'నాగభరణం' మూవీ రివ్యూ

16 Oct, 2016 11:40 IST|Sakshi
'నాగభరణం' మూవీ రివ్యూ

టైటిల్ : నాగభరణం
జానర్ : సోషియో ఫాంటసీ
తారాగణం : విష్ణువర్దన్, దిగంత్, రమ్య, రాజేష్ వివేక్, సాయికుమార్, ముకుల్ దేవ్
సంగీతం : గురుకిరణ్
దర్శకత్వం : కోడి రామకృష్ణ
నిర్మాత : సాజిద్ ఖురేషి, సోహెల్ అన్సారీ, దవల్ గడ

అమ్మోరు, అంజి, అరుంధతి లాంటి సోషియో ఫాంటసీ సినిమాలతో ఆకట్టుకున్న కోడి రామకృష్ణ దర్శకత్వంలో వచ్చిన మరో విజువల్ వండర్ నాగభరణం. దివంగత కన్నడ స్టార్ హీరో విష్ణువర్ధన్ను మరోసారి తెర మీద హీరోగా చూపిస్తూ తెరకెక్కించిన ఈ సినిమా తెలుగు నాట కూడా మంచి హైప్ క్రియేట్ చేసింది. మరి ఆ అంచనాలను నాగభరణం అందుకుందా..? కోడి రామకృష్ణ మరోసారి తన మ్యాజిక్ రిపీట్ చేశాడా..?

కథ :
గ్రహణం సమయంలో తమ శక్తిని కోల్పోయే దేవతలు, ఆ సమయంలో దుష్టశక్తులను ఎదుర్కొనేందుకు తమ శక్తినంతా దారపోసి ఓ మహాకలశాన్ని సృష్టిస్తారు. ఆ మహాకలశాన్ని భూమి మీద ఓ పవిత్ర స్థలంలో ప్రతీష్టించి, శివయ్య వంశస్థులను రక్షణగా నియమిస్తారు. దేవతల మీద ఆదిపత్యం కోసం ఎన్నో దుష్టశక్తులు ఆ కలశాన్ని సొంతం చేసుకోవటానికి యుగయుగాలుగా ప్రయత్నిస్తుంటారు. అలా ప్రయత్నిస్తున్న ఓ దుష్ట శక్తి కపాలి (రాజేష్ వివేక్).

నాగ్ చరణ్(దిగంత్) రాక్ స్టార్.. ఢిల్లీలో జరిగే మ్యూజిక్ కాంపిటీషన్లో విజయం సాధించటమే లక్ష్యంగా పెట్టుకుంటాడు చరణ్. అదే సమయంలో కాంపిటీషన్ విజేతలకు ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ దగ్గర ఉన్న మహాకలశాన్ని బహుమతిగా ప్రకటిస్తారు. పోటిలో గెలవటం కోసం సాధన చేస్తున్న చరణ్ టీంలో స్థానం కోసం మానస(రమ్య) అనే అమ్మాయి వస్తుంది. కొద్ది రోజుల్లోనే చరణ్ టీం మెంబర్స్తో పాటు అతని ఫ్యామిలీకి కూడా దగ్గరవుతుంది.

మహాకలశం మహాత్యం తెలుసుకున్న మల్టీ మిలియనీర్ ఒబెరాయ్(ముకుల్ దేవ్) కూడా కలశాన్ని సొంతం చేసుకోవాలని ప్రయత్నాలు చేస్తుంటాడు. అందుకే పోటిలో తప్పకుండా గెలుస్తాడన్న నమ్మకం ఉన్న చరణ్ను చంపేయడానికి ప్లాన్ చేస్తాడు. చివరకు చరణ్ పోటిలో గెలిచాడా..? చరణ్ దగ్గరకు వచ్చిన మానస ఎవరు..? చివరకు మహాకలశాన్ని కాపాడటానికి పరమేశ్వరుడు పంపిన రక్షకుడు ఎవరు అన్నదే మిగతా కథ..?

విశ్లేషణ:
దివంగత నటుడు విష్ణువర్ధన్ నటించిన 201వ సినిమాగా భారీ హైప్ క్రియేట్ చేసిన నాగభరణం ఆ అంచనాలను ఏ మాత్రం అందుకోలేకపోయింది. ముఖ్యంగా కోడి రామకృష్ణ సినిమా అన్న నమ్మకంతో థియేటర్లలో అడుగుపెట్టిన ప్రేక్షకులకు ఏ విభాగం కూడా ఆయన స్థాయిలో పనిచేసినట్టుగా కనిపించదు. కథా పరంగా భాగానే అనిపించినా.. కథనం విషయంలో ఏ మాత్రం ఆకట్టుకోలేకపోయారు. గురుకిరణ్ సంగీతం సినిమాకు మరో పెద్ద మైనస్. ఎడిటింగ్, సినిమాటోగ్రఫి, గ్రాఫిక్స్ లాంటి విభాగాల గురించి కూడా ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది.

ఇక నటీనటులు కూడా ఏ మాత్రం సినిమాను కాపాడే ప్రయత్నం చేయలేదు. హీరోగా కనిపించిన దిగంత్ కాస్త పర్వాలేదనిపించినా.. తెలుగువారికి తెలిసిన ముఖం కాకపోవటంతో పెద్దగా కనెక్ట్ కాలేదు. హీరోయిన్గా రమ్య ఆకట్టుకోలేకపోయింది. ముఖ్యంగా ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్లో రమ్య క్యారెక్టర్ అరుంధతి సినిమాలో అనుష్క పాత్రకు స్పూఫ్లా అనిపిస్తుంది. మెయిన్ విలన్స్గా నటించిన రాజేష్ వివేక్, ముకుల్ దేవ్ భయపెట్టిన సందర్భాల కన్నా.. నవ్వించిన సందర్భాలే ఎక్కువ. క్లైమాక్స్లో వచ్చే విష్ణువర్ధన్ పాత్ర కన్నడ ప్రేక్షకులను అలరించినా.. తెలుగు ఆడియన్స్కు పెద్దగా కనెక్ట్ కాకపోవచ్చు.

ఓవరాల్గా నాగభరణం సినిమాకు కోడి రామకృష్ణ మీద నమ్మకంతో వెళ్తే మాత్రం తీవ్ర నిరాశ తప్పదు.