మీటూ.. నా రూటే సపరేటు!

13 Nov, 2018 08:45 IST|Sakshi

తమిళసినిమా: నా రూటే సపరేటు అంటోంది నటి నిత్యామీనన్‌. బహుభాషా నటి అయిన ఈ అమ్మడిప్పుడు ఒక సంచలన పాత్రలో నటించడానికి చాలా ఆతృతగా ఎదురుచూస్తోంది. అదేమిటో చాలా మందికి అర్థం అయ్యే ఉంటుంది. అవును. తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలితగా మారడానికి నిత్యామీనన్‌ ఎదురుచూస్తోంది. జయలలిత బయోపిక్‌ను దర్శకులు భారతీరాజా, విజయ్, లింగుస్వామి, ప్రియదర్శిని మొదలగు నలుగురు తెరకెక్కించడానికి ప్రయత్నాలు చేస్తున్న విషయం తెలిసిందే. అయితే వీరిలో మహిళా దర్శకురాలు ప్రియదర్శిని మినహా ఏ దర్శకుడూ తమ చిత్రంలో జయలలిత పాత్రను పోషించే నటిని ఎంపిక చేయలేదింకా. ప్రియదర్శిని మాత్రం వేగం పెంచి తన చిత్రంలో నిత్యామీనన్‌ జయలలితగా నటించనున్నట్లు వెల్లడించారు. చిత్రానికి ది ఐరన్‌ లేడీ అని పేరు కూడా ఖరారు చేశారు. ఈ చిత్రం గురించి నిత్యామీనన్‌ ఒక భేటీలో పేర్కొంటూ ది ఐరన్‌ లేడీ చాలా పెద్ద చిత్రం అవుతుందని చెప్పింది.
 

ప్రియదర్శిని కథ చెప్పగానే తనకు చాలా బాగా నచ్చేసిందన్నారు. ఒక బయోపిక్‌ చేస్తున్నప్పుడు అందులోని పాత్రకు అవసరమైన నటనను పూర్తిగా అందించాలని నిర్ణయించుకున్నానంది. సరైన మార్గంలో నమ్మకంతో ప్రయదర్శిని చిత్ర ప్రీ ప్రొడక్షన్‌ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని చెప్పింది. ఈ చిత్రంలో నటించడానికి తాను చాలా ఆతృతగా ఎదురు చూస్తున్నాని తెలిపింది. ఇకపోతే ప్రస్తుతం చిత్ర పరిశ్రమలో కలకలం సృష్టిస్తున్న మీటూ గురించి స్పందించ మంటున్నారని, మీటూకు తాను వ్యతిరేకిని కానని స్పష్టం చేసింది. అయితే లైంగిక వేధింపులు, హద్దు మీరిన చర్యలను ఎదుర్కొనడానికి తన వద్ద వేరే మార్గం ఉందని చెప్పింది. అందువల్ల తాను ఆ గ్రూప్‌తో కలిసి పోరాడనని అంది. అలాంటి విషయాల గురించి స్పందించకపోయినంత మాత్రాన తాను మహిళలు ఎదుర్కొంటున్న అత్యాచారాలను సమర్థిస్తున్నానని భావించరాదని, అలాంటి సంఘటనలను తాను వేరే మార్గంలో ఎదుర్కొంటానని నిత్యామీనన్‌ చెప్పింది.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా