ఆ హీరోయిన్ ఆస్తిలో 80 శాతం విరాళం

21 Oct, 2016 16:39 IST|Sakshi
ఆ హీరోయిన్ ఆస్తిలో 80 శాతం విరాళం

బాలీవుడ్ దివంగత నటి పర్వీన్ బాబీ ఆస్తి వివాదం ముగిసింది. ఆమె మరణించిన 11 ఏళ్ల తర్వాత ఈ కేసు పరిష్కారమైంది. పర్వీన్ బాబీ రాయించిన వీలునామా చట్టబద్ధమైనదిగా బాంబే హైకోర్టు శుక్రవారం ప్రకటించింది. దీని ప్రకారం ఆమె ఆస్తుల్లో 80 శాతం వీధిబాలలు, మహిళల సంక్షేమం కోసం వినియోగించనున్నారు. పర్వీన్ మేనమామ మురాద్ఖాన్ బాబీ (82) ఆధ్వర్యంలో ఓ ట్రస్ట్ను ఏర్పాటు చేసి నడపనున్నారు. బాబీ వర్గానికి చెందిన వారికి సాయం చేయనున్నారు. మిగిలిన 20 శాతం సంపద ఆమె మేనమామ మురాద్ఖాన్కు చెందుతుంది. పర్వీన్ తన చేతులపై పెరిగిందని, ఆమె తనతో సన్నిహితంగా ఉండేదని, ఆమె ఆస్తులను పేదల కోసం వినియోగిస్తానని మురాద్ఖాన్ చెప్పాడు.

గుజరాత్లోని జునాగాధ్లో జన్మించిన పర్వీన్ బాబీ 1970, 80ల్లో బాలీవుడ్లో పలు హిట్ చిత్రాల్లో నటించింది. జుహు ఫ్లాట్లో ఒంటరిగా నివసించిన ఆమె 56వ ఏట 2005 జనవరి 22న అనారోగ్యంతో మరణించింది. అవివాహిత అయిన పర్వీన్కు వారసులు లేకపోవడంతో ఆమె ఆస్తి ఎవరికి దక్కుతుందనే సందేహం ఏర్పడింది. కాగా జునాగాధ్లో ఉంటున్న మురాద్ఖాన్ ఆమె రాయించిన వీలునామాను బయటపెట్టాడు. 2005లో కోర్టులో ప్రవేశపెట్టగా, ఈ వీలునామా నకిలీదని ఆమె పుట్టింటి తరఫువారు కోర్టును ఆశ్రయించారు. కోర్టులో ఈ కేసు సుదీర్ఘకాలం నడిచింది. కాగా పర్వీన్ పుట్టింటి తరఫువారు కేసును ఉపసంహరించుకోవడంతో వివాదం పరిష్కారమైంది. ఆమెకు  ముంబైలో జుహు ప్రాంతంలో అరేబియా సముద్రానికి ఎదురుగా విలాసవంతమైన ఫ్లాట్ ఉంది. ఇంకా జునాగాధ్లో ఓ బంగ్లా, బంగారు ఆభరణాలు, బ్యాంకుల్లో 20 లక్షల రూపాయల డిపాజిట్లు, ఇతర పెట్టుబడులు ఉన్నాయి.