‘నేల టికెట్టు’లో పవర్‌ స్టార్‌

10 May, 2018 23:35 IST|Sakshi
రామ్, మాళవిక, రవితేజ, పవన్‌ కల్యాణ్, జగపతిబాబు, కల్యాణ్‌ కృష్ణ, శక్తికాంత్‌

కల్యాణ్‌ కృష్ణ దర్శకత్వంలో రవితేజ, మాళవిక శర్మ జంటగా రామ్‌ తాళ్ళూరి నిర్మించిన సినిమా ‘నేల టిక్కెట్టు’. శక్తికాంత్‌ కార్తీక్‌ స్వరకర్త. ఈ నెల 24న విడుదల కానున్న ఈ సినిమా ఆడియో రిలీజ్‌ వేడుకలో ముఖ్య అతిథిగా పాల్గొన్న పవన్‌ కల్యాణ్‌ బిగ్‌ సీడీని రిలీజ్‌ చేశారు.

ఈ సందర్భంగా.. పవన్‌కు ‘నేల టిక్కెట్టు’ చిత్ర బృందం నుంచి గ్రాండ్‌ వెల్‌కమ్‌ లభించింది. అంతేకాదు పవన్‌కు సంబంధించిన ఓ ఏవీ(ఆడియో- వీడియో)ని ఈ ఆడియో ఫంక్షన్‌లో ప్లే చేశారు. పవన్ కల్యాణ్‌ బాల్యం నుంచి హీరోగా, రాజకీయ నేతగా ఎదిగిన తీరును మూడు నిమిషాల నిడివి గల వీడియోలో చూపించారు. మధ్య మధ్యలో పవన్‌ సినిమాలకు సంబంధించిన పాటలు, బ్యాక్ గ్రౌండ్ వాయిస్‌‌ ఓవర్‌‌తో వీడియోని తీర్చిదిద్దారు. పవన్ మొదటి సినిమా మొదలుకుని జనసేన పార్టీకి చెందిన ఫొటోలను ఈ వీడియోలో చూపించి అటు పవన్‌ను ఇటు అభిమానులను చిత్ర బృందం ఆకట్టుకుంది.

ఏవీలో ఏముందంటే.. ‘అతడిది నిప్పురవ్వంత నిఖార్సయిన మంచి మనస్తత్వం. సమస్యలపై స్పందించి జనం తరఫున పోరాడే.. ఆ జన సైన్యాన్ని నడిపించే ప్రజా నాయకుడిగా.. ఇంతింతై వటుడింతై అన్నట్లుగా ఎదుగుతూ.. ఎదిగే కొద్దీ ఒదుగుతూ మన మధ్యలో ఉన్నారు. ఎన్ని సమస్యలపై పోరాడుతున్నా.. ఎన్నిసమరాల్లో తలమునకలై ఉన్నా.. సమయం లేకున్నా కేవలం స్నేహం కోసం.. స్నేహితుడికి ఇచ్చిన మాటకోసం మా ‘నేల టిక్కెట్టు’ ను ఆశీర్వదించేందుకు ఇక్కడిదాకా వచ్చారు. అందుకు వారి రుణం జన్మ జన్మల్లో కూడా తీర్చుకోలేనిది. మా ‘నేల టిక్కెట్టు’ బృందం తరఫున ఆ మంచి మనిషికి, ఆ స్నేహ శీలికి, ఆ సేవా శిఖరానికి సాదరంగా ఘనస్వాగతం పలుకుతున్నాం’ అని ఏవీలో పవన్‌పై తమకు గల అభిమానాన్ని చిత్ర బృందం వ్యక్తం చేసింది.

ఈ వీడియో ప్లే అవుతున్నంత సేపు పవన్ కల్యాణ్ ఎంతో ఏకాగ్రతతో తదేకంగా స్క్రీన్‌ వైపే చూడసాగారు. వీడియో పూర్తయిన తర్వాత ఆయన నవ్వు ఆపుకోలేకపోయారు. ‘వీడియో చాలా బాగుంది’ అని చిత్ర బృందానికి పవన్‌ ధన్యవాదాలు తెలిపారు.

పవర్‌ స్టార్‌ పవన్‌ కల్యాణ్‌ మాట్లాడుతూ... ‘రవితేజ మాస్‌ మహారాజాగా మీకందరికీ తెలియకముందే నాకు బాగా తెలుసు. నా కంటే ముందే ఆయన నటుడయ్యారు. ఆయన నటనంటే నాకు చాలా ఇష్టం. ఎన్నో కష్టాలను ఎదుర్కొన్న వారే ఆయనలా నవ్వగలుగుతారు. నవ్వించగలుగుతారు. రవితేజలో నాకు నచ్చే విషయం. ఆయన ఎంత మందిలో ఉన్నా, ఏ పాత్రలో అయినా నటిస్తారు. సిగ్గు, బిడియం లేకుండా ఆయనలా నటించడం చాలా కష్టం’ అని అన్నారు. నిర్మాత రామ్‌ తాళ్లూరి గురించి పవన్‌ మాట్లాడుతూ..  సమాజానికి సేవ చేయాలనే గొప్ప మనసు కల్గిన వ్యక్తి. ఆయన ఖమ్మంలో ఎన్‌ఆర్‌ఐ స్వచ్ఛంద సంస్థ ద్వారా పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నప్పుడు తనకు పరిచయం’ అని అన్నారు. ‘నేల టికెట్టు’ ఘన విజయం సాధించాలని పవన్‌ ఆకాంక్షించారు.

‘‘పదేళ్ల క్రితం పవన్‌ కల్యాణ్‌గారితో ఫోన్‌లో మాట్లాడాను. ‘మీరు అంత సిగ్గు లేకుండా ఎలా చేస్తారండీ’ అని ఆయన అన్నారు. వన్నాఫ్‌ ది బెస్ట్‌ కాంప్లిమెంట్స్‌ అది. ఎప్పటికీ మర్చిపోలేను’’ అన్నారు రవితేజ. ‘‘హ్యాపీ బర్త్‌డే సత్యనారాయణ గారు (కల్యాణ్‌కృష్ణ తండ్రి). మీ కొడుకు హ్యాట్రిక్‌ సాధింబోతున్నాడు. శక్తికాంత్‌ మంచి సంగీతం ఇచ్చాడు. రామ్‌గారు ప్యాషనేట్‌ నిర్మాత’’  అని రవితేజ అన్నారు. ‘‘రవితేజగారు ఒప్పుకుంటే ఆయనతో మరో నాలుగు సినిమాలు చేద్దాం అనుకుంటున్నా’’ అన్నారు రామ్‌ తాళ్ళూరి.

కల్యాణ్‌కృష్ణ మాట్లాడుతూ– ‘‘మా నాన్నగారి బర్త్‌డే సందర్భంగా ఈ సినిమాను ఆయనకు డెడికేట్‌ చేయాలని ఉంది. ఇది నా ఒక్కడి సినిమా కాదు. అందుకే... ఈ సినిమాకి నేను పడ్డ కష్టాన్ని డెడికేట్‌ చేస్తున్నా. హరీష్‌ శంకర్‌ నాకు ఫ్రెండ్‌. ఒక రోజు చుట్టూ జనం మధ్యలో మనం అనే కాన్సెప్ట్‌ వినగానే రవితేజగారికి చెప్తావా? అని హరీష్‌ అన్నారు. రవిగారికి కథ చెప్పా. నాకు వేరే కమిట్‌మెంట్‌ ఉంది. వెయిట్‌ చెయ్‌. లేకపోతే వేరే సినిమా చేసుకురా? అన్నారు. ఫస్ట్‌ సినిమా రవితేజగారితో చేయలేకపోవచ్చు. బట్‌.. నేను ‘సోగ్గాడే చిన్ని నాయనా’ సినిమా చేసేంత వరకు అదే స్ట్రెంత్‌తో, అదే కాన్ఫిడెన్స్‌తో సినిమా ట్రైల్స్‌ చేయడానికి కారణం రవితేజగారు ఇచ్చిన నమ్మకం.

షూటింగ్‌ స్టార్ట్‌ అవ్వడానికి ఫైవ్‌డేస్‌ ముందు రామ్‌గారిని కలిశాను. నాపై నమ్మకం ఉంచినందుకు నిర్మాతలకు థ్యాంక్స్‌’’ అన్నారు. ‘‘బడ్జెట్‌ పద్మనాభం’లో నేను హీరో, రవితేజ క్యారెక్టర్‌ ఆర్టిస్ట్‌. ఇప్పుడు రవి హీరో.. నేను క్యారెక్టర్‌ ఆర్టిస్ట్‌. రవితేజ ఈ స్థాయికి వచ్చినందుకు శుభాకాంక్షలు’’ అన్నారు జగపతిబాబు. ‘‘ప్రేక్షకులు సాంగ్స్‌ను ఎంజాయ్‌ చేస్తారన్న గ్యారంటీ ఇవ్వగలను’’ అన్నారు శక్తికాంత్‌. ‘‘రవితేజగారి ‘దుబాయ్‌ శీను’ సినిమాకు 5 పాటలు రాశాను. ఈ సినిమాకి ఒక సాంగ్‌ రాశాను’’ అన్నారు రామజోగయ్య శాస్త్రి.

(ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి)

మరిన్ని వార్తలు