‘నయన్‌తో స్నేహం కుదిరింది’

17 Jul, 2017 19:41 IST|Sakshi
‘నయన్‌తో స్నేహం కుదిరింది’
చెన్నై: ఒక్కోసారి అనుకోకుండానే కొన్ని పనులు జరిగిపోతుంటాయి. అవి వారి జీవితంలో నూతనోత్సాహాన్ని కలిగిస్తాయి. ఇప్పుడు ఇద్దరు బ్యూటీస్‌ అలాంటి ఆనందాన్నే అనుభవిస్తున్నారు. వనమగన్‌ చిత్రంతో కోలీవుడ్‌కు దిగుమతి అయిన బాలీవుడ్‌ ముద్దుగుమ్మ సాయేషా సైగల్‌. ఇక్కడ తొలి చిత్రంతోనే మంచి గుర్తింపును పొందిన సాయేషాకు అవకాశాలు బాగానే వస్తున్నాయి. ప్రస్తుతం ప్రభుదేవా దర్శకత్వంలో విశాల్, కార్తీ కలిసి నటిస్తున్న కరుప్పురాజా వెళ్లైరాజా చిత్రంలో నటిస్తోంది. అంతకు ముందు తెలుగులో అఖిల్‌ చిత్రంతో రంగప్రవేశం చేసింది. ఇలా దక్షిణాదిలో కేరీర్‌ ఆశాజనకంగా ఉండటంతో ఇక్కడే మకాం పెట్టాలన్న నిర్ణయానికి వచ్చిన సాయేషా హైదరాబాద్‌లో ఒక ఫ్లాట్‌ను అద్దెకు తీసుకుందట. ఇక్కడ విశేషం ఏమిటంటే అదే ఫ్లాట్‌లో ఇంతకు ముందు నటి సమంత ఉండేది. ఆ ఫ్లాట్‌లో ఉండగా సమంత యమ బిజీగా నటించిందని సమాచారం. దీంతో తాను బిజీ హీరోయిన్‌ అయ్యిపోతాననే కలలు కంటోంది నటి సాయేషాసైగల్‌. 
 
ఇక నటి నిక్కీగల్రాణి విషయానికి వస్తే కోలీవుడ్‌లో చేతి నిండా చిత్రాలతో బిజీగా ఉంది. ఈ అమ్మడు కూడా చెన్నైలో మకాం పెట్టేసింది. స్థానిక ఎగ్మోర్‌లోని ఒక అపార్ట్‌మెంట్‌లో ఫ్లాట్‌ను అద్దెకు తీసుకుంది. అదే అపార్ట్‌మెంట్‌లో నిక్కీగల్రాణి ఫ్లాట్‌కు పైన ఫ్లాట్‌లో అగ్రనటి నయనతార చాలా కాలంగా నివశిస్తోంది. ఒకే అపార్ట్‌మెంట్‌లో మకాం పెట్టడంతో నయనతార, నిక్కీగల్రాణిలు తరచూ ఎదురు పడటంతో ఆ పరిచయం వారిద్దరి మధ్య స్నేహాన్ని పెంచేసిందట. ఈ విషయాన్ని నటి నిక్కీగల్రాణి పట్టరాని ఆనందంతో  తన ట్విట్టర్‌లో పోస్ట్‌ చేసేసింది. ఇలా యాదృశ్చికంగానే కొన్ని ఆనందభరిత సంఘటనలు జరుగుతాయన్న మాట.