100 కోట్లు...200 కోట్లు...ఇదీ లేటెస్ట్ ట్రెండ్!

31 Dec, 2013 00:20 IST|Sakshi
100 కోట్లు...200 కోట్లు...ఇదీ లేటెస్ట్ ట్రెండ్!
 ఒకప్పుడు సినిమా విజయాలకు హండ్రడ్ డేస్, సిల్వర్ జూబ్లీ, గోల్డెన్ జూబ్లీలు కొలబద్దలు. ఇప్పుడు ట్రెండ్ మారింది. ఎన్ని రోజులాడిందన్నది కాదు ముఖ్యం... వసూళ్లే ఇక్కడ ప్రధానం. అందుకే ఈ రోజుల్లో శత దినోత్సవాల ప్రస్తావనే కానరావడం లేదు. అసలు అలాంటి ఫంక్షన్లే జరగడం లేదు. ఆ మధ్య వరకూ అభిమానులు తమ హీరో సినిమా ఇన్ని కేంద్రాల్లో వంద రోజులాడిందని గొప్పగా చెప్పుకునేవారు. ఇప్పుడంతా వసూళ్ల లెక్కలే. ఈ షేర్లని బట్టే బాక్సాఫీస్ దగ్గర ఎవరు షేర్‌గా నిలుస్తున్నారో తేల్చుకుంటున్నారు. వంద కోట్ల క్లబ్, రెండు వందల కోట్ల క్లబ్ అనేది లేటెస్ట్ ట్రెండ్. బాలీవుడ్‌లో అయితే గత ఆరేళ్ల నుంచీ విడుదలైన ప్రతి పెద్ద సినిమా వారంలోపే వంద కోట్లు సాధించాలనే పోటీ మొదలైంది. ఈ ఆరేళ్లల్లో మొత్తం 26 చిత్రాలు (షేర్ ఆధారంగా) 100 కోట్ల క్లబ్‌లో చేరాయి. అందులో 4 సినిమాలు 200 కోట్ల క్లబ్‌లో చేరడం కూడా విశేషం. అసలు ఈ క్లబ్‌ల కథేంటో చూద్దాం...
 
 బోణీ ఆమిర్‌దే!
 బాలీవుడ్‌లో తొలి వంద కోట్ల సినిమా ‘గజిని’. ఇది తమిళ ‘గజిని’కి రీమేక్. ఆమిర్‌ఖాన్ హీరోగా మురుగదాస్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం బాక్సాఫీస్‌ని షేక్ చేసింది. 2008లో ప్రపంచవ్యాప్తంగా దాదాపు 1500 థియేటర్లలో విడుదలైన ఈ సినిమా సుమారు 115 కోట్ల రూపాయల షేర్ వసూలు చేసి సంచలనం సృష్టించింది. ఆ తర్వాత ఏడాది వరకు వేరే ఏ సినిమా ఆ రికార్డ్‌ని బద్దలు కొట్టలేదు. మళ్లీ ఆమీరే తన రికార్డ్ తాను బద్దలు కొట్టుకున్నాడు. 2009లో వచ్చిన ‘త్రీ ఇడియట్స్’ ప్రపంచవ్యాప్తంగా సుమారు 2,215 థియేటర్లలో విడుదలై,  ‘గజిని’ రికార్డ్‌ని అధిగమించింది. ఈ చిత్రం 202 కోట్లకు పైగా వసూలు చేయడం అందర్నీ ఆశ్చర్యపరిచింది. ఆ విధంగా తొలి వంద కోట్ల క్లబ్ తొలి రెండొందల క్లబ్‌లో చేరిన హీరో ఆమిరే. కావడం విశేషం.
 
 వంద రోజులు కాదు.. వంద కోట్లే విజయానికి కొలమానం
 ఎప్పుడైతే గజిని, త్రీ ఇడియట్స్ చిత్రాలు 100, 200 కోట్లు వసూలు చేశాయో, ఇక అప్పట్నుంచీ వంద కోట్లు వసూలు చేసిన సినిమాయే గొప్ప అనే భావన బాలీవుడ్‌లో బలపడిపోయింది. పది, ఇరవై రోజుల్లోనే ఈ కోట్ల క్లబ్‌లో చేరిపోవాలనే లక్ష్యంతో అగ్రనిర్మాతలు, హీరోలు, దర్శకులు సినిమాలు చేయడం మొదలుపెట్టేశారు. 2008లో ఒకటి, 2009లో ఇంకొకటి ఈ ఫీట్ సాధించగా, 2010లో మాత్రం ఈ సంఖ్య రెండు సినిమాలకు పెరిగింది.
 
 2010లో డబుల్ స్ట్రాంగ్
 ఆమిర్‌ఖాన్ తర్వాత కోట్ల క్లబ్‌లో చేరిన హీరో  సల్మాన్‌ఖాన్. ఈ కండలవీరుడు నటించిన ‘దబాంగ్’ దాదాపు 140 కోట్ల రూపాయలు వసూలు చేసింది. ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రం దాదాపు 1800 థియేటర్లలో విడుదలైంది. మిథున్ చక్రవర్తి, అజయ్ దేవగన్, అర్షద్ వర్సి, కరీనా కపూర్ల కాంబినేషన్‌లో రూపొందిన మల్టీస్టారర్ మూవీ  ‘గోల్‌మాల్-3’ 107 కోట్లు వసూలు చేసింది.
 
 2011లో పాంచ్ పటాకా
 రెడీ, బాడీగార్డ్, రా.వన్, డాన్ 2, సింగమ్ చిత్రాలు 2011లో వసూళ్ల పరంగా వీరవిహారం చేశాయి. ‘రెడీ’ చిత్రం 120 కోట్లు వసూలు చేయగా, ‘బాడీగార్డ్’ 142 కోట్లతో సల్మాన్ స్టామినా ఏంటో చాటి చెప్పింది. ఈ రెండూ రీమేక్సే కావడం ఇక్కడ విశేషం. తెలుగు ‘రెడీ’కి ‘రెడీ’ రీమేక్ కాగా, మలయాళ ‘బాడీగార్డ్’ని అదే పేరుతో రీమేక్ చేశారు. అలాగే తమిళ ‘సింగమ్’కి రీమేక్ అయిన ‘సింగమ్’ సరిగ్గా వంద కోట్ల మేజిక్ ఫిగర్‌ని అందుకోగలిగింది. భారీ అంచనాల నడుమ విడుదలైన షారుక్ ఖాన్ ‘రా.వన్’ 115 కోట్లు వసూలు చేసింది. షారుక్ మరో సినిమా ‘డాన్ 2’ కూడా 106 కోట్ల రూపాయలను దర్జాగా కలెక్ట్ చేసింది.
 
 2012లో నైన్ వండర్స్
 2012లో వంద కోట్ల క్లబ్‌లో మెంబర్‌షిప్ పొందిన తొలి సినిమా ‘అగ్నిపథ్’. హృతిక్ రోషన్ నటించిన ఈ చిత్రం 123 కోట్లు వసూలు చేసింది. ఆ తర్వాత విడుదలైన మల్టీస్టారర్ మూవీ ‘హౌస్‌ఫుల్-2’ 114 కోట్లు వసూలు చేసింది. ఇక, తెలుగు ‘విక్రమార్కుడు’కి రీమేక్ అయిన ‘రౌడీ రాథోడ్’ కూడా బాగానే వసూళ్లు రాబట్టింది. అక్షయ్‌కుమార్ హీరోగా ప్రభుదేవా దర్శకత్వం వహించిన ఈ రీమేక్ 131 కోట్లు దండుకుంది. ఆ తర్వాత విడుదలైన మల్టీస్టారర్ మూవీ ‘బోల్ బచ్చన్’ వసూళ్ల విలువ 102 కోట్లు. ఇక్కడ ‘ఏక్ థా టైగర్’ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ఈ చిత్రం 198 కోట్లు వసూలు చేసింది. ‘త్రీ ఇడియట్స్’ వసూళ్లకు దగ్గరగా వచ్చిన సినిమా ఇదే కావడం విశేషం. కేవలం మాస్ మసాలా సినిమాలే 100, 200 కోట్ల క్లబ్‌లో చేరతాయనే అభిప్రాయాన్ని మార్చిన సినిమా ‘బర్ఫీ’. రొటీన్‌కి భిన్నంగా సాగిన ఈ సినిమా 120 కోట్లు వసూలు చేసి, బాలీవుడ్ బాక్సాఫీస్‌కి షాకిచ్చింది. ఆ తర్వాత విడుదలైన ‘జబ్ తక్ హై జాన్’ 120 కోట్లు వసూలు చేయగా, తెలుగు ‘మర్యాద రామన్న’కు రీమేక్ అయిన ‘సన్నాఫ్ సర్దార్’ 104 కోట్లు వసూలు చేసింది. 2012కి ‘దబాంగ్ 2’ మంచి ముగింపునిచ్చింది. సల్మాన్‌ఖాన్ నటించిన ఈ చిత్రం 158 కోట్లు వసూలు చేసింది.
 
 2013లో 8 సినిమాల వీర విహారం
 ‘రేస్-2’ పేరుకి తగ్గట్టే ఫుల్ రేస్‌లో కొనసాగింది. ఈ చిత్రం సుమారు 102 కోట్లు వసూలు చేసింది. ఆ తర్వాత విడుదలైన ‘యే జవానీ హై దివానీ’ కూడా వసూళ్ల సునామీ సృష్టించింది. ఈ చిత్రం సుమారు 190 కోట్లు వసూలు చేసింది. పరుగుల వీరుడు మిల్కా సింగ్ జీవితం ఆధారంగా రూపొందిన ‘భాగ్ మిల్కా భాగ్’ సినిమాలో ఖాన్, కపూర్ హీరోలు లేరు. వీళ్ల స్థాయిలో మార్కెట్ లేని దర్శక, నిర్మాత, నటుడు ఫర్హాన్ అక్తర్ ఇందులో మిల్కా సింగ్ పాత్ర చేశారు. కథాంశం, మంచి టేకింగ్, ఫర్హాన్ నటన కారణంగా ఈ చిత్రం 103 కోట్లు రాబట్టింది. ఈ ఏడాది స్పెషల్ ఏంటంటే... ఖాన్ రికార్డుని ఖానే బద్దలుగొట్టాడు. ఆమిర్ ‘త్రి ఇడియట్స్’ రికార్డ్‌ని షారుక్‌ఖాన్ ‘చెన్నై ఎక్స్‌ప్రెస్’తో అధిగమించాడు. ఈ చిత్రం సుమారు 226 కోట్లు వసూలు చేసింది. ఆ తర్వాత విడుదలైన ‘గ్రాండ్ మస్తీ’ 102 కోట్లు వసూలు చేసింది. భారీ అంచనాల నడుమ విడుదలైన ‘క్రిష్ 3’ టాక్ పెద్దగా లేకున్నా 240 కోట్లు వసూలు చేసింది. ‘రామ్‌లీలా’ 113 కోట్లు కలెక్ట్ చేసింది.  ఈ ఏడాది చివర్లో విడుదలైన ‘ధూమ్ 3’ దుమ్ము రేపింది. 3 రోజుల్లోనే వంద కోట్ల క్లబ్‌లో చేరిందీ సినిమా. ఇప్పటికే 227 కోట్లు వసూలు చేసేసింది. ఇంకెంత చేస్తుందో వేచి చూడాల్సిందే. 2014లో ఈ క్లబ్‌లో ఇంకా సందడి పెరగడం ఖాయమనే అనిపిస్తోంది.