నూటయాభై పూలతో..!

19 Oct, 2015 00:11 IST|Sakshi
నూటయాభై పూలతో..!

‘‘చాలా విరామం తర్వాత అన్నయ్య మళ్లీ సినిమాలో నటించినందుకు చాలా ఆనందంగా ఉంది. పొలిటికల్ జర్నీ మొదలయ్యాక మేం చాలా అరుదుగా కలుసుకున్నాం. రాజకీయాల పరంగా మా ఇద్దరి విధానాలు వేరైనా వ్యక్తిగతంగా అన్నయ్య అంటే నాకు ఇష్టం, గౌరవం. నా సినీ జీవితానికీ, ఇంత మంచి జీవితానికి కారకుడైన అన్నయ్య మళ్లీ నటించినందుకు ఆనందం అనిపించి, అభినందించాలనుకున్నాను’’ అని పవన్ కల్యాణ్ అన్నారు. రామ్‌చరణ్ హీరోగా శ్రీను వైట్ల దర్శకత్వంలో రూపొందిన ‘బ్రూస్‌లీ’ గత శుక్రవారం విడుదలైన విషయం తెలిసిందే.

 ఈ చిత్రంలో చిరంజీవి మూడు నిముషాల పాటు సాగే అతిథి పాత్ర చేశారు. చిరంజీవిని అభిమానించే అందరి తరపున ఆయన రీ-ఎంట్రీని ప్రత్యేకంగా అభినందించాలనుకున్న పవన్ కల్యాణ్ 150 పువ్వులతో అందమైన పుష్పగుచ్ఛం తయారు చేయించారు. ఆదివారం సాయంత్రం చిరంజీవి ఇంటికి స్వయంగా వెళ్లి, కలిశారు. ఈ సందర్భంగా పవన్ కల్యాణ్ మాట్లాడుతూ - ‘‘నేనింకా ‘బ్రూస్‌లీ’ చూడలేదు. చూసినవాళ్లు అన్నయ్య ఎంట్రీ సీన్ అప్పుడు రోమాలు నిక్కబొడుచుకున్నాయని అంటుంటే సంతోషం అనిపించింది.

 అన్నయ్య నటించబోయే 150వ చిత్రం కూడా విజయం సాధించాలి’’ అన్నారు. రామ్‌చరణ్‌తో తీయబోయే సినిమాకు సంబంధించి రెండు, మూడు కథలు సిద్ధంగా ఉన్నాయని పవన్ అన్నారు. ప్రస్తుతం తాను నటిస్తున్న ‘సర్దార్ గబ్బర్‌సింగ్’ను సంక్రాంతికి విడుదల చేయడానికి ట్రై చేస్తున్నామని తెలిపారు. ఏపీ రాజధాని అమరావతి శంకుస్థాపనకు వెళ్లాలనే ఉందనీ, షూటింగ్ షెడ్యూల్స్ అడ్జస్ట్ అయ్యేదాన్ని బట్టి నిర్ణయం తీసుకుంటానని పవన్ స్పష్టం చేశారు.