పైలెట్‌ కంగనా

25 Jan, 2020 00:29 IST|Sakshi
కంగనా రనౌత్‌

ఈ ఏడాది ద్వితీయార్ధంలో పైలెట్‌గా గగనతలంలో విహరించనున్నారు బాలీవుడ్‌ క్వీన్‌ కంగనా రనౌత్‌. సర్వేష్‌ మేవరా దర్శకత్వంలో రోనీ స్క్రూవాలా ప్రొడక్షన్‌లో తెరకెక్కనున్న వార్‌ బ్యాక్‌డ్రాప్‌ సినిమాలో కంగనా రనౌత్‌ ప్రధాన పాత్రలో నటించనున్నారు. ఈ సినిమాకు ‘తేజస్‌’ అనే టైటిల్‌ అనుకుంటున్నారు. ఇందులో యుద్ధ విమానం నడిపే పైలెట్‌గా కంగనా నటించనున్నారట. ‘‘చిన్నతనం నుంచే మన సైనిక బలగాలంటే నాకు చాలా గౌరవం.

దేశం, ప్రజల రక్షణ కోసం వారు చేస్తున్న సేవలు, త్యాగాలు చాలా గొప్పవి. సోల్జర్‌ పాత్రలో నటించాలని ఎప్పటినుంచో అనుకుంటున్నాను. పైలెట్‌గా నటించబోతున్నందుకు చాలా ఆనందంగా ఉంది. ప్రస్తుతం ‘తలైవి’ (నటి, తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత జీవితం ఆధారంగా తెరకెక్కుతోన్న బయోపిక్‌) సినిమాతో బిజీగా ఉన్నాను. ‘తలైవి’ తర్వాత ఈ సినిమా షూటింగ్‌లో పాల్గొంటాను. అయితే ఈ షూటింగ్‌లో జాయిన్‌ అవ్వడానికంటే ముందే మా డైరెక్టర్‌ సర్వేష్‌ చెప్పినట్లు సరైన శిక్షణ తీసుకుంటాను.

అప్పుడే లొకేషన్‌లో మా పని సులువు అవుతుంది. మంచి స్క్రిప్ట్‌ను నా వద్దకు తీసుకువచ్చి సైనికుల హీరోయిజాన్ని వెండితెరపై సెలబ్రేట్‌ చేసుకునే అవకాశాన్ని కల్పించిన సర్వేష్, రోనీగార్లకు ధన్యవాదాలు’’ అని అన్నారు. ‘‘సోల్జర్స్‌లో మీకు ఎవరు స్ఫూర్తి’’ అనే ప్రశ్నకు సమాధానం ఇస్తూ– ‘‘గత ఏడాది వింగ్‌ కమాండర్‌ అభినందన్‌ వర్థమాన్‌ గురించిన వార్తలను బాగా ఫాలో అయ్యాను. ఆ విపత్కర పరిస్థితులను అభినందన్‌ హ్యాండిల్‌ చేసిన విధానం ఆయన్ను నిజమైన హీరోని చేసింది’’ అన్నారు కంగనా. 

మరిన్ని వార్తలు