పెద్దన్నయ్య పెద్ద మనస్సు : పవన్‌

27 Mar, 2020 15:17 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : లాక్‌డౌన్‌ అమలు అవుతున్న నేపథ్యంలో సినీ కార్మికుల కోసం ప్రముఖ నటుడు చిరంజీవి రూ. కోటి విరాళంగా ప్రకటించడంపై జనసేన అధ్యక్షులు పవన్‌ కళ్యాణ్‌ హర్షం వ్యక్తం చేశారు. సినిమా పరిశ్రమకు ఎటువంటి కష్టం వచ్చినా తక్షణమే స్పందించే తన పెద్ద అన్నయ్య చిరంజీవి సినీ కార్మికుల కోసం కోటి రూపాయలు విరాళంగా ప్రకటించిందుకు తమ్ముడిగా గర్వ పడుతున్నానని ట్విటర్‌లో పేర్కొన్నారు. 'సినీ పరిశ్రమలోని 24 విభాగాలలోని ప్రతీ టెక్నీషియన్‌, ప్రతీ కార్మికుని శ్రమ తెలిసిన వ్యక్తి చిరంజీవి. కరోనా దెబ్బతో ఉపాధి కోల్పోయి సినిమానే నమ్ముకుని జీవిస్తున్న ఎందరో కార్మికులు, టెక్నీషిన్లు ఆర్థికంగా అల్లాడిపోతున్నారు. అటువంటి వారిని ఆదుకోవడానికి పెద్దన్నగా ముందుకు వచ్చిన చిరంజీవికి కృతజ్ఞతలు తెలియచేస్తున్నాను. ఆకలితో ఉన్నవారికి అన్నం పెట్టాలని నిర్ణయించుకున్న ఆయన దయార్ద్ర హృదయానికి జేజేలు పలుకుతున్నాను' అని పేర్కొన్నారు.

అంతేకాకుండా రూ. 4 కోట్లు విరాళంగా ఇచ్చిన ప్రభాస్‌, రూ. 1 కోటీ 25 లక్షలు విరాళంగా ఇచ్చిన అ‍ల్లు అర్జున్‌, కోటి రూపాయల విరాళం ఇచ్చిన మహేష్‌ బాబు, రూ. 75 లక్షల విరాళం ఇచ్చిన రామ్‌ చరణ్‌, రూ. 70 లక్షల విరాళాన్ని ఇచ్చిన జూనియర్‌ ఎన్టీఆర్‌, రూ. 20 లక్షలు చొప్పు విరాళంగా ఇచ్చిన నితిన్‌, త్రివిక్రమ్‌, దిల్‌ రాజు, రూ. 10 లక్షలు చొప్పున విరాళంగా ఇచ్చిన సాయి ధర్మ తేజ్‌, కొరటాల శివ, అనిల్‌ రావిపూడిలకు ప్రత్యేకంగా పవన్‌ కృతజ్ఞతలు తెలిపారు. (మూడు రాష్ట్రాలకు బన్నీ విరాళం)

మరిన్ని వార్తలు