ఐజయ్య ఎవరో మీ నాన్ననడుగు

11 Jul, 2018 07:36 IST|Sakshi
గతంలో నిధులు మంజూరు చేయాలని ఎమ్మెల్యే ఇచ్చిన నివేదిక ప్రతిని చూపుతున్న వంగాల భరత్‌కుమార్‌రెడ్డి, తదితరులు

మిడుతూరు: ‘నాలుగేళ్ల ప్రజావ్యతిరేక పాలన గురించి ధైరంగా ప్రజలకు వివరిస్తుండగా పరువుపోతుందన్న బాధతో మైక్‌ కట్‌ చేసిన మీ నాన్న, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని అడుగు ఎమ్మెల్యే ఐజయ్య అంటే ఎవరో చెబుతారు’ అని  వైఎస్సార్‌సీపీ రైతు విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వంగాల భరత్‌కుమార్‌రెడ్డి మంత్రి లోకేష్‌కు హితవు పలికారు. జిల్లా పర్యటనలో భాగంగా నందికొట్కూరు నియోజకవర్గం బ్రాహ్మణకొట్కూరుకు వచ్చిన పంచాయతీరాజ్‌ శాఖ మంత్రి నారా లోకేష్‌ స్థానిక ఎమ్మెల్యే ఐజయ్య ఎవరో ఇంతవరకు తనకు తెలియదని వ్యంగ్యంగా మాట్లాడటం తగదన్నారు. మండల పరిధిలోని మాసపేటలో ఎమ్మెల్యే తనయుడు వై.చంద్రమౌళితో కలిసి భరత్‌కుమార్‌రెడ్డి విలేకరులతో మాట్లాడారు. వార్డుమెంబర్‌గా కూడా గెలవలేని తమరు దొడ్డిదారిన మంత్రి పదవిని చేపట్టి.. 23 వేల ఓట్ల మెజార్టీతో గెలుపొందిన ఎమ్మెల్యే వై.ఐజయ్యను ఎవరో తెలియదనడం హాస్యాస్పదమన్నారు.

నందికొట్కూర్‌ అభివృద్ధికి నిధులు కావాలని ఎవరూ అడగలేదనడంలో కూడా నిజం లేదన్నారు. అనుక్షణం నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో ఉంటున్న ఎమ్మెల్యే 2016జూలై 18న రూ.6 కోట్లు, సెప్టెంబర్‌ 8న రూ.5 కోట్లు, అక్టోబర్‌ 4న రూ.5 కోట్లు, 2017 అక్టోబర్‌ 4న ఎస్‌డీఎఫ్‌ ఫండ్స్‌ ఇవ్వాలని ముఖ్యమంత్రి, కలెక్టర్‌ దృష్టికి తీసుకెళ్లారని, ఇవేవీ తెలయకుండా మాట్లాడటం అవివేకానికి నిదర్శనమన్నారు. సమావేశంలో రైతు విభాగం జిల్లా ప్రధాన కార్యదర్శి జనార్ధన్‌రెడ్డి, వైఎస్సార్‌సీపీ జిల్లా కార్యదర్శి భాస్కరరెడ్డి, కడుమూరు మాజీ సర్పంచ్‌ గోవర్ధన్‌రెడ్డి, నాయకులు లోకేశ్వరరెడ్డి, మల్లికార్జునరెడ్డి, ఎల్లారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

>
మరిన్ని వార్తలు