-

ఆ హీరోలకు నో చెప్పిన నయనతార!

14 Nov, 2016 08:15 IST|Sakshi
వాళ్లతోనా..నో!

స్టార్ హీరోలతో రొమాన్‌‌సకు సూపర్ హీరోయిన్ నయనతార నో అంటున్నారన్నది పరిశ్రమ వర్గాల టాక్.ఆదిలోనే శరత్‌కుమార్ వంటి స్టార్ కథానాయకుడికి జంటగా కోలీవుడ్‌కు పరిచయమైన నటి నయనతార. ఆ తరువాత సూపర్‌స్టార్ రజనీకాంత్, సూర్య, విజయ్, అజిత్ వంటి అగ్రహీరోలందరితోనూ నటించి ప్రస్తుతం అగ్రనాయకిగా ఎదిగారు.

ఇలాంటి పరిస్థితిలో ఇప్పుడు స్టార్ హీరోలకు జంటగా నటించడానికి నయనతార నిరాకరిస్తున్నారన్నది టాక్ ఆఫ్‌ది ఇండస్ట్రీగా మారింది. తమిళంతో పాటు తెలుగు చిత్ర పరిశ్రమలోనూ ప్రముఖ కథానాయకిగా రాణిస్తున్న నయనతార ఈ మధ్య నటించిన చిత్రాలన్నీ వరుసగా విజయం సాధిస్తున్నాయి. దీంతో ఆమెను తమ చిత్రాల్లో నటింపజేయడానికి ప్రముఖ కథానాయకులు, దర్శక-నిర్మాతలు ఆసక్తి చూపిస్తుండగా నయనతార మాత్రం విముఖత చూపుతున్నట్లు సమాచారం.

ఆ మధ్య తెలుగులో వెంకటేశ్‌కు జంటగా బాబు బంగారం చిత్రంలో నటించిన నయనతారకు మోగాస్టార్ చిరంజీవి 150వ చిత్రం ఖైదీ నంబర్ 150 చిత్రంలో నటించే అవకాశం వచ్చినా దాన్ని అందిపుచ్చుకోలేదు. అదే విధంగా బాలకృష్ట చిత్రంలోనూ తొలి ఆఫర్ నయనకే వచ్చింది. ఆ అవకాశాన్నీ వదులు కున్నారు. ఇక పవన్‌కల్యాణ్‌కు జంటగా నటించే అవకాశం నయనతార ఇంటి తలుపు తట్టినా, అధిక పారితోషికం ఆశ చూపినా నో అన్నారని సమాచారం. ఇదే విధంగా తమిళంలోనూ ప్రముఖ హీరోల సరసన నటించడానికి అంగీకరించడం లేదనే టాక్ వినిపిస్తోంది. స్టార్ హీరోల చిత్రాల్లో పాటలకు, ప్రేమ సన్నివేశాలకే తన పాత్రలను పరిమితం చేస్తున్నారని, అదే వర్ధమాన కథానాయకుల చిత్రాలైతే తన పాత్రకు ప్రాధాన్యం ఉంటుందని నయనతార భావిస్తున్నట్లు తెలిసింది.

నయనతార ప్రధాన పాత్రలో నటించిన మాయ చిత్రం, విజయ్‌సేతుపతికి జంటగా నటించిన నానుమ్ రౌడీదాన్ వంటి చిత్రాలు కోలీవుడ్‌లో వసూళ్ల వర్షం కురిపించడంతో తన పారితోషికాన్ని మూడు కోట్లకు పెంచేసినట్లు ప్రచారంలో ఉన్న నయనతార ప్రస్తుతం తన పాత్ర చుట్టూ తిరిగే కథా పాత్రలో కూడిన ఇమైక్కా నోడిగళ్ చిత్రంలో యువ నటుడు అధర్వతోనూ, స్టార్ నటులు లేని దోరా చిత్రంలోనూ, గోపి నాయనార్ దర్శకత్వం వహిస్తున్న చిత్రంలో కలెక్టర్‌గానూ నటిస్తున్నారు.

తాజాగా శివకార్తికేయన్‌కు జంటగా మోహన్‌రాజా దర్శకత్వం వహిస్తున్న చిత్రంలో నటిస్తున్నారు. వీటితో పాటు మరో రెండు స్త్రీ పాత్ర ప్రధాన ఇతి వృత్తంగా రూపొందనున్న చిత్రాలను అంగీకరించినట్లు సమాచారం. ఇళయదళపతి విజయ్‌కి జంటగా నటింపజేసే ప్రయత్నాలు జరుగుతున్నాయి. అగవి ఎంత వరకూ సఫలం అవుతాయో చూడాలి.