ఎన్టీఆర్ కొండంత భరోసా ఇచ్చారు!

3 Aug, 2014 00:01 IST|Sakshi
ఎన్టీఆర్ కొండంత భరోసా ఇచ్చారు!

 ‘‘పదిహేడేళ్ల నా సినీ జీవితం కళ్ల ముందు కదలాడుతోంది. ఓ తల్లిదండ్రులకు బిడ్డగా ఈ రంగంలో అడుగుపెట్టాను. ఇప్పుడు నేనే ఓ తండ్రి స్థానానికి చేరుకున్నాను. ఈ రోజు నేను పచ్చగా ఉన్నానంటే దానికి కారణం... నా దైవం మా తాతగారు నందమూరి తారకరామారావుగారి ఆశీస్సులు, ప్రేక్షకుల అభిమానమే’’ అని ఎన్టీఆర్ అన్నారు. ఆయన హీరోగా సంతోష్ శ్రీనివాస్ దర్శకత్వంలో బెల్లంకొండ గణేశ్ నిర్మిస్తున్న చిత్రం ‘రభస’. బెల్లంకొండ సురేశ్ సమర్పకుడు.
 
 సమంత, ప్రణీత కథానాయికలు. తమన్ స్వరాలందించిన ఈ చిత్రం పాటలను ఎస్.ఎస్. రాజమౌళి ఆవిష్కరించి, వి.వి. వినాయక్‌కి అందించారు. ఎన్టీఆర్ మాట్లాడుతూ ‘‘ఈ సినిమా నిర్మాణ సమయంలోనే దర్శకుడు సంతోష్ శ్రీనివాస్ కామెర్ల బారిన పడ్డాడు. మంచివాళ్లకు అంతా మంచే జరుగుతుంది. అందుకే అతను ఆ ఆపద నుంచి బయటపడగలిగాడు. తనకోసమైనా ఈ సినిమా విజయం సాధించాలని కోరుకుంటున్నా. ‘ఆది’ తర్వాత బెల్లంకొండ సురేశ్ సంస్థలో నేను చేస్తున్న సినిమా ఇది’’ అన్నారు. సంతోష్ శ్రీనివాస్ మాట్లాడుతూ- ‘‘నేను అనారోగ్యంతో ఉన్నప్పుడు కొండంత భరోసా ఇచ్చారు ఎన్టీఆర్. అంతటి స్టార్ హీరో అయ్యుండి నా కోసం మూడు నెలల పాటు ఎదురు చూశారు.
 
 ఆయన రుణం తీర్చుకోలేనిది. ఈ కథ వినగానే ఎన్టీఆర్ ‘ఓకే’ చేశారు. కానీ... నాకే నిద్ర పట్టలేదు. ఆయన ఇమేజ్‌కి తగ్గట్టు అన్ని హంగులనూ కథలో మేళవించాను’’ అన్నారు. ‘ఆది’ అనుకోని విజయమని, ఈసారి అందరం అనుకుని ‘రభస’తో విజయం సాధించబోతున్నామనీ బెల్లంకొండ సురేశ్ పేర్కొన్నారు. ఎన్టీఆర్‌తో ‘అదుర్స్-2’ తీస్తాననీ, ‘బాహుబలి’ తర్వాత రాజమౌళి కూడా తారక్‌తో సినిమా చేస్తారనీ వినాయక్ చెప్పారు. యూనిట్ సభ్యులతో పాటు దిల్ రాజు, బండ్ల గణేశ్, పైడిపల్లి వంశీ, నీరజ కోన తదితరులు ఈ వేడుకలో పాల్గొన్నారు.