మీరు లేకుంటే ఇది జరిగేది కాదు!

11 May, 2019 09:59 IST|Sakshi

ధన్యవాదాలమ్మా. నీవు లేకుంటే ఇది జరిగేది కాదు అని నటి కీర్తీసురేశ్‌ ఉద్వేగంగా స్పందించారు. నటిగా మొదట్లోనే మలయాళం, తమిళం, తెలుగు భాషల్లో విజయాలను అందుకుని స్టార్‌ హీరోయిన్‌ ఇమేజ్‌ను సొంతం చేసుకున్న ఈ బ్యూటీ తాజాగా బాలీవుడ్‌లోనూ తన అదృష్టాన్ని పరిక్షించుకోవడానికి రెడీ అయ్యారు.

ఇలా ఇండియన్‌ హీరోయిన్‌ స్థాయికి చేరుకున్న కీర్తీసురేశ్‌ను నటిగా స్థాయిని పెంచిన చిత్రం మహానటి. తమిళంలో నడిగైయార్‌ తిలగం పేరుతో విడుదలైన ఈ చిత్రంలో దివంగత ప్రఖ్యాత నటీమణి సావిత్రిగా ఒదిగిపోయారు. మరోసారి సావిత్రిని ప్రేక్షకుల కళ్ల ముందుంచిందని కూడా అనవచ్చు. భవిష్యత్‌లో కూడా అలాంటి ఒక గొప్ప అవకాశం కీర్తీసురేశ్‌కు వస్తుందా అన్నది సందేహమే.

నటుడు దుల్కర్‌ సల్మాన్, నటి సమంత ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రాన్ని వర్ధమాన టాలీవుడ్‌ దర్శకుడు నాగ్‌అశ్విన్‌ అద్భుతంగా తెరపై ఆవిష్కరించారు. మహానటి చిత్రం నటి కీర్తీసురేశ్‌లో చాలా పరిణితిని తీసుకొచ్చిందన్నది వాస్తవం. ఈ చిత్రం తరువాత ఈ బ్యూటీ చిత్రాల ఎంపికలో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. 

తన సినీ జీవితాన్ని మార్చేసిన మహానటి చిత్రాన్ని కీర్తీసురేశ్‌  గుర్తు పెట్టుకోకపోతే చాలా పెద్ద తప్పే అవుతుంది. ఆ తప్పును కీర్తీ చేయలేదు. మహానటి చిత్రం విడుదలై గురువారం (9వ తేదీ)కి ఏడాది పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా కీర్తీసురేశ్‌ ఒక ట్వీట్‌ చేశారు. అందులో మీ గురించి మాట్లాడడానికి నాకు మాటలు దొరకడం లేదు. నన్ను ఈ చిత్రంలోకి తీసుకొచ్చి చేర్చినందుకు, ఆ పయనంలో కూడా ఉన్నందుకు, మీ అభిమానాన్ని, ఆశీస్సులను నాకు అందించినందుకు ధన్యవాదాలు. మీరు లేకుంటే ఇది జరిగేది కాదు ధన్యవాదాలు సావిత్రమ్మా.

నాగ్‌ అశ్విన్‌ గురించి చెప్పాలంటే ఆ అద్భుతమైన చిత్రం వెనుక ఉన్న బ్రెయిన్‌ ఆయన. నా ఆత్మవిశ్వాసానికి వెనుక ఉన్న మనిషి.. నన్ను ఎక్కువగా నమ్మిన వ్యక్తి. ఇంత కంటే నేను మీమ్మల్ని ఏం కోరగలను నాగ్‌? స్వప్నదత్, ప్రియాంకదత్‌ ఇంతకంటే శక్తిని మీరు పొందలేరు. ఈ చిత్రానికి రెండు మూల స్తంభాల్లా నిలిచి అన్నింటిని ఎదురొడ్డి నిలిచారు. ఆ పోరాటానికి మొత్తంగా ఫలితం దక్కింది. డేనీ  మీరు సినిమాలో చరిత్ర సృష్టించారు. మిక్కీ జే మేయర్‌ మహానటి పాటలకంటే ఆమెకు మీరు ఇచ్చే కానుక ఏముంటుంది? అని నటి కీర్తీసురేశ్‌ తన ట్విట్టర్‌లో పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు