అరెరే... చంద్రకళా...జారెనా కిందకిలా...

14 Dec, 2014 00:27 IST|Sakshi
అరెరే... చంద్రకళా...జారెనా కిందకిలా...

 చిరంజీవి ‘మెగా’ కుటుంబం నుంచి మరో వారసుడు ప్రేక్షకులను పలకరించడానికి రంగం సిద్ధమైంది. నాగబాబు కుమారుడు వరుణ్‌తేజ్ తొలి చిత్రం ‘ముకుంద’ విడుదలకు సన్నాహాలు చేసుకుంటోంది. శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో రూపొందుతోన్న ఈ చిత్రంలో ఆఖరు ఘట్టంగా ఒక ముఖ్యమైన పాట ప్రస్తుతం చిత్రీకరణ జరుపుకొంటోంది. మిక్కీ జె. మేయర్ స్వరాలకు ‘సిరివెన్నెల’ సీతారామశాస్త్రి సాహిత్యం కూర్చిన ‘అరెరే... చంద్రకళా... జారెనా కిందకిలా...’ అనే పాటను శనివారం నుంచి హైదరాబాద్‌లోని నానక్‌రామ్‌గూడ రామానాయుడు స్టూడియోలో చిత్రీకరిస్తున్నారు.
 
 నెమళ్ళతో కూడిన అందమైన సెట్‌లో రాజు సుందరం ఈ పాటకు నృత్యం సమకూరుస్తున్నారు. ‘‘సోమవారం వరకు ఈ పాట చిత్రీకరణ సాగుతుంది. దాంతో, సినిమా మొత్తం పూర్తయిపోయినట్లే. ఇప్పటికే నిర్మాణానంతర కార్యక్రమాలు కూడా పూర్తయ్యాయి. ఈ నెల 24న సినిమా రిలీజ్ చేస్తున్నాం’’ అని చిత్ర నిర్మాత నల్లమలుపు బుజ్జి తెలిపారు. ఇటీవల విడుదలైన ఈ చిత్ర ఆడియోకు మంచి స్పందన వస్తోందనీ, చాలా రోజుల తరువాత సాహిత్యం స్పష్టంగా వినిపించేలా ఈ పాటలు ఉన్నాయంటూ శ్రోతలు ఆనందం వ్యక్తం చేస్తున్నారనీ చిత్ర సమర్పకుడు ‘ఠాగూర్’ మధు పేర్కొన్నారు. ఈ చిత్రంపై దర్శకుడు అడ్డాల శ్రీకాంత్ కూడా గట్టి నమ్మకంతో ఉన్నారు.
 
 ‘‘ఇటు పూర్తిగా నగరం కానీ, అటు పూర్తిగా పల్లెటూరు కానీ కాకుండా మధ్యస్థంగా ఉండే పట్నాల్లోని యువతీ యువకుల భావోద్వేగాలు, ఆ వాతావరణం ప్రతిబింబించే కథ ఇది. ఇప్పటి దాకా ‘కొత్త బంగారు లోకం’, ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ లాంటి ఫీల్‌గుడ్ సినిమాలే రూపొందించా. అందుకు భిన్నంగా ఇప్పుడు యాక్షన్ ఓరియంటెడ్ కథాంశంతో ఈ చిత్రం తీశా’’ అని శ్రీకాంత్ వివరించారు. ఆ విశేషాలన్నీ తెరపై చూడడానికి మరొక్క పది రోజులు ఓపిక పట్టాల్సిందే.