నేను క్రియేటర్‌ని కాదు

10 Aug, 2018 01:06 IST|Sakshi
వివేక్‌ కూచిభొట్ల, అనిల్‌ సుంకర, అభిషేక్‌ అగర్వాల్, నాగార్జున, అడవి శేష్, అభిషేక్‌ నామా

నాగార్జున

‘‘గూఢచారి’ టీమ్‌ అంతా న్యూ జనరేషన్‌ యాక్టర్స్, టెక్నీషియన్స్‌. మీరంతా తెలుగు సినిమా భవిష్యత్తు. మీతో పాటు ట్రావెల్‌ చేయాలనుకుంటున్నాను. లేకుంటే నేను వెనకబడిపోతాను’’ అని నాగార్జున అన్నారు. అడివి శేష్, శోభితా ధూళిపాళ జంటగా శశికిరణ్‌ తిక్క దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘గూఢచారి’. అభిషేక్‌ నామా, టి.జి.విశ్వప్రసాద్, అభిషేక్‌ అగర్వాల్‌ నిర్మించిన ఈ సినిమా సక్సెస్‌మీట్‌ హైదరాబాద్‌లో జరిగింది. ముఖ్య అతిథి నాగార్జున మాట్లాడుతూ– ‘‘గూఢచారి’ బడ్జెట్‌ తెలుసుకుని ఎలా సాధ్యమైందని ఆలోచించా.

ఇప్పటి వరకు మేం చేస్తున్న సినిమాలు చూసి మేం అంత సోంబేరులా? బద్ధకస్తులమా? సినిమా తీయడం మాకు తెలియదా? అనిపించింది. ఈ చిత్రం చూశాక నాకు తెలియని లొకేషన్స్‌ అన్నపూర్ణలో ఉన్నాయా? అనిపించింది. సిగ్గేసింది. నాన్నగారు (అక్కినేని నాగేశ్వరరావు) ఉండుంటే చాలా హ్యాపీగా ఫీలయ్యేవారు. నాకు ఇలాంటి సినిమా చేసే అవకాశం రాలేదు. నేను క్రియేటర్‌ని కాను. అందుకనే డైరెక్టర్స్, రైటర్స్‌పైన ఆధారపడతాను.

ఓ స్పై మూవీ తెలుగులో ఎలా ఆడుతుంది? మణిరత్నం ‘బాంబే’ సినిమా కంటే ఏం చేస్తారు? అనిపించింది. ఈ సంవత్సరం ‘రంగస్థలం, మహానటి’ తర్వాత ‘గూఢచారి’ మాత్రమే ఆడింది. అలాగని ఇతర సినిమాలను తక్కువ చేయడం లేదు. సుప్రియను ఇన్ని రోజులు పట్టించుకోలేదు. తను రా ఆఫీసర్‌ రోల్‌కి చక్కగా సూట్‌ అయింది. 1989లో ‘శివ’ వచ్చినప్పుడు దర్శకులకు, నిర్మాతలకు ఎంత ఇన్‌స్పిరేషన్‌ వచ్చిందో.. ‘గూఢచారి’ కూడా చాలా మందికి ఇన్‌స్పిరేషన్‌గా నిలిచింది.

ఈ సక్సెస్‌ ఇలాగే కంటిన్యూ కావాలి. ‘గూఢచారి 2’కి ఆల్‌ ది బెస్ట్‌’’ అన్నారు. ‘‘నేను ఇక్కడ నిలబడి ఉన్నానంటే కారణం నా నిర్మాతలే.మా కలను, మా సినిమాను ప్రపంచానికి చూపించిన అనిల్‌గారికి థ్యాంక్స్‌. నా కెరీర్‌లో బిగ్గెస్ట్‌ హిట్‌ మూవీ ఇచ్చిన శశికి థ్యాంక్స్‌. మా సినిమాని సపోర్ట్‌ చేసినవారికి కృతజ్ఞతలు’’ అన్నారు అడివి శేష్‌. నిర్మాతలు అభిషేక్‌ నామా, అభిషేక్‌ అగర్వాల్, అనిల్‌ సుంకర, సహ నిర్మాత వివేక్‌ కూచిభొట్ల, కెమెరామేన్‌ షానీల్‌ డియో, సంగీత దర్శకుడు శ్రీచరణ్‌ పాకాల, నటీమణులు సుప్రియ, మధుశాలిని పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు