శత్రువు కూడా ముఖ్యమే

6 Feb, 2019 03:37 IST|Sakshi
సాయికృష్ణ పెండ్యాల

‘‘డిస్ట్రిబ్యూటర్‌ నుంచి ప్రొడ్యూసర్‌ అయ్యాను. నిర్మాతగా ‘దండుపాళ్యం– 3’, అర్జున్‌ 150వ సినిమా ‘కురుక్షేత్రం’, ‘మారి–2’ విడుదల చేశా. ఇప్పుడు ‘సీమరాజా’ నా నాలుగో చిత్రం. ఇది మంచి హిట్‌ అవుతుందనే నమ్మకం ఉంది’’ అన్నారు సాయికృష్ణ పెండ్యాల. శివకార్తికేయన్‌ హీరోగా, సమంత, కీర్తీ సురేశ్‌ హీరోయిన్లుగా పొన్‌రాం దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘సీమరాజా’. ఈ సినిమాను లక్ష్మీ పెండ్యాల సమర్పణలో సాయికృష్ణా ఫిలిమ్స్‌ పతాకంపై సాయికృష్ణ పెండ్యాల తెలుగులో ఈ నెల 8న విడుదల చేస్తున్నారు. సాయికృష్ణ పెండ్యాల మాట్లాడుతూ– ‘‘సీమరాజా’ సినిమాను తెలుగులో విడుదల చేయడానికి కారణం చెన్నెలో ఉండే నా మిత్రుడు.

తను ఈ సినిమాలోని ‘మనిషి బతకాలంటే మిత్రుడు ఎంత ముఖ్యమో.. శత్రువు కూడా అంతే ముఖ్యం’’ అనే డైలాగ్‌ నాకు పంపించాడు. ఆ డైలాగ్‌ విని ఈ సినిమాని తమిళ్‌తో పాటు తెలుగులో ఒకేసారి విడుదల చేద్దామనుకున్నాను.. కుదరలేదు. చంద్రబోస్‌గారు, వెన్నెలకంటి గారు రాసిన పాటలకు, ఇటీవల విడుదలైన ట్రైలర్‌కి మంచి స్పందన వస్తోంది. ఈ చిత్రంలో సమంత యాక్షన్‌ సీన్స్‌లో బాగా నటించారు. కీర్తీసురేశ్‌ 30 నిమిషాలపాటు యువరాణి గెటప్‌లో కనిపిస్తారు. సిమ్రాన్‌గారు నెగటివ్‌ పాత్రలో అలరించారు. డిస్ట్రిబ్యూటర్‌గా 18 సంవత్సరాల్లో 300లకుపైగా సినిమాలు విడుదల చేశాను. ‘సీమరాజా’ సినిమాను ఏపీ, తెలంగాణల్లో 400 థియేటర్స్‌కుపైగా విడుదల చేస్తున్నాం’’ అన్నారు.

మరిన్ని వార్తలు