బిగ్‌ బీ ఔదార్యం: 500 మంది కోసం 3 విమానాలు!

10 Jun, 2020 16:34 IST|Sakshi

వలస కార్మికుల పట్ల బిగ్‌ బీ అమితాబ్‌ ఉదారత

లాక్‌డౌన్‌ కారణంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న వలస కార్మికుల పట్ల బిగ్‌ బీ అమితాబ్‌ బచ్చన్‌ ఔదార్యం ప్రదర్శించారు. ఇతర రాష్ట్రాల్లో చిక్కుకుపోయిన దాదాపు 500 మంది కార్మికులను మూడు విమానాల్లో తరలించేందుకు మెగాస్టార్‌ టికెట్లు బుక్‌ చేశారు. ఈ విషయాన్ని ఆయన సన్నిహిత వర్గాలు బుధవారం వెల్లడించాయి. మిడ్‌డే కథనం ప్రకారం.. ‘‘బచ్చన్‌జీకి పబ్లిసిటీ ఇష్టం ఉండదు. వలస కార్మికుల కష్టాలు విని చలించిపోయిన ఆయన.. వారి కోసం ఏదైనా చేయాలనుకున్నారు. 180 మందిని వారణాసికి తరలించేందుకు ఇండిగో ఎయిర్‌లైన్స్‌ విమానంలో టికెట్లు బుక్‌ చేశారు. ఈ రోజు ఉదయం ఓ విమానం బయల్దేరింది. వలస కార్మికులు పొద్దున ఆరు గంటలకే అక్కడికి చేరుకున్నారు. నిజానికి తొలుత వాళ్లను రైళ్లలో తరలించాలని భావించారు. కానీ కుదరలేదు. మొత్తం 500 మంది కోసం మూడు విమానాలు ఏర్పాటు చేశారు’’ అని అమితాబ్‌ స్నేహితులు పేర్కొన్నారు.(అఅఆ వసూళ్లు బాహుబలి–2 కంటే ఎక్కువ!)

ఇక వారణాసితో పాటు పశ్చిమ బెంగాల్‌, బిహార్‌, తమిళనాడు సహా ఇతర రాష్ట్రాల వలస కార్మికులను తరలించేందుకు సైతం బిగ్‌ బీ ఏర్పాట్లు చేస్తున్నారని వారు వెల్లడించారు. ఇదిలా ఉండగా.. వారం రోజుల క్రితం ముంబై నుంచి యూపీ వలస కార్మికులను 10 బస్సుల్లో అమితాబ్‌ టీం తరలించినట్లు సమాచారం. ఈ వ్యవహారాలన్నింటిని బిగ్‌ బీకి అత్యంత నమ్మకమైన ఓ వ్యక్తి పర్యవేక్షిస్తున్నట్లు తెలుస్తోంది. కాగా అమితాబ్‌ బచ్చన్‌ గతంలోనూ పలు సామాజిక కార్యక్రమాలు చేపట్టిన విషయం తెలిసిందే. రైతులకు ఆర్థిక సాయం ప్రకటించిన బిగ్‌ బీ.. వారి అప్పులను తీర్చారు. తాజాగా లాక్‌డౌన్‌ నేపథ్యంలో ఇబ్బందులు పడుతున్న సినీ కార్మికులను ఆదుకునేందుకు తన వంతు సాయం అందించారు. ఇక బాలీవుడ్‌ నటుడు సోనూ సూద్‌ వందలాది మంది వలస కార్మికులను తరలించి అందరి ప్రశంసలు అందుకుంటున్న సంగతి తెలిసిందే.(ఎవరి అభిప్రాయం వారిది : సోనూసుద్‌)

మరిన్ని వార్తలు