వారికంటే ముందే రానున్న రజనీ!

19 Nov, 2019 15:32 IST|Sakshi

సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ హీరోగా క్రేజీ డైరెక్టర్‌ ఏఆర్‌ మురగదాస్‌ కాంబినేషన్‌లో వస్తున్న సెన్సేషనల్‌ మూవీ ‘దర్బార్‌’. చాలా కాలం తర్వాత రజనీ పోలీస్‌ గెటప్‌లో కనిపిస్తుండటంతో ఈ చిత్రంపై భారీ అంచనాలే ఉన్నాయి. అంతేకాకుండా వెరైటీ కథలతో పాటు మెసేజ్‌ ఓరియెంటెడ్‌ చిత్రాల ఎక్స్‌పర్ట్‌గా పేరుగాంచిన మురుగదాస్‌  డైరెక్ట్‌ చేస్తుండటం ఈ సినిమాకు డబుల్‌ ప్లస్‌ కానుంది. కాగా ఇప్పటికే విడుదలైన రజనీ ఫస్ట్‌ లుక్‌, మోషన్‌ పోస్టర్‌లు సినిమాను ఓ రేంజ్‌కు తీసుకెళ్లాయి. 

షూటింగ్‌ను పూర్తిచేసుకున్న ఈ చిత్రం ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాల్లో బిజీగా ఉంది. అయితే ఈ చిత్ర విడుదల తేదీపై గందరగోళం నెలకొంది. సినిమా ప్రారంభం నుంచే సంక్రాంతి కానుకగా జనవరి 12న విడుదల చేస్తామని చిత్ర యూనిట్‌ చెబుతూ వస్తోంది. అయితే సంక్రాంతి బరిలో ‘సరిలేరు నీకెవ్వరు’, ‘అల వైకుంఠపురములో’వంటి భారీ చిత్రాలు వస్తుండటంతో తెలుగులో దర్బార్‌కు థియేటర్ల సమస్య తలెత్తే అవకాశం ఉండటంతో చిత్ర నిర్మాతలు పునరాలోచనలో పడ్డారు. 

మహేశ్‌ బాబు, అల్లు అర్జున్‌ సినిమాలు జనవరి 12న వచ్చే అవకాశం ఉండటంతో.. దర్బార్‌ను జనవరి 12 న కాకుండా 15న విడుదల చేయాలని నిర్మాతలు తొలుత భావించారు. అయితే వారి నిర్ణయాన్ని మరోసారి మార్చుకున్నట్లు తెలుస్తోంది. దీనిలో భాగంగా లైకా ప్రొడక్షన్స్‌ తన అధికారిక వెబ్‌సైట్‌లో దర్బార్‌ విడుదల తేదీ జనవరి 9వ తేదీ అని పేర్కొంది. దీంతో సంక్రాంతి బరిలో మహేశ్‌ బాబు, అల్లు అర్జున్‌ల కంటే ముందే రజనీ థియేటర్లలో సందడి చేసే అవకాశం ఉంది. ఆ రెండు భారీ చిత్రాల విడుదలకు మూడు రోజుల ముందు అన్ని థియేటర్లలో విడుదల చేసి అధిక లాభం పొందేందుకు లైకా ఈ నిర్ణయం తీసుకున్నట్లు సినీ వర్గాల టాక్‌

ఇక​ డిసెంబర్‌ 12న రజనీ పుట్టినరోజు సందర్భంగా చిత్ర ఆడియో ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహించేందుకు చిత్ర యూనిట్‌ సి​ద్దమవుతున్నట్లు సమాచారం. అయితే ఆ రోజు కుదరకపోతే డిసెంబర్‌ 7న నిర్వహించాలని భావిస్తోంది. ఇక లైకా ప్రొడక్షన్స్‌ పతాకంపై ఎ. సుభాస్కరన్‌ నిర్మిస్తున్న ఈ చిత్రంలో నయనతార హీరోయిన్‌గా నటిస్తున్నారు. కాగా నివేదా థామస్‌ ఒక ముఖ్య పాత్ర పోషిస్తున్నారు. అనిరుద్‌ రవిచందర్‌ సంగీతమందిస్తున్నాడు. 

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా