ఎన్టీఆర్‌ బయోపిక్‌.. తెరపైకి ఇంకో పేరు

27 Apr, 2018 13:56 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: దర్శకుడు తేజ నిష్క్రమణతో ఎన్టీఆర్‌ బయోపిక్‌పై సందిగ్ధం నెలకొంది. ఈ చిత్రాన్ని సమర్థవంతంగా తెరకెక్కించగలిగే దర్శకుడి కోసం బాలకృష్ణ మళ్లీ ప్రయత్నాలు మొదలుపెట్టినట్లు తెలుస్తోంది. ముందుగా సీనియర్‌ దర్శకుడు రాఘవేంద్రరావు పేరు ప్రముఖంగా వినిపించగా.. రేసులో తాను లేనని ఆయన స్పష్టత ఇచ్చారు. ఆ తర్వాత కృష్ణ వంశీ, క్రిష్‌ ఇలా మరికొందరి పేర్లు వినిపించాయి. ఇప్పుడు అనూహ్యంగా మరో పేరు తెరపైకి వచ్చింది.

ఆయనే మాటల రచయిత సాయి మాధవ్‌ బుర్రా. గోపాల గోపాల, కంచె, ఖైదీ నంబర్‌ 150, గౌతమీపుత్ర శాతకర్ణి తదితర చిత్రాలకు సంభాషణలు రాసిన సాయి మాధవ్‌.. ఎన్టీఆర్‌ బయోపిక్‌ కోసం మెగా ఫోన్‌ పట్టనున్నట్లు ఓ వార్త చక్కర్లు కొడుతోంది. దీనిపై అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. మరోవైపు బాలయ్యే స్వయంగా ఈ చిత్రానికి దర్శకత్వం వహించే అవకాశం ఉందన్నది మరో కథనం. రెగ్యులర్‌ షూటింగ్‌కు సమయం దగ్గర పడుతుండటంతో త్వరలోనే ఈ విషయంపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది.

మరిన్ని వార్తలు