నిరసనల సెగలో ఓ తమిళ సినిమా

2 Apr, 2014 23:53 IST|Sakshi
నిరసనల సెగలో ఓ తమిళ సినిమా
సుప్రసిద్ధ ఛాయాగ్రాహక - దర్శకుడు సంతోష్ శివన్ తాజా తమిళ చిత్రం ‘ఇనమ్’ (హిందీ వెర్షన్ పేరు ‘సిలోన్’) ఇప్పుడు వివాదాలకు నిలయమైంది. మార్చి ఆఖరు  శుక్రవారం నాడు విడుదలైన ఈ సినిమా ప్రదర్శన పలు తమిళ సంఘాల నిరసనలతో ముచ్చటగా మూడు రోజులకే ఆగిపోయింది. సోమవారం నుంచి ఈ సినిమా ప్రదర్శనను ఉపసంహరించుకోవడం గమనార్హం. శ్రీలంక అంతర్యుద్ధంలో చిక్కుకుపోయి, అనాథలుగా మారిన కొంతమంది జీవితాల చుట్టూ ఈ చిత్ర కథ తిరుగుతుంది. శ్రీలంకలోని పరిణామాలతో అస్తవ్యస్తమైన అక్కడి తమిళుల జీవితాలను గుర్తుచేసే ఈ సినిమా పంపిణీ హక్కులను మరో ప్రముఖ తమిళ దర్శక - నిర్మాత లింగుస్వామి కొనుగోలు చేశారు.
 
  తీరా తాజా వివాదాలతో హాళ్ళ నుంచి ఈ సినిమాను ఉపసంహరించుకోవాల్సి వచ్చినట్లు ఆయన ప్రకటించారు. దాంతో, తమిళనాట రాజకీయాల ద్వారా వచ్చే ఒత్తిళ్ళు సినీ రంగంపై ఏ మేరకు ఉంటాయన్నది మరోసారి తేటతెల్లమైంది. సింహళీయులకు అనుకూలంగానూ, శ్రీలంకలోని ఈలమ్ తమిళులకు వ్యతిరేకంగానూ ఉందంటూ తమిళ రాజకీయ నాయకుడు, ఎం.డి.ఎం.కె. అధినేత వైకో ఈ సినిమాలోని సన్నివేశాలను చీల్చిచెండాడారు. మరికొన్ని తమిళ ఉద్యమకారులైతే పాండిచ్చేరీలో ‘ఇనమ్’ను ప్రదర్శిస్తున్న థియేటర్లపై దాడి చేశారు. నిషేధించాలంటూ పిలుపు నిచ్చారు. 
 
 దాంతో, తమిళ సినిమా ప్రదర్శనను దేశవ్యాప్తంగా ఆపివేస్తున్నట్లు లింగుస్వామి హడావిడిగా ప్రకటించాల్సి వచ్చింది. ‘‘మంచి సినిమాలంటే ఇష్టపడే వ్యక్తిగా ‘ఇనమ్’ చిత్రాన్ని నేను పంపిణీ చేశాను. అంతేతప్ప, తమిళ సోదరుల భావోద్వేగాలను దెబ్బతీయాలనో, ఈ సినిమా ద్వారా లాభాలు కూడబెట్టుకోవాలనో నాకు ఏ కోశానా లేదు. కానీ, దురదృష్టవశాత్తూ కొన్ని సంఘాలు ఏకంగా తమిళుల పట్ల నాకున్న ప్రేమాభిమానాల పట్ల సందేహాలు వ్యక్తం చేశాయి. అది నన్ను బాధించింది’’అని ఆయన తన బాధను వ్యక్తం చేశారు. సార్వత్రిక ఎన్నికల జరగనున్న ఈ సమయంలో ‘‘జనంలో గందరగోళం సృష్టించకూడదనుకున్నా. అందుకే, ప్రదర్శనను ఆపివేస్తున్నా’’ అని చెప్పారు. సీనియర్ తెలుగు - తమిళ నటి సరిత, ఇంకా కరుణాస్, కరణ్ కీలకపాత్రలు పోషించిన ‘ఇనమ్’కు మళ్ళీ తెరపై మోక్షమెప్పుడో తెలీదు.  
 
 సెన్సారైనా ఇక్కట్లే!
 నిజానికి, అంతర్జాతీయ ఖ్యాతికెక్కిన సినీ సృజనశీలి సంతోష్ శివన్ ఈ వాస్తవ కథా చిత్రంతో రిలీజ్‌కు ముందు నుంచి వార్తల్లో నిలిచారు. చెన్నైతో పాటు ముంబయ్ లాంటి చోట్ల కూడా సినిమా ప్రివ్యూలు ఏర్పాటు చేసి, వైరముత్తు, శేఖర్ కపూర్ లాంటి తమిళ, హిందీ సినీ ప్రముఖులకు ముందుగానే సినిమా చూపించారు. ఈ సినిమాకు మొత్తం మీద సానుకూలమైన స్పందన, సమీక్షలే వచ్చాయి. అయితే, వారి సూచనల మేరకు సినిమాలో కొన్ని డైలాగులనూ, నాలుగైదు దృశ్యాలనూ కూడా స్వచ్ఛందంగా తొలగించారు. అయినప్పటికీ, ఇప్పుడీ సినిమా వివాదాల్లో పడింది. ఆ మాటకొస్తే, ‘ఇనమ్’ సినిమాను సెన్సార్ బోర్డు చూసి, ప్రదర్శన యోగ్యమైందంటూ సర్టిఫికెట్ ఇచ్చింది. ప్రభుత్వం ఈ చిత్రానికి ‘పన్ను మినహాయింపు’ ప్రకటించింది. కానీ, తీరా సెంటిమెంట్లు దెబ్బతిన్నాయంటూ కొన్ని తమిళ బృందాలు నిరసన తెలపడంతో కథ అడ్డం తిరిగింది. 
 
 ఏమిటీ వివాదం?
 మలయాళీ మూలాలున్న సంతోష్ శివన్ ఉద్దేశపూర్వకంగానే తన చిత్రాల్లో పదే పదే ‘లిబరేషన్ టైగర్స్ ఆఫ్ తమిళ్ ఈలమ్’ (ఎల్.టి.టి.ఇ)ను కించపరిచేలా చూపిస్తున్నారంటూ వైకో లాంటివారు ఆరోపిస్తున్నారు. శివన్ తన గత చిత్రం ‘టైస్ట్’లో ఎల్.టి.టి.ఇ.కి చెందిన ఆత్మాహుతి దళ సభ్యురాలైన ఓ మహిళ ఏ రకంగా ప్రాణత్యాగానికి సిద్ధమవుతుందో చూపారు. చిన్నపిల్లలను ఎల్.టి. టి.ఇ. పోరాట యోధులుగా మారుస్తోందనీ, అలాగే శ్రీలంక బౌద్ధ సన్న్యాసులు దయార్ద్ర హృదయులనీ సంతోష్ శివన్ తన చిత్రాల్లో చూపడాన్ని కూడా ఉద్యమకారులు తప్పుబడుతున్నారు. ఇదే పద్ధతిలో తమిళుడు ఎవరైనా ముందుకొచ్చి మలయాళీలను కించపరుస్తూ సినిమా తీసి, కేరళలో ప్రదర్శిస్తే, మలయాళీలు ఊరకుంటారా అని ఆగ్రహించారు. 
 
 ఈ పరిణామాల నేపథ్యంలో భారీ ఆర్థిక నష్టానికి కూడా సిద్ధపడి, నిర్మాతలు సినిమా ప్రదర్శనను ఆపుచేయాల్సి వచ్చింది. ఈ వ్యవహారంపై వ్యాఖ్యానించడానికి సంతోష్ శివన్ మాత్రం అందుబాటులోకి రాలేదు. ఒక్కసారి గతంలోకి వెళితే, గడచిన ఏడాది పైచిలుకు కాలంలో తమిళనాట కమలహాసన్ ‘విశ్వరూపం’, రాజీవ్ గాంధీ హత్యోదంతం ఆధారంగా వచ్చిన హిందీ చిత్రం ‘మద్రాస్ కేఫ్’, హీరో విజయ్ నటించిన ‘తలైవా‘ (తెలుగులో ‘అన్న’) లాంటివి సెన్సార్ జరుపుకొని కూడా రిలీజ్‌కు ముందు నిరసనలను ఎదుర్కొన్నాయి. ఇప్పుడు ‘ఇనమ్’ చిత్రమైతే ఏకంగా రిలీజై కూడా, నిరసనలతో తెర మీద నుంచి పక్కకు తప్పించాల్సి రావడం విచిత్రం.