LEO Review: ‘లియో’మూవీ రివ్యూ

19 Oct, 2023 18:51 IST|Sakshi
Rating:  

టైటిల్‌: లియో
నటీనటులు: విజయ్‌, త్రిష, సంజయ్‌ దత్‌, అర్జున్‌, గౌతమ్‌ వాసుదేవ్‌ మీనన్‌ తదితరులు
నిర్మాతలు: ఎస్ఎస్ లలిత్ కుమార్, జగదీష్ పళనిసామి
తెలుగులో విడుదల: సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌
రచన-దర్శకత్వం: లోకేష్‌ కనగరాజ్‌
సంగీతం: అనిరుధ్‌ రవిచందర్‌
సినిమాటోగ్రఫీ: మనోజ్‌ పరమహంస
విడుదల తేది: అక్టోబర్‌ 19, 2023

కథేంటంటే..
పార్తి అలియాస్‌ పార్తిబన్‌(విజయ్‌) హిమాచల్‌ ప్రదేశ్‌లోని ఓ చిన్న పట్టణంలో స్థిరపడ్డ తెలుగువాడు. అక్కడ ఒక కాఫీ షాప్‌ రన్‌ చేస్తూ.. భార్య సత్య(త్రిష), ఇద్దరు పిల్లలు(పాప, బాబు)తో సంతోషంగా జీవితం గడుపుతుంటాడు. ఓ సారి తన కాఫీ షాపుకు ఓ దొంగల ముఠా వచ్చి డబ్బును దోచుకెళ్లే ప్రయత్నం చేస్తుంది. వారిని అడ్డుకునే క్రమంలో తుపాకితో అందరిని కాల్చి చంపేస్తాడు పార్తి. దీంతో అతను అరెస్ట్‌ అవుతాడు. ఆత్మ రక్షణ కోసమే వారిని చంపినట్లు కోర్టు భావించి..అతన్ని నిర్ధోషిగా ప్రకటిస్తుంది. పార్తి ఫోటో ఓ వార్త పత్రికలో చూసి ఏపీలోని ఆంటోని దాస్‌(సంజయ్‌ దత్‌) గ్యాంగ్‌.. హిమాచల్‌ ప్రదేశ్‌కు వస్తుంది. పార్తిని చంపడమే వారి లక్ష్యం. దీనికి కారణం ఏంటంటే.. పార్తి, 20 ఏళ్ల కిత్రం తప్పిపోయిన ఆంటోని దాస్‌ కొడుకు లియోలా ఉండడం. అసలు లియో నేపథ్యం ఏంటి? సొంత కొడుకునే చంపాలని ఆంటోని, అతని సోదరుడు హెరాల్డ్‌ దాస్‌(అర్జున్‌) ఎందుకు ప్రయత్నిస్తున్నాడు? పార్తి, లియో ఒక్కరేనా? ఆంటోని గ్యాంగ్‌ నుంచి తన ఫ్యామిలిని కాపాడుకునేందుకు పార్తి ఏం చేశాడు? చివరకు ఏమైంది? అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే. 

ఎలా ఉందంటే.. 
లియో.. లోకేష్‌ కగనరాజ్‌ సినిమాటిక్‌ యూనివర్స్‌లో భాగంగా వచ్చిన చిత్రం. అలా అని ఖైదీ, విక్రమ్‌ చిత్రాలతో దీనికి సంబంధం ఉండదు. ఖైదీలోని నెపోలియన్‌ పాత్ర, చివర్లో ‘విక్రమ్‌’(కమల్‌ హాసన్‌) నుంచి లియోకి ఫోన్‌ రావడం.. ఇవి మాత్రమే లోకేష్‌ కగనరాజ్‌ యూనివర్స్‌ నుంచి తీసుకున్నారు. మిగత స్టోరి అంతా డిఫరెంట్‌గా ఉంటుంది. కథనం మాత్రం లోకేష్‌ గత సినిమాల మాదిరే చాలా స్టైలీష్‌గా, రేసీ స్క్రీన్‌ప్లేతో సాగుతుంది. ఇందులో యాక్షన్‌ కంటే ఫ్యామిలీ ఎమోషన్‌ మీదనే ఎక్కువ దృష్టిపెట్టాడు. 

ఓ ముఠా కలెక్టర్‌ని హత్య చేసే సన్నివేశంతో కథ ప్రారంభం అవుతుంది. ఆ తర్వాత హైనా(కృర జంతువు)ఫైట్‌ సీన్‌తో హీరో ఎంట్రీ ఉంటుంది. ఆ తర్వాత పార్తి ఫ్యామిలీ పరిచయం.. భార్య, పిల్లలతో అతనికి ఉన్న అనుబంధాన్ని తెలియజేసే సన్నివేశాలతో కథ ముందుకు సాగుతుంది. అయితే ఫ్యామిలీ ఎపిసోడ్‌ కాస్త బోరింగ్‌ అనిపిస్తుంది.

కాఫీ షాపులో యాక్షన్‌ ఎపిసోడ్‌ తర్వాత కథనం ఆసక్తికరంగా సాగుతుంది. పార్తి ఫోటో పేపర్‌లో చూసి ఆంటోని గ్యాంగ్‌ హిమాచల్‌ ప్రదేశ్‌కు రావడంతో కథపై మరింత ఆసక్తి పెరుగుతుంది. అసలు లియో ఎవరు? ఆంటోని నేపథ్యం ఏంటనే క్యూరియాసిటి ప్రేక్షకుల్లో పెరుగుతుంది. ఆంటోని, పార్తి తొలిసారి కలిసే సీన్‌ కూడా అదిరిపోతుంది. ఇంటర్వెల్‌ ముందు ఆంటోని, పార్తికి మధ్య వచ్చే ఛేజింగ్‌ సన్నివేశం అయితే హైలెట్‌. లియో నేపథ్యం ఏంటి? తండ్రి, కొడుకులను ఎందుకు వైరం ఏర్పడిదనేది సెకండాఫ్‌లో చూపించారు.

కథ పరంగా సినిమాలో కొత్తదనం ఏమి ఉండదు కానీ లోకేష్‌ మేకింగ్‌ ఫ్రెష్‌గా అనిపిస్తుంది. ‘ఖైది’ నెపోలియన్‌ పాత్రను ఇందులో యాడ్‌ చేసిన విధానం బాగుంటుంది.  అయితే లియో పాత్ర పండించిన ఎమోషన్‌ మాత్రం వర్కౌట్‌ కాలేదు. తండ్రి,బాబాయ్‌, చెల్లి..  ఏ పాత్రతోనూ ఎమోషనల్‌గా కనెక్ట్‌ కాలేదనిపిస్తుంది.  క్లైమాక్స్‌లో హెరాల్డ్‌ దాస్‌తో వచ్చే సన్నివేశాలు సాగదీతగా అనిపిస్తాయి.  

ఎవరెలా చేశారంటే..
లియో, పార్తి.. రెండు విభిన్నమైన పాత్రలో విజయ్‌ అదరగొట్టేశాడు.  స్టార్‌డమ్‌ని పక్కకి పెట్టి ఇద్దరు పిల్లల తండ్రిగా నటించాడు. పార్తి పాత్రలో ఆయన లుక్‌, గెటప్‌ ఆకట్టుకుంటాయి.  ఇక నెగెటివ్‌ షేడ్స్‌ ఉన్న లియో పాత్రలో అభిమానులు కొరుకునే విజయ్‌ కనిపిస్తాడు. గెటప్‌ పరంగానే కాదు యాక్టింగ్‌ పరంగానూ రెండు విభిన్నమైన పాత్రల్లో విజయ్‌ చక్కగా నటించాడు.

ఇక హీరో భార్య సత్య పాత్రకి త్రిష న్యాయం చేసింది.  విజయ్‌, త్రిషల కెమిస్ట్రీ తెరపై బాగా పండింది.  విలన్‌ ఆంటోనిగా సంజయ్‌ దత్‌, అతని సోదరుడు హెరాల్డ్‌ దాస్‌గా అర్జున్‌.. మంచి విలనిజాన్ని పండించారు.  కానీ ఆ రెండు పాత్రలను ముగించిన తీరు మాత్రం అంతగా ఆకట్టుకోలేదు. గౌతమ్ మీనన్, మన్సూర్ అలీ ఖాన్‌తో పాటు మిగిలిన నటీనటులు తమ పాత్రల పరిధిమేర నటించారు. 

ఇక సాంకేతిక విషయాలకొస్తే.. ఈ చిత్రానికి ప్రధాన బలం అనిరుధ్‌ సంగీతం.  గత సినిమాల మాదిరే లియోకి కూడా అదరిపోయే బీజీఎం ఇచ్చాడు. ముఖ్యంగా యాక్షన్‌ సీక్వెన్స్‌లో అనిరుద్‌ ఇచ్చిన బ్యాక్‌గ్రౌండ్‌ స్కోర్‌ గూస్‌బంప్స్‌ తెప్పిస్తాయి. మనోజ్ పరమహంస సినిమాటోగ్రఫీ బాగుంది.  నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్లు ఉన్నతంగా ఉన్నాయి. 
-అంజి శెట్టె, సాక్షి వెబ్‌ డెస్క్‌

Rating:  
(2.75/5)
మరిన్ని వార్తలు