సకుటుంబంగా... ‘మనం’ అర్ధ శతదినోత్సవం

15 Jul, 2014 00:12 IST|Sakshi

‘సినిమాల పరంగా, పాత్రల పరంగా గతంలో నేను చేసిన తప్పులన్నిటినీ తుడిచేసింది ‘మనం’. మూడేళ్ల క్రితం దర్శకుడు విక్రమ్‌కుమార్ రూపంలో అదృష్టం మా ఇంటి తలుపు తట్టింది. అచ్చతెలుగు కథని మా ద్వారా ప్రేక్షకులకు అందించిన విక్రమ్‌కుమార్ రుణం తీర్చుకోలేనిది. ఈ సినిమాకు పనిచేస్తున్నప్పుడు ఆయన వేరే లోకంలో ఉండేవారు’’ అని హీరో నాగార్జున అన్నారు. విక్రమ్‌కుమార్ దర్శకత్వంలో అక్కినేని నాగేశ్వరరావు, నాగార్జున, నాగచైతన్య కలిసి నటించిన చిత్రం ‘మనం’.
  అక్కినేని ఫ్యామిలీ నిర్మించిన ఈ సినిమా అర్ధ శతదినోత్సవం పూర్తిచేసుకుంది. ఈ సందర్భంగా సోమవారం హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన సభలో నాగ్ తన మనో భావాలు పంచుకున్నారు. ఆయన మాట్లాడుతూ, ‘‘ఈ సినిమాకు ప్రతి ఒక్కరూ మనసుపెట్టి పనిచేశారు. ఈ చిత్రం 85 సెంటర్లలో 50 రోజులు పూర్తిచేసుకుంది. ఓవర్సీస్‌లో అయితే బ్లాక్‌బస్టర్. ఈ సినిమా విజయం సాధించాలని నాన్న ఎన్నో కలలు కనేవారు. ఆరోగ్యం బాగుండకపోయినా కష్టపడి పనిచేశారు. నాన్న తపన చూశాక ఈ సినిమా హిట్ అవుతుందో లేదో అని భయం వెంటాడేది.
 
 ఇప్పుడు హిట్ అయ్యాక నాన్న లేరే అని బాధేస్తోంది’’అన్నారు. వెంకట్ అక్కినేని మాట్లాడుతూ ‘‘ఆస్ట్రేలియాలో ఈ సినిమా చూశాను. 10 నిమిషాలు చూశాను. అంతే... కంటినిండా నీరే. సినిమా కనిపించలేదు. మళ్లీ చూడాలి’’ అన్నారు. నాగచైతన్య మాట్లాడుతూ ‘‘నాన్నతో, తాతయ్యతో కలిసి నటించడం ఒక గొప్ప అనుభవం’’ అన్నారు. నాగ్, కె. రాఘవేంద్రరావు, నిర్మాత మహేష్‌రెడ్డి చేతుల మీదుగా యూనిట్ సభ్యులకు, పంపిణీదారులకు, ఎగ్జిబిటర్లకు జ్ఞాపికల ప్రదానం జరిగింది.