Israeli Journalist Hananya Naftali: భార్యకు గుడ్‌బై.. ఇజ్రాయెల్‌ కోసం భర్త సంచలన నిర్ణయం

10 Oct, 2023 11:02 IST|Sakshi

జెరూసలేం: ఇజ్రాయెల్‌లో భీకర యుద్ధం నడుస్తోంది. ఇజ్రాయెల్‌ దళాలు, హమాస్‌ మిలిటెంట్ల మధ్య హోరాహోరీ యుద్ధం కొనసాగుతోంది. ఈ యుద్ధంలో నెత్తుటేర్లు పారుతున్నాయి. ఇరువర్గాల మధ్య ఘర్షణ మూడు రోజులుగా కొనసాగుతూనే ఉంది.

హమాస్‌ మిలిటెంట్లె లక్ష్యంగా ఇజ్రాయెల్‌ సైన్యం సోమవారం గాజాపై వైమానిక దాడులు ఉధృతం చేసింది. మిలిటెంట్ల చొరబాట్లను అడ్డుకోవడానికి సరిహద్దుల్లో యుద్ధ ట్యాంకులు, డ్రోన్లను మోహరించింది. ఇజ్రాయెల్‌ దాడుల్లో గాజాలో వందలాది భవనాలు నేలమట్టమయ్యాయి. మరోవైపు దక్షిణ ఇజ్రాయెల్‌లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. హమాస్‌ మిలిటెంట్లు ఇజ్రాయెల్‌ జవాన్లపై కాల్పులకు దిగుతున్నారు. రాకెట్లు కూడా ప్రయోగిస్తున్నారు. దీంతో, ఇజ్రాయెల్‌ సైన్యం తిప్పికొడుతోంది. 

ఇదిలా ఉండగా.. తాను పుట్టిన దేశంలో కోసం ఇజ్రాయెల్‌ ప్రజలు యుద్ధ రంగంలోకి దిగుతున్నారు. దేశానికి సేవ చేసేందుకు తమంట తాముగా ముందుకు వస్తున్నారు. హమాస్ అకృత్యాలకు చలించిపోయిన ఇజ్రాయెల్‌వాసులు కదనరంగంలోకి అడుగుపెడుతున్నారు. ఈ క్రమంలో దాదాపు 3 లక్షల మందిని ఇజ్రాయెల్ ప్రభుత్వం సన్నద్ధం చేసింది. దీంతో, కన్నబిడ్డలను, కుటుంబాలను వదిలి.. హమాస్‌పై పోరాడేందుకు రెడీ అవుతున్నారు. ఈ క్రమంలో ఓ ప్రముఖ జర్నలిస్టు సైతం తాను సైన్యంలో చేరుతున్నట్టు ప్రకటించారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. దీంతో, నెటిజన్లు ఆయన్ను ప్రశంసిస్తున్నారు. 

వివరాల ప్రకారం.. ఇ‍జ్రాయెల్‌కు చెందిన ప్రముఖ జర్నలిస్టు హనన్యా నఫ్తాలీ సంచలన నిర్ణయం తీసుకున్నారు. తాను హమాస్‌కు వ్యతిరేకంగా పోరాడేందుకు తన భార్యను వదిలి వెళ్తున్నట్టు ప్రకటించారు. ఈ మేరకు యుద్ధానికి వెళ్తున్న నఫ్తాలీ.. తన భార్యను హత్తుకున్న ఫొటోను ట్విట్టర్‌లో షేర్ చేస్తూ భావోద్వేగ పోస్టు పెట్టారు. తన గైర్హాజరీలో తన సోషల్ మీడియా ఖాతాను ఆమె నిర్వహిస్తుందని పేర్కొన్నారు. ‘నా దేశాన్ని రక్షించుకునేందుకు, సేవ చేసేందుకు వెళ్తున్నాను. నా భార్య ‘ఇండియా నఫ్తాలీ’కు గుడ్‌బై చెప్పేశాను. ఆమె నన్ను ఆశీర్వదించింది. భగవంతుడి రక్షణ నాకు అండగా ఉంటుందని చెప్పింది. ఇక నుంచి నా తరపున నా సోషల్ మీడియా ఖాతాను ఆమె నిర్వహిస్తుంది’ అని తెలిపారు.   ఇదే సమయంలో ఇది మంచికి, చెడుకు మధ్య జరుగుతున్న యుద్ధం అని పేర్కొన్నారు. 

ఆ తర్వాత నఫ్తాలీ మరో వీడియోను పోస్టు చేస్తూ.. తాను యుద్ధానికి వెళ్తున్నది తమ సరిహద్దులను కాపాడుకోవడం కోసం మాత్రమే కాదని, తమ ఇళ్లను, కుటుంబాలను కాపాడుకోవడానికని పేర్కొన్నారు. ఓ బాంబు షెల్టర్‌లో నఫ్తాలీ-ఇండియా ఇద్దరూ ఉన్న వీడియో వైరల్ అయింది. ఈ వీడియో ఇండియా నఫ్తాలీ కంటతడి పెడుతూ కనిపించారు. ఇక, ఈ వీడియోపై నెటిజన్లు స్పందిస్తూ జర్నలిస్తు నఫ్తాలీని ప్రశంసిస్తున్నారు. దేశంలో తనకున్న అంకితభావంపై అభినందనలు కురిపిస్తున్నారు. నిజమైన దేశభక్తి ఇదీ అంటూ పొగుడుతున్నారు. 

ఇది కూడా చదవండి: ఇజ్రాయెల్‌లో 9 మంది అమెరికన్లు మృతి

మరిన్ని వార్తలు