నటనపై తపనతో..!

17 Feb, 2020 12:57 IST|Sakshi

అమెరికా టు హైదరాబాద్‌  

వెండితెరపై తెలంగాణ యువకుడు

మోడలింగ్, ఫిట్‌నెస్‌లలో నిష్ణాతుడు  

సినిమాల్లో రాణిస్తున్న రవిరెడ్డి

బంజారాహిల్స్‌: సినిమాల మీద మక్కువతో అమెరికా నుంచి హైదరాబాద్‌కు వచ్చాడో ఔత్సాహిక యువకుడు. గతంలో అమెరికానుంచి టాలీవుడ్‌కు వచ్చి హ్యాపీ డేస్‌ సినిమాతో అందరినీ అలరించిన వరుణ్‌ సందేశ్‌ దారిలోనే ఇప్పుడు అమెరికా రిటర్న్‌డ్‌ బిజినెస్‌మన్‌ రవిరెడ్డి తన సత్తా చాటుకునేందుకు సిద్ధమయ్యాడు. సినిమాలపై ఇష్టంతో టాలీవుడ్‌కు వచ్చిన రవిరెడ్డి చూడగానే ఆకట్టుకునే రూపం, అసలు, సిసలు తెలుగుదనం ఉట్టిపడే తీరుతో ఇప్పటికే తనదైన ముద్ర వేశాడు. అమెరికా నుంచి వెండితెరపై వెలిగిపోవాలని ఇటీవల చాలా మంది ఔత్సాహిక నటులు హైదరాబాద్‌కు వస్తున్న తరుణంలో రవిరెడ్డి వచ్చీ రావడంతోనే సరైన అవకాశాలు అందిపుచ్చుకున్నాడు.

మోడలింగ్‌లో తనదైన ముద్ర.. 
పక్కా తెలంగాణ యువకుడైన రవిరెడ్డిది వ్యవసాయ కుటుంబం. ఏదో అల్లాటప్పాగా కాకుండా అమెరికాలో మోడలింగ్‌ చేసి అంతటితో ఊర్కోకుండా న్యూయార్క్‌ ఫిలిం అకాడమీలో కోర్సు కూడా పూర్తి చేశాడు. నటించాలనే తపనతో ఆయన శిక్షణ తీసుకున్న తీరు కూడా సినిమాలపై ఆయనకున్న మక్కువ అర్థమవుతుంది. స్వతహాగా ఫిట్‌నెస్‌ నిపుణుడు కూడా. ఒకవైపు అమెరికాలో జాబ్‌ చేస్తూనే చదువుకుంటూ ఆ తర్వాత యాక్టింగ్‌లో కోర్సు చేస్తూ మోడలింగ్‌లోనూ తనదైన ముద్ర వేశాడు. సినిమాలపై దృష్టి పెట్టిన ఆయన తన దేహాకృతిని అందంగా మలుచుకున్నాడు. నటనలో నిష్ణాతుడై ఉండటం ఆయనకు బాగా కలిసి వచ్చింది. ప్రముఖ దర్శకులు వీవీ వినాయక్‌ను తన స్నేహితుడి ద్వారా కలిసిన క్షణమే తనకు టర్నింగ్‌పాయింట్‌ అయిందని చెబుతున్నాడితను. అప్పటికే ఆయన దర్శకత్వం వహిస్తున్న ఇంటిలిజెంట్‌ సినిమాలో అవకాశం ఇచ్చాడు. ఇక సాఫ్ట్‌వేర్‌ సుధీర్, దర్పణం వంటి సినిమాల్లో నటించి మెప్పించడమే కాకుండా తనకంటూ అభిమానులను కూడా సొంతం చేసుకున్నాడు.  

విమర్శకుల ప్రశంసలు
విజయ్‌ దేవరకొండ సోదరుడు ఆనంద్‌ దేవరకొండ, జీవిత, రాజశేఖర్‌ల కూతురు హీరో హీరోయిన్లుగా వచ్చిన దొరసాని లోనూ మంచి చాన్స్‌ కొట్టేశాడు రవిరెడ్డి. ఇందులో అతని నటనను తిలకించిన ప్రముఖ దర్శకుడు ఇంద్రగంటి మోహనకృష్ణ తన తాజా చిత్రం ‘వి’లో మంచి పాత్రను ఇవ్వడం గమనార్హం. రానా దగ్గుబాటి, సాయి పల్లవిలతో వేణు ఊడుగుల రూపొందిస్తున్న విరాటపర్వంలోనూ రవిరెడ్డి చక్కని పాత్ర దక్కించుకున్నాడు. ఇక నర్సింహ నంది దర్శకత్వంలో రూపొంది ఇటీవలే విడుదలైన డిగ్రీ కాలేజ్‌లో ముఖ్యమైన పాత్ర పోషించాడు. ఈ చిత్రంలో ఆయన పోషించిన పోలీసు ఆఫీసర్‌ సురేందర్‌రెడ్డి పాత్రకు విమర్శకుల నుంచి ప్రశంసలు వచ్చాయి.  

 అవకాశాలవెల్లువ
1997లో అమెరికా వెళ్లిన రవిరెడ్డి అక్కడ ఒకవైపు జాబ్‌ చేస్తూ ఇంకోవైపు ఎగ్జిక్యూటివ్‌ ఎంబీఏ చదివాడు. అప్పటి నుంచే సినిమాల్లో నటించాలనే మోజు పెరిగింది. ఏదో నటించాంలే అని కాకుండా చక్కగా శిక్షణ తీసుకొని తన శరీరాకృతిని పూర్తిగా మార్చుకొని ముఖ్య పాత్రల్లో రాణిస్తున్నాడు. మంచి ఆఫర్లు వస్తున్నాయని రవిరెడ్డి పేర్కొన్నాడు. చాలా ఇష్టమైన పాత్రల్ని చేస్తున్నానని, వాటివల్ల మంచి గుర్తింపు లభిస్తోందని చెబుతున్నాడు.  తెలంగాణకు చెందిన ఓ యువకుడు అమెరికా నుంచి తిరిగి వచ్చి టాలీవుడ్‌లోనిలదొక్కుకోవడం విశేషం.  

మరిన్ని వార్తలు