హీరోయిన్ల పరిస్థితి పనిమనుషుల కన్నా దారుణం!

6 Apr, 2016 13:11 IST|Sakshi
హీరోయిన్ల పరిస్థితి పనిమనుషుల కన్నా దారుణం!

ముంబై: ప్రముఖ బాలీవుడ్ సినీ దర్శక నిర్మాత మహేశ్ భట్ ఇండస్ట్రీలోని నటీమణుల గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. చాలామంది టీవీ, సినిమా నటీమణులు బహిరంగంగా మహిళా సాధికారిత గురించి మాట్లాడుతున్నా, ఇంట్లో వారి పరిస్థితి పనిమనుషుల కంటే దారుణంగా ఉందని పేర్కొన్నారు. టీవీనటి ప్రత్యూష బెనర్జీ మృతి నేపథ్యంలో టీవీ, సినీ రంగాల్లో విజయవంతమవుతున్న మహిళలు కూడా భాగస్వాముల విషయంలో ఎందుకు బలహీనంగా మారిపోతున్నారనే చర్చ జరుగుతోంది. దీనిపై మహేశ్ భట్ మాట్లాడుతూ సినీ రంగుల ప్రపంచంలో వృత్తిపరమైన విజయం సాధించినంతమాత్రాన అది భావోద్వేగమైన స్వేచ్ఛను ఇవ్వలేదని అన్నారు.

'ఇది నిజంగా విషాదకరం. అసహనం వెళ్లగక్కే తమ భాగస్వాముల నుంచి మహిళలు విముక్తి పొందేందుకు ఆర్థిక స్వాతంత్ర్యం వారికి దోహద పడుతుందని ఒకప్పుడు నేను అనుకునేవాణ్ని. కానీ, చిత్రసీమలో నేను ఎంతోమంది నటీమణులను చూశాను. వారి వద్ద ఊహించలేనంత డబ్బు ఉంది. మహిళలు, మహిళల సాధికారిత గురించి వారు అద్భుతమైన అభిప్రాయాలు వెల్లడించేవారు. వాళ్లు చెప్పే సూక్తుల కోసం చాలామంది ఎదురుచూసేవాళ్లు. కానీ వ్యక్తిగత జీవితంలో వాళ్లు ఎంతగా హింస ఎదుర్కొన్నారంటే.. పనిమనుషులు కూడా అంతటి అరాచకాన్ని సహించేవాళ్లు కాదు' అని భట్ విలేకరులతో అన్నారు.  

ఆర్థికంగా బలహీనంగా ఉన్న మహిళలు సైతం తమ భర్తలు పెట్టే హింస భరించలేక, తమ బంధాన్ని తెంపేసుకుంటున్నారని, కానీ చాలామంది నటీమణులు మాత్రం ఇప్పటికీ మునిగిపోయేందుకు సిద్ధంగా ఉన్న అనుబంధాలను పట్టుకొని వేలాడుతున్నారని, ఎంతటి ఆర్థిక స్వేచ్ఛ ఉన్నప్పటికీ పలువురు స్టార్ హీరోయిన్లు ఇదేరకమైన అనుబంధాల్లో కొనసాగుతున్నారని ఆయన చెప్పారు. వచ్చే శుక్రవారం విడుదలకానున్న 'లవ్ గేమ్స్' సినిమా ప్రమోషనల్ కార్యక్రమంలో భాగంగా ఆయన విలేకరులతో మాట్లాడారు.