అనిపిస్తుంది. యాక్షన్, ఎమోషన్, సెంటిమెంట్‌ ఇలా అన్ని అంశాలు ఉన్న ఈ చిత్రం హిట్‌ సాధిస్తుంది’’  అన్నారు. ‘‘రాఘవేంద్రరావుగారి ఆశీస్సులతో ఈ సినిమా మొదలైంది. ఆయన చేయి చాలా మంచిదని అంటుంటారు.

మా సినిమా బాగా వచ్చింది. ప్రేక్షకుల అభిప్రాయాలను నా చెవులతో వినడానికి సిద్ధంగా ఉన్నాను. ఇందులో కొత్త శౌర్యను చూస్తారు’’ అన్నారు నాగశౌర్య. ‘‘ఈ సినిమాను రమణతేజ బాగా తీశాడని చెప్పుకుంటున్నారు. కానీ నాగశౌర్య మంచి కథను అందించారు. ఓ మంచి కారణంతో తీసిన ఈ సినిమా ప్రేక్షకులకు నచ్చుతుంది’’ అన్నారు రమణతేజ. ‘‘మా తమ్ముడు ఇప్పటివరకు 17 సినిమాలు చేశాడు. ప్రతి సినిమాకు నేను ఏదో ఒక కంప్లైట్‌ చేసేవాడిని. ఈ సినిమాకు అలా ఏం లేదు.

రమణతేజ ఈ సినిమాను బాగా తీశారు’’ అన్నారు ఐరా క్రియేషన్స్‌ డిజిటల్‌ డైరెక్టర్‌ గౌతమ్‌. ‘‘అవకాశాల కోసం ప్రయత్నించి ఇక ఇంటికి వెళ్లిపోదామని అనుకుంటున్న సమయంలో ఈ సినిమా అవకాశం వచ్చింది. ‘ఛలో’ వంటి సూపర్‌ సక్సెస్‌ కొట్టిన నాగశౌర్య సినిమాకు నేను డైలాగ్స్‌ రాయడం ఏంటీ? అనుకున్నాను. శౌర్య ఓ సీన్‌ ఇచ్చి రాయమన్నారు. రాశాను. వెంటనే అడ్వాన్స్‌ ఇచ్చి ‘నువ్వు ఈ సినిమాకు రాస్తున్నావ్‌’ అన్నారు. చాలా సంతోషపడ్డాను’’ అన్నారు డైలాగ్‌ రైటర్‌ పరశురామ్‌.

మరిన్ని వార్తలు