అది కరెక్ట్‌ కాదు

17 Mar, 2019 02:37 IST|Sakshi
నరేశ్, రాజశేఖర్, జీవిత, శివబాలాజీ

– ‘మా’ అధ్యక్షుడు నరేశ్‌

2019–2021 మూవీ ఆర్టిస్ట్స్‌ అసోసియేషన్‌ (మా) అధ్యక్ష పదవికి ఇటీవల జరిగిన ఎన్నికల్లో సీనియర్‌ నరేశ్‌ గెలుపొందిన విషయం తెలిసిందే. నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారానికి ఈ నెల 22న ముహూర్తం నిర్ణయించుకున్నారు నరేశ్‌. అయితే అనుకున్న సమయానికి ప్రమాణ స్వీకారం చేయడానికి శివాజీ రాజా అడ్డుపడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు నరేశ్‌. 2017–2019 కాలపరిమితికి శివాజీ రాజా ‘మా’ అధ్యక్ష పదవిని చేపట్టిన విషయం తెలిసిందే. తాజాగా అధ్యక్షుడిగా ఎన్నికైన నరేశ్‌ ప్రమాణ స్వీకారం చేయాలంటే తన పదవీ కాలం ముగియాలని శివాజీరాజా అంటున్నారని నరేశ్‌ చెబుతున్నారు. ఇంకా నరేశ్‌ మాట్లాడుతూ– ‘‘మా’లో కొన్ని అవకతవకలు జరిగిన మాట వాస్తవం.

అవన్నీ మర్చిపోయి మా గుట్టు బయటపడకుండా అందరినీ కలుపుకుపోయి పనిచేయాలని నిర్ణయించుకున్నాను. అయినా మమ్మల్ని పని చేయకుండా వెనక్కి లాగుతున్నారు. ఇండస్ట్రీ పెద్దల అంగీకారంతో, వారి సమక్షంలో ఈ 22న మంచి మూహుర్తం ఖరారు చేసుకుని ప్రమాణా స్వీకారం చేయాలని నిర్ణయించుకున్నాం. ‘నా పదవీకాలం 31వరకు ఉంది. అప్పటి వరకు ఎవరూ మా కుర్చీలో కూర్చోవద్దు. కోర్టుకి వెళతా అని శివాజీ రాజా ఫోన్‌లో బెదిరిస్తున్నారు. అది కరెక్ట్‌ కాదు. మేము చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి. పెద్దలు ఎలా చెబితే అలా చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం’’ అన్నారు. ఈ కార్యక్రమంలో వైస్‌ ప్రెసిడెంట్‌ రాజశేఖర్, జనరల్‌ సెక్రటరీ జీవితా రాజశేఖర్, ఈసీ మెంబర్స్‌ పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు