అందుకే ఆ పెయింటింగ్స్ గిఫ్ట్‌గా ఇచ్చేస్తుంటాను!

9 Feb, 2016 00:08 IST|Sakshi
అందుకే ఆ పెయింటింగ్స్ గిఫ్ట్‌గా ఇచ్చేస్తుంటాను!

‘‘గ్లామరస్ రోల్స్‌కే పనికొస్తుందనో.. సంప్రదాయబద్ధమైన పాత్రలకే సూట్ అవుతుందనో.. ఇలా నా మీద ప్రత్యేకమైన ముద్రపడలేదు. అందుకే, పాత్రల పరంగా నేనెలాంటి ప్రయోగం అయినా చేయొచ్చు’’ అని అదాశర్మ అన్నారు. ఆది సరసన ఈ బ్యూటీ నటించిన ‘గరం’ ఈ 12న విడుదల కానుంది. మదన్ దర్శకత్వంలో వసంతా శ్రీనివాస్ సమర్పణలో పి. సురేఖ ఈ చిత్రాన్ని నిర్మించారు. ఇక.. అదాశర్మ ఏమంటున్నారో తెలుసుకుందాం.

  మణిరత్నంగారి ‘బొంబాయి’ సినిమా విడుదలైనప్పుడు నాకు ఏడెనిమిదేళ్లు ఉంటాయి. ఆ సినిమాలో ముస్లిమ్ యువతి పాత్రలో మనీషా కొయిరాలా కనబర్చిన నటన నా మనసులో అలా నిలిచిపోయింది. చిన్నప్పుడే హీరోయిన్ అవ్వాలని అనుకున్నాను కాబట్టి, ముస్లిమ్ యువతి పాత్ర చేయాలని అప్పుడే ఫిక్సయ్యాను. ‘గరం’తో ఆ కోరిక తీరింది. ఇందులో సమీరా అనే ముస్లిమ్ యువతిగా నటించా. మంచి ఎండల్లో ఈ షూటింగ్ జరిగినప్పుడు బుర్ఖా వేసుకుని నటించడం కొంచెం కష్టం అనిపించింది.  

  ‘గరం’ నాకు ఎక్స్‌ట్రా స్పెషల్ మూవీ. ఇలా అనడానికి కారణం... ఒకే సినిమాలో ఇటు ట్రెడిషనల్‌గా.. అటు గ్లామరస్‌గా కనిపించే అవకాశం రావడమే. మామూలుగా పాటల చిత్రీకరణ అప్పుడు నేను వంద సార్లయినా స్టెప్స్ ప్రాక్టీస్ చేయడానికి వెనకాడను. ఆ విషయంలో నాకే పిచ్చి అనుకుంటే... ఆదికి నాకన్నా పిచ్చి ఎక్కువ. తనైతే 200 సార్లు ప్రాక్టీస్ చేయడానికి కూడా వెనకాడడు. మంచి ఆర్టిస్ట్ మాత్రమే కాదు.. ఆది మంచి ఫ్యామిలీ మ్యాన్ కూడా. తన వైఫ్ కూడా చాలా మంచిది. సాయికుమార్‌గారి బ్యానర్‌లో సినిమా చేయడం నాకు మంచి అనుభూతినిచ్చింది.

  చాలా చిన్నప్పుడు నేను కొన్ని రోజులు కథక్ నేర్చుకున్నాను. ఇప్పుడు రష్యన్ బ్యాలే డ్యాన్స్ నేర్చుకుంటున్నాను. యాక్చువల్‌గా ఆరేడేళ్ల వయసులోనే బ్యాలే నేర్చుకోవాలి. అప్పుడే బాగా వస్తుంది కూడా. అయినప్పటికీ నేనిప్పుడు నేర్చుకోవడానికి కారణం నాకు ఆసక్తి ఉండటమే. ఫిజికల్ పిట్‌నెస్‌కి కూడా బ్యాలే డ్యాన్ బాగా పనికొస్తుంది. తీరిక సమయాల్లో నేను పెయింటింగ్స్ వేస్తుంటాను. నేను వేసే పెయింటింగ్స్ అన్నీ పెట్టుకోవాలంటే ఇప్పుడున్న మా ఇల్లు చాలదు. అందుకే, వాటిని ఫ్రెండ్స్‌కి బహుమతిగా ఇస్తుంటాను. ఇంకా నాకు పుస్తకాలు చదివే అలవాటు కూడా ఉంది.

  బేసిక్‌గా నాది పాజిటివ్ మైండ్ సెట్. అందుకే నెగటివ్ పీపుల్‌కి దూరంగా ఉంటాను. ఒక వేళ ఎవరైనా నెగటివ్ కామెంట్స్ పాస్ చేస్తే, హర్ట్ అయిపోను. ఎందుకంటే నాకు కాన్ఫిడెన్స్ ఎక్కువ. నా ప్రతిభ మీద నాకు అపనమ్మకం లేదు.

  ‘సన్నాఫ్ సత్యమూర్తి’, ‘సుబ్రమణ్యం ఫర్ సేల్’ చిత్రాల్లో నిడివి తక్కువ ఉన్న కీలక పాత్రలు చేశాను. అవెందుకు చేశారని కొంతమంది అడిగారు. త్రివిక్రమ్, బన్నీ కాంబినేషన్‌లో సినిమా చేయాలనిపించింది... చేశాను. ‘సుబ్రమణ్యం ఫర్ సేల్’ పాత్ర కూడా చాలా బాగుంటుంది. అయినా ఏం చేసినా విమర్శించేవాళ్లు ఉంటారు. పరుగెత్తితే ఎందుకు నడవడంలేదంటారు? నడిస్తే.. పరుగెత్తడం లేదేంటి? అంటారు. అందుకే నాకు నచ్చినట్లుగా నేనుంటాను. నడవాలనిపించినప్పుడు నడుస్తాను.. పరుగెత్తాలనిపించినప్పుడు పరుగెత్తుతాను.

  వేలంటైన్స్ డేకి ఇక్కడే ఉంటాను. మా అమ్మగారు ముంబై నుంచి ఇక్కడికి వస్తున్నారు. ఆ రోజు తనతోనే సెలబ్రేట్ చేసుకుంటాను. వేలంటైన్స్ డే అంటే ప్రేమికులే చేసుకోవాల్సిన అవసరంలేదు. తల్లీ, కూతురి మధ్య ఉండేది కూడా ప్రేమ బంధమే. ఆ రోజు నేను మా అమ్మగారితో కలిసి థియేటర్లో ‘గరం’ చూడాలనుకుంటున్నా.