'లంక' మూవీ రివ్యూ

21 Apr, 2017 13:18 IST|Sakshi
'లంక' మూవీ రివ్యూ

టైటిల్ : లంక
జానర్ : సస్పెన్స్ థ్రిల్లర్
తారాగణం : రాశి. సాయి రోనక్, ఈన సాహా,
సంగీతం : శ్రీ చరణ్
దర్శకత్వం : శ్రీ ముని
నిర్మాత : నమన విష్ణు కుమార్, నమన దినేష్

ఒకప్పుడు హీరోయిన్ గా స్టార్ హీరోలతో సినిమాలు చేసిన నటి రాశి, లాంగ్ గ్యాప్ తరువాత కళ్యాణ వైభోగమే సినిమాతో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా రీ ఎంట్రీ ఇచ్చింది. అయితే రీ ఎంట్రీలోనూ తన మార్క్ చూపించేందుకు భర్త శ్రీముని దర్శకత్వంలో నెగెటివ్ షేడ్స్ ఉన్న పాత్రతో ఆకట్టుకునే ప్రయత్నం చేసింది. సస్పెన్స్ థ్రిల్లర్ గా తెరకెక్కిన లంక సినిమా రాశి అనుకున్న విజయాన్ని అందించిందా..? థ్రిల్లర్ జానర్ లో తెరకెక్కిన సినిమాలు వరుస సక్సెస్ సాధిస్తున్న నేపథ్యంలో లంక మరో హిట్ సినిమా అనిపించుకుందా..?


కథ :
సాయి (సాయి రోనక్), సుధా( సుదర్శన్) ఎలాగైన సినీ రంగంలో స్థిరపడాలన్న కోరికతో తల్లితండ్రులు ఎంత తిడుతున్నా పట్టించుకోకుండా సినిమా ప్రయత్నాలు చేస్తుంటారు. సిల్వర్ స్క్రీన్  మీద ఛాన్స్ కొట్టాలంటే ముందు షార్ట్ ఫిలింతో ప్రూవ్ చేసుకోవాలని నిర్ణయించుకుంటారు. ఆ షార్ట్  ఫిలింను తానే నిర్మిస్తానని మాట ఇవ్వటంతో పాత సామాన్ల వ్యాపారం చేసే సత్యను హీరోగా తీసుకుంటారు. హీరోయిన్ కోసం వెతుకుతుండగా.. ఓ షాపింగ్ మాల్ స్వాతి(ఈన సాహా)ను చూసి ఆమెనే  హీరోయిన్ గా ఫిక్స్ అవుతాడు. అప్పటికే మలయాళ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ అయిన స్వాతి ముందు కాదన్న అప్పటికే తాను ఓ పెద్ద ప్రమాదంలో ఉండటంతో దాని నుంచి తప్పించుకోవడానికి షార్ట్ ఫిలిం లో నటించేందుకు ఒప్పుకుంటుంది.

అయితే స్వాతి హీరోయిన్ అని తెలియని సాయి, సుధాలు రెబాకా విలియమ్స్(రాశి)  బంగ్లాలో షూటింగ్ స్టార్ట్ చేస్తారు. ఎవరూ లేని ఇంట్లో ఒక్కతే ఉండే రెబాకా ప్రవర్తన అందరికీ వింతగా అనిపిస్తుంది. చనిపోయిన తన పిల్లలను ఉన్నట్టుగా ఊహించుకొని బతుకుతున్న రెబాకాకు స్వాతి దగ్గరవుతుంది. రెబాకాతో ఉన్న సమయంలో తన బాధలన్ని మర్చిపోయి హాయిగా ఉంటుంది. ఆ సమయంలో అనుకోకుండా స్వాతి కనిపించకుండా పోయిందన్న వార్త నేషనల్ మీడియాలో ప్రసారమవుతుంది. స్టార్ హీరోయిన్ మిస్ అవ్వటంతో పోలీస్ డిపార్ట్మెంట్ కేసు ను సీరియస్ గా తీసుకుంటుంది. స్వాతితో షార్ట్ ఫిలిం తీసిన సాయి టీంను అరెస్ట్ చేసి ఇంటరాగేట్ చేస్తారు. అదే సమయంలో స్వాతికి దగ్గరైన రెబాకాను అనుమానిస్తారు. అసలు స్వాతి ఎలా మిస్ అయ్యింది..? స్వాతి ఏ ప్రమాదం నుంచి తప్పించుకోవడానికి షార్ట్ ఫిలిం చేసేందుకు ఒప్పుకుంది..? రెబాకాకు స్వాతికి సంబంధం ఏంటి..? చివరకు స్వాతి రెబాకాలు ఏమయ్యారు...? అన్నదే మిగతా కథ.

నటీనటులు :
ఒకప్పటి హీరోయిన్లందరూ రీ ఎంట్రీలో అత్త అమ్మ పాత్రలకు పరిమితమవుతుంటే, రాశీ మాత్రం ప్రయోగాత్మక చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. నెగెటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో సెటిల్ పర్ఫామెన్స్ తో ఆకట్టుకుంది. ఉన్నంతలో తన పరిథి మేరకు సినిమా స్థాయిని పెంచే ప్రయత్నం చేసింది. హీరో హీరోయిన్లుగా సాయి రోనక్, ఈన సాహాలు తమ పాత్రలకు పూర్తి న్యాయం చేశారు. ముఖ్యంగా హీరోయిన్ ఈన సాహా మంచి వేరియేషన్స్ చూపించింది. ఒకే సినిమాలో రెండు డిఫరెంట్ వేరియషన్స్ ఉన్న పాత్రల్లో కనిపించిన శిజు రెండు పాత్రలకు పూర్తి న్యాయం చేశాడు. సుప్రీత్, సత్యం రాజేష్, సుదర్శన్, సత్యలు పాత్రకు తగ్గ నటనతో ఆకట్టుకున్నారు.

సాంకేతిక నిపుణులు :
భార్య రీ ఎంట్రీ కోసం దర్శకుడు శ్రీ ముని తయారు చేసుకున్న లైన్ బాగున్నా.. కథనం నడిపించిన తీరు మాత్రం ఆకట్టుకునేలా లేదు. ముఖ్యంగా చాలా సన్నివేశాలను జరగనివి జరిగినట్టుగా చూపించే ప్రయత్నంలో కన్య్ఫూజన్ క్రియేట్ అయ్యింది. కథకు మూలమైన రాశి పాత్రను డిజైన్ చేసిన తీరు ఆకట్టుకుంటుంది. అనవసరమైన పాటలను ఇరికించకుండా సినిమా రన్ టైం ను తగ్గించటం సినిమాకు ప్లస్ అయ్యింది. శ్రీ చరణ్ సంగీతం ఓకె. సినిమాటోగ్రఫి, ఎడిటింగ్, నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్టుగా ఉన్నాయి.

ప్లస్ పాయింట్స్ :
రాశి నటన
స్టోరి లైన్

మైనస్ పాయింట్స్ :
కథనం
అసలు కథకు సంబంధం లేని ఊహలు

- సతీష్ రెడ్డి జడ్డా, ఇంటర్నెట్ డెస్క్

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
సినిమా