లేడీ డాన్‌గా నమిత

11 Jul, 2018 07:43 IST|Sakshi

తమిళసినిమా: టీ.రాజేంద్రన్‌ చాలా గ్యాప్‌ తరువాత మళ్లీ మెగాఫోన్‌ పట్టడానికి రెడీ అయ్యారు. ఇంతకు ముందు ఒరు తాయిన్‌ శపథం, ఎన్‌ తంగై కల్యాణి, సంసార సంగీతం, ఇంగవీట్టు వేలన్, మోనీషా ఎన్‌మోనాలిసా, సొన్నాల్‌దాన్‌ కాదలా, తన కొడుకు శింబును హీరోగా పరిచయం చేస్తూ కాదల్‌ అళివదిల్లై వీరాస్వామి వంటి విజయవంతమైన చిత్రాలను నిర్మించిన శింబు సినీ ఆర్ట్స్‌ సంస్థ ద్వారా టీ.రాజేందర్‌ తమిళం, తెలుగు, హిందీ భాషల్లో నిర్మిస్తున్న చిత్రానికి ఇన్రైయ కాదల్‌ డా అనే పేరును నిర్ణయించారు. దీనికి కథ, కథనం, మాటలు, పాటలు, సంగీతం, ఛాయాగ్రహణ పర్యవేక్షణ, దర్శకత్వం బాధ్యతలను టీఆర్‌నే నిర్వహించనున్నారు.

చిత్ర వివరాలను ఆయన తెలుపుతూ ఇందులో నటి నమిత లేడీడాన్‌గా నటించడానికి సమ్మతించారని చెప్పారు. ఆమెతో పాటు పలువురు ప్రముఖ నటీనటులు నటించనున్నారన్నారు. పలువురు కొత్తవారిని పరిచయం చేయనున్నట్లు చెప్పారు. వారితో పాటు రాధారవి, ఇళవరసన్, వీటీవీ గణేశ్, వెన్నిరాడై మూర్తి, పాండు, రోబో శంకర్, మదన్‌బాబు, కవన్‌ జగన్‌ నటించనున్నారని తెలిపారు. ఇది పూర్తిగా యూత్‌ఫుల్‌ లవ్‌స్టోరీగా ఉంటుందని, నేటి తరానికి తగ్గట్టుగా ప్రేమ,ప్రేమ,ప్రేమ మినిహా వేరేమీ ఉండదని టీఆర్‌.పేర్కొన్నారు. మరి ఇలాంటి లవబుల్‌ కథలో లేడీ డాన్‌గా నమిత పాత్ర ఏమిటో అన్న ఆసక్తి కలుగుతోందా? ఆ వివరాలు తెలియాలంటే మరి కొద్ది రోజులు ఆగాల్సిందే. ఈ చిత్రానికి సహ నిర్మాతగా ఉషా రాజేందర్, సహాయ నిర్మాతగా ఫరూక్‌ పిక్చర్స్‌ టి.ఫరూక్‌ వ్యవహరిస్తున్నారు.

మరిన్ని వార్తలు