నేను ఆ ఇజమ్‌ను నమ్ముతా!

15 Oct, 2016 22:57 IST|Sakshi
నేను ఆ ఇజమ్‌ను నమ్ముతా!

‘‘వ్యవస్థపై ఓ జర్నలిస్టు చేసిన పోరాటమే ఈ చిత్రకథ. ఎవ్వరికీ హితబోధ చేయట్లేదు. ఓ వ్యక్తి ఫిలాసఫీ, ఐడియాలజీలను చూపిస్తున్నామంతే. సినిమా చూసిన తర్వాత హీరో చేసినట్టు చేస్తే బాగుంటుందనే భావన ప్రతి ఒక్కరిలోనూ కలుగుతుంది. మనకు చాలా ‘ఇజం’లున్నాయి. కానీ, మా ‘ఇజం’కు పేరు పెట్టలేదు. చూసిన ప్రేక్షకులే పెట్టాలి’’ అన్నారు నందమూరి కల్యాణ్‌రామ్. పూరి జగన్నాథ్ దర్శకత్వంలో ఆయన హీరోగా నటించి, నిర్మించిన ‘ఇజం’ ఈ నెల 21న విడుదలవుతోంది. ఈ సందర్భంగా కల్యాణ్‌రామ్ చెప్పిన విశేషాలు..
 
‘పటాస్’ తర్వాత పూరి జగన్నాథ్‌తో సినిమా చేయాలనుకున్నా. అప్పుడాయన దగ్గర కథ లేదు. మళ్లీ కలవగా ‘ఇజం’ కథ చెప్పారు. ఇందులో ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్ట్‌గా నటించాను. వికీలీక్స్ అసాంజే తరహా సన్నివేశాలు సినిమాలో ఉంటాయి. బ్లాక్ మనీ, రాజకీయ నాయకులపై సెటైర్స్ ఉన్నాయి. వ్యక్తిగతంగా నేను హ్యూమనిజమ్‌ను నమ్ముతాను.
నేనిప్పటివరకూ ఏ సినిమాలోనూ ఇంత స్టైలిష్‌గా కనిపించలేదు. ‘ఇది కల్యాణ్‌రామ్ మొదటి సినిమానా?’ అనుకునేంతలా... యాక్టింగ్, డైలాగ్ డెలివరీ, అన్నీ కొత్తగా ఉంటాయి. పూరి కూడా చాలా కొత్తగా తీశారు. ఫస్ట్ డే 500 మంది జూనియర్ ఆర్టిస్టులతో సీన్ చేయాల్సి వచ్చింది. నేను కంగారుపడి.. షూటింగ్ వాయిదా వేద్దామంటే, ‘ఆర్ యూ కాన్ఫిడెంట్? ఆర్ నాట్?’ అని పూరి అడిగారు. ‘యస్..’ అన్నా. ‘అదే స్క్రీన్‌పై చూపించండి’ అన్నారు. ఇప్పటివరకూ నేను  చేసిన సీన్స్‌లో బెస్ట్ సీన్ అది. కోర్టు సీన్ కూడా బాగుంటుంది.

ఈ సినిమాకి మందు పూరి హిట్స్‌లో ఉన్నారా? ఫ్లాప్స్‌లో ఉన్నారా? అని ఆలోచించలేదు. ఇండస్ట్రీలో హీరో, దర్శకుడు.. ఎవ్వరికీ గ్యారెంటీ లేదు. ప్రతి సినిమా హిట్టవు తుందనే నమ్మకంతోనే చేస్తాం. ప్రేక్షకులు ఇచ్చే తీర్పును బట్టి తప్పులను సరి చేసుకోవడమే మా పని.

బహుశా.. హీరోలందరిలో చివరగా సిక్స్‌ప్యాక్ చేసింది నేనే అనుకుంట (నవ్వుతూ..) అందుకని, నేను సిక్స్‌ప్యాక్ గురించి మాట్లాడితే బాగోదు. కథ చెప్పినప్పుడు... ‘హీరో మెంటల్‌గా స్ట్రాంగ్. ఫిజికల్‌గా కూడా స్ట్రాంగ్‌గా ఉంటేనే క్యారెక్టర్ బాగుంటుంది. మీరు సన్నబడాలి’ అన్నారు పూరి. 86 కేజీలు ఉండేవాణ్ణి. బరువు తగ్గి 74 కేజీలకు వచ్చా. నాకు ఫిష్ ఇష్టం ఉండదు. కానీ, మూడు నెలలు సిక్స్‌ప్యాక్ కోసం అదే తిన్నాను. సిక్స్‌ప్యాక్ చేస్తున్నట్టు ముందు ఇంట్లోవాళ్లకు చెప్పలేదు. ఆ తర్వాత నాలో వస్తున్న మార్పు చూసి, ‘ఏంట్రా.. బుగ్గలు లోపలకి వెళ్తున్నాయి. నీరసంగా ఉంటున్నావ్’ అనేవారు.
 
వక్కంతం వంశీ చెప్పిన కథ నచ్చలేదు. అందుకే, ఎన్టీఆర్ హీరోగా వంశీ దర్శకత్వంలో చేయాలనుకున్న  సినిమా పక్కన పెట్టేశాం. సాయిధరమ్ తేజ్‌తో మల్టీస్టారర్ డిస్కషన్స్‌లో ఉంది. ఇంకా కన్ఫర్మ్ కాలేదు.
 
శ్రీమతిపై ప్రేమతో...
నా శ్రీమతి పేరు స్వాతి. మా వివాహమై పదేళ్లయింది. ముఖ్యమైన సందర్భాలప్పుడు ఏదో బహుమతి ఇస్తూనే ఉంటా. నేనే ప్రపంచంగా బతుకుతున్న తనపై నా ప్రేమను వ్యక్తం చేయడానికి చేతిపై ఈ టాటూ వేయించుకున్నాను. ఈ టాటూ చూసిన ప్రతిసారి స్వాతి నా కళ్ల ముందు ఉన్నట్టుంటుంది.