శ్మశానంలో 'షి'

21 Dec, 2015 14:32 IST|Sakshi
శ్మశానంలో 'షి'

హైదరాబాద్: విలక్షణ నటుడు, రచయిత ఉత్తేజ్ కుమార్తె  హీరోయిన్‌గా నటిస్తున్న సినిమా షూటింగ్ కార్యక్రమం లాంఛనంగా మొదలైంది. ఈ విషయాన్ని ఉత్తేజ్ సోమవారం సోషల్ మీడియాలో అఫీయల్గా ప్రకటించారు. షీ అనే తెలుగు సినిమా ద్వారా వెండితెరకు పరిచయమవుతున్న తన కుమార్తెను ఆశీర్వదించాలని కోరారు. ఆ విశేషాలను, ఫొటోలను ట్విట్టర్‌లో పంచుకున్నారు.  

మలయాళ కుట్టి శ్వేతా మీనన్ ప్రధాన పాత్రలో ఉత్తేజ్ కూతురు చేతన టాలీవుడ్‌లో తెరంగేట్రం చేయనుంది. పర్స రమేష్ మహేంద్ర దర్శకత్వంలో కల్వకుంట్ల తేజేశ్వర్ రావు పరమేశ్వర ఆర్ట్స్ పతాకంపై నిర్మిస్తున్న చిత్రం ''షీ''.  'ఈజ్ వెయిటింగ్' అనే ట్యాగ్ లైన్తో వస్తున్న ఈ  సినిమా  కొన్ని దృశ్యాలను శ్మశానంలో చిత్రీకరించారు. ముహూర్తం సన్నివేశానికి నిర్మాత కల్వకుంట్ల తేజేశ్వర్ రావు సోదరి రమ్య క్లాప్ కొట్టగా , అనూప్ సింగ్ కెమెరా స్విచాన్ చేశారు. పూరీ జగన్నాథ్ గౌరవ దర్శకత్వం వహించారు.

తాను ఇంతకు ముందు బాలనటిగా నటించినా, హీరోయిన్‌గా మాత్రం ఇదే తొలి సినిమా అని, ప్రేక్షకులు ఆదరించాలని కోరుకుంటున్నానని చేతన మీడియాతో చెప్పారు. మరి ఈమె కూడా తండ్రిలాగే విలక్షణ నటనతో ఆకట్టుకుంటుందా.. హీరోయిన్గా రాణిస్తుందా అనేది తెలియాలంటే షీ సినిమా విడుదల వరకు వేచిచూడాల్సిందే.