కళావెన్నెల

10 Feb, 2019 00:09 IST|Sakshi
‘సాక్షి’కి ఇచ్చిన ఎక్స్‌క్లూజివ్‌ ఇంటర్వ్యూలో.. కళాతపస్వి కె.విశ్వనాథ్, సిరివెన్నెల సీతారామశాస్త్రి

విశ్వాన్ని గెలవాలంటే కళాతపస్వి కావాలి. కళను గెలవాలంటే సాహితీవెన్నెల కావాలి. సరస్వతీ పుత్రులు పద్మాలలో కూర్చుంటేనే కదా.. ఆ పద్మాలు కిరీటాలు అవుతాయి.  పాటలు పామరులకు అందాయి.  కథలు ప్రేక్షకులకు అందాయి. పద్మాలు ‘కళావెన్నెల’కు అందాయి.

ఇటీవల కేంద్ర ప్రభుత్వం ‘సిరివెన్నెల’ సీతారామ శాస్త్రికి ‘పద్మశ్రీ’ ప్రకటించిన నేపథ్యంలో కళాతపస్వి కె. విశ్వనాథ్‌ తన స్వగృహంలో సిరివెన్నెలను సత్కరించారు. ఇద్దరూ కలసి ఇంటర్వ్యూ ఇస్తే బాగుంటుందని ‘సాక్షి’ అడిగితే గురుశిష్యులిద్దరూ బోలెడన్ని విశేషాలు పంచుకున్నారు.

సాక్షి: ఒకరు దర్శక దిగ్గజం.. ఒకరు గొప్ప ‘కలం’కారుడు. ‘సిరివెన్నెల’తో ప్రారంభమైన మీ ఇరువురి ఈ ప్రయాణంలో ఆసక్తికరమైన విషయాలు తెలుసుకోవాలని ఉంది. ముందుగా ‘పద్మశ్రీ’ గురించి   మీ అనుభూతి..
విశ్వనాథ్‌: నాకు పద్మశ్రీ అవార్డు వచ్చినప్పుడు అనుకుంటా.. ఆదుర్తి సుబ్బారావు (దర్శక–నిర్మాత)గారు మా ఇంటికి వచ్చి ‘విశ్వానికి దిష్టి తగలకుండా ఆరు నందులు ఉన్నాయి. ఆ నందులే పోట్లాడతాయిలే’ అన్నారు. 

సిరివెన్నెల: ఆ సమయంలో ప్రతీ ఏడాది బెస్ట్‌ పిక్చర్, బంగారు నంది.. అన్నీ నాన్నగారి (విశ్వనాథ్‌)కి వచ్చాయి. ఇప్పుడు నాకు పద్మశ్రీ వచ్చిందనగానే ముందు గురువు (విశ్వనాథ్‌)గారిని కలవాలనిపించింది.

విశ్వనాథ్‌: నాకు ‘పద్మశ్రీ’ (1992) అవార్డు వచ్చినప్పుడు ఆ విషయం సాయంకాలమే తెలిసింది. హోమ్‌ మినిస్ట్రీ నుంచి కాల్‌ వచ్చింది. చెబితే నమ్మవు. నిమ్మకు నీరెత్తినట్టు ఉండిపోయాను. భోజనాల వేళ దాక ఇంట్లో ఎవ్వరితోనూ పంచుకోలేదు. అప్పుడు ఎలక్ట్రానిక్‌ మీడియా అంతగా లేదు. 

సిరివెన్నెల: ఆ రోజు మా తండ్రిగారి తిథి. మధ్యాహ్నం భోజనం చేసి పడుకున్నాను. ఓ విచిత్రమైన భావన కలిగింది. అది చాలా బలమైన భావన. ఇవాళ జనవరి 25, పద్మశ్రీ అనౌన్స్‌ చేస్తారు. ఆ విషయాన్ని సాయి (కుమారుడు యోగేశ్వర శర్మ) నాకు వచ్చి చెబుతాడని అనిపించింది. ఇంతలో ఓ ఫోన్‌ వచ్చింది.. నేను లిఫ్ట్‌ చేయలేదు. ఆ తర్వాత మరోటి. సాయి పరిగెత్తుకొచ్చి ఫోన్‌ తీశాడు. వీడేంటి ఇంత కంగారు  పడుతున్నాడు. పద్మశ్రీ వచ్చిందా ఏంటి? అనుకున్నాను. అది నిజమైంది. నాకా విషయాన్ని సాయి చెప్పగానే,  ‘మీ నాన్నగారికి చెప్పు అని మా నాన్నగారు’ తనని పంపించారా అనిపించింది. నా జీవితంలో మొదటిసారి ఓ అవార్డుకి సంబంధించి వచ్చిన టెలిగ్రామ్‌ గుర్తుకు వచ్చింది. ‘ఏ నోబడీ బికేమ్‌ ఏ స్టేట్‌ గెస్ట్‌ వితిన్‌ నో టైమ్‌’ అని అప్పుడు నేను అనుకున్నాను. పద్మశ్రీ గురించి చెప్పి, ‘తాతకు ఏం వచ్చింది’ అని నా మనవరాలిని అడిగితే.. తన్నమానం (సన్మానం),  తాతకు పద్దమశ్రీ వచ్చింది అంది (నవ్వులు). మేం తన్నమానం ఎందుకొచ్చింది? అంటే తాతకు ఇంగ్లిష్‌ రాదు కాబట్టి అంది. తన్నమానం అంటే ఏం చేస్తారు? అని మేం అడిగితే.. చేతికి కర్ర ఇచ్చి, టోపీ పెట్టి దుప్పటి కప్పుతారు అని చెప్పింది. భలే ముచ్చటగా అనిపించింది. 

రచయితలు ఆత్రేయ, ఆరుద్రగార్లకే పద్మశ్రీ రాలేదు?
సిరివెన్నెల: ఎవరో అడిగితే చెప్పాను.. వాళ్ల ప్రసాదంలా ఈ పురస్కారాన్ని స్వీకరిస్తాను అని. తెలుగులో లిరిక్‌ అనే విషయాన్ని ఎందుకో గుర్తించలేదు. విచిత్రమేంటంటే నాన్నగారూ.. ‘మీ కంటే ముందు నారాయణ రెడ్డిగారికి వచ్చింది’ కదా అని నాతో కొందరు అన్నారు. ఆయనకు ‘పద్మభూషణ్‌ కూడా’ ఉంది. కానీ ఆయనకు ఆ అవార్డ్‌ వచ్చింది ‘లిటరేచర్‌ అండ్‌ ఎడ్యుకేషన్‌’ విభాగంలో. తమిళంలో వైరముత్తు, బాలీవుడ్‌లో జావేద్‌ అక్తర్‌లకూ అదే విభాగంలో ఇచ్చారు. లిరిక్‌ అనే విభాగంలో రాలేదు. గతేడాది లిరిక్‌ అనే విభాగంలో కర్ణాటక సినీ రచయిత దొడ్డ రంగె గౌడకి వచ్చింది. ఈ ఏడాది నాకు వచ్చింది.
హాలీవుడ్‌ వాళ్లు సాంగ్‌ రైటర్, లిరిసిస్ట్‌ అని డివైడ్‌ చేశారు. సాంగ్‌ రైటర్‌ అంటే ట్యూన్‌కి మాటలు ఇచ్చేవాడు. లిరిక్‌ అంటే సాంగ్‌ విత్‌ పొయెటిక్‌ లైన్స్‌ అని. పొయెటిక్‌ కంటెంట్‌ నాన్నగారి సినిమాల్లోనే రావడం మనం గమనించవచ్చు. ఆయన సినిమాతో∙కాకుండా ఇంకో చోట నేను పరిచయమయ్యుంటే ఇండస్ట్రీలో నేనుండేవాడినే కాదేమో.

ఇంటర్వ్యూ స్టార్ట్‌ అయ్యే ముందు సిరివెన్నెలగారు ‘పద్మశ్రీ’ ప్రకటించగానే మీ దగ్గరకు వద్దాం అనుకున్నాను నాన్నగారూ అంటే.. ‘ఇప్పుడైనా ఏముందిలే. ప్రతి క్షణమూ మన క్షణమే’ అన్నారు. సీతారామశాస్త్రి అనే ఈ మాణిక్యాన్ని ఏ క్షణాన గుర్తించారు?
విశ్వనాథ్‌: ఒకసారి శాస్త్రి (సిరివెన్నెల) రావడం రావడమే చిన్న స్క్రిప్ట్‌తో వచ్చాడు. అందులో పాటలు కూడా రాశాడు. ఆ పాటల్లో మంచి భావుకత ఉంది అనిపించింది. అది అలా మనసులో గుర్తుండిపోయింది. సంవత్సరం తర్వాత నాకో కొత్త లిరిసిస్ట్‌ కావాల్సిన అవసరం వచ్చింది. అప్పుడు చేబోలు సీతారామశాస్త్రి అనే వ్యక్తి గుర్తొచ్చాడు. అయితే తనకు ఎలా కబురు పంపానో నాకు గుర్తులేదు. 

సిరివెన్నెల: ఆకెళ్ల సాయినాథ్‌ ద్వారా పంపారు. 

విశ్వనాథ్‌: ‘సిరివెన్నెల’ సినిమాకి పిలిపించి రాయించాం. సింగిల్‌ కార్డ్‌. ఆ రోజుల్లో అన్ని పాటలూ కొత్త రచయితతో రాయించడం అంటే పెద్ద సాహసమే. ఎందుకంటే ఒక్కో పాట ఒక్కో రచయిత రాస్తున్న సమయం అది. జానపదం అయితే కొసరాజు. మనసు పాట అయితే ఆత్రేయ, క్లబ్‌ పాట అయితే ఆరుద్ర. మూడు నాలుగు పేర్లు టైటిల్‌ కార్డ్‌లో పడటం సాధారణం. పౌరాణికాలు అయినప్పుడు సముద్రాల గారు వాళ్లు మాత్రమే సింగిల్‌ కార్డ్‌ రాసేవారు. మల్లాది రామకృష్ణ శాస్త్రిగారికి కూడా ఇంకో పేరు జతపడేది. మరేం ధైర్యమో? వంట రుచిగా ఉంటుందో, అన్ని రకాలు వండగలడో కూడా తెలియదు. మనోధైర్యంతో రాయించాను.

సిరివెన్నెల: కన్విక్షన్‌ ఉన్నవాళ్లకు బాగా ఫీడ్‌ ఇస్తే.. ఎవ్వరికైనా కొత్తగా రాస్తారు. ‘నాకు అర్థం అయినా కాకపోయినా మీరు విజృంభించి రాయండి. మీకిది జైలు కాదు’ అని నాన్నగారు అన్నారు. 

విశ్వనాథ్‌: కేవీ మహదేవన్‌ (సంగీత దర్శకుడు) ముందు పాట రాయించుకుని, ఆ తర్వాత ట్యూన్‌ కట్టేవారు. ‘సిరివెన్నెల’కి ఆ విధంగానే శాస్త్రిని నానా హింసలు పెట్టి రాయించుకున్నాను. వీళ్లు (ఆకెళ్ల సాయినాథ్, సిరివెన్నెల) నాతో పాటే నందీ హిల్స్‌లో ఉండేవాళ్లు. ఇద్దరూ పగలంతా తిరిగేవారు. ఇంకేం చేసేవారో నాకు తెలియదు కానీ సాయంత్రానికి తిరిగొచ్చేవాళ్లు (నవ్వుతూ). నా షూటింగ్‌ పూర్తి చేసుకొని ఖాకీ డ్రెస్‌ తీసేసి కొంచెం రిలాక్స్‌ అయ్యాక కలిసేవాళ్లం. ఆ రోజు అలా కొండ చివరకు వెళ్లాం. అప్పుడు శాస్త్రి ఓ రెండు వాక్యాలు గమ్మత్తుగా ఉన్నాయి అన్నాడు. ఎవరైనా అలా అంటే వాటిని వినేదాకా నేను తట్టుకోలేను. నాకదో వీక్‌నెస్‌. ఏమొచ్చిందయ్యా అన్నాను. ‘ఆది భిక్షువుని ఏమి కోరేది. బూడిదిచ్చేవాడిని ఏమడిగేది’ అన్నాడు శాస్త్రి. అయ్య బాబోయ్‌.. అనిపించింది. 

సిరివెన్నెల:  ఐదు చరణాలు రాశాను. అంతా గుర్తుంది. మరి ఈ వాక్యాలు పెట్టే సందర్భం కుదురుతుందా? అంటే ‘కథ మన చేతుల్లో ఉంటే, మనం చెప్పినట్టు నడుస్తుంది’ అన్నారు గురువుగారు.
విశ్వనాథ్‌:  మా స్నేహం ఎంతలా పెరిగిపోయిందంటే శాస్త్రీ.. నువ్వు రాసినా, రాయకపోయినా ఓసారి వచ్చి కథ విని వెళ్లు. నీతో రాయిస్తానో లేదో నాకు తెలియదని కబురు పంపేవాడిని. అంత కుటుంబ సభ్యుడు అయిపోయాడు. మా ఇంటి వ్యక్తిలా అన్నమాట.

మీరు పాట సందర్భం అనుకున్నప్పుడే పల్లవి రాసుకుంటారట. నిజమా?
విశ్వనాథ్‌: నేను కథ రాసేటప్పుడే అబద్ధపు సాహిత్యం (డమ్మీ లైన్స్‌) పక్కన పెట్టుకుంటాను. ఊరికే నా ఐడియా ఇదీ అని చెబుతాను. ఇలా ఉండాలి అని శాసించను. రాస్తున్న కవి మనసుకు హత్తుకుని, ఛందోబద్ధంగా ఉంటే అది తీసుకుంటారు. తీసుకోవాలని నేను పట్టుబట్టింది లేదు.

విశ్వనాథ్‌గారి పల్లవులు యథాతథంగా వాడిన సందర్భాలు ఏమైనా?
సిరివెన్నెల: ‘శ్రుతిలయలు’ సినిమాలోని ‘తెలవారదేమో స్వామి.. నీ తలపుల మునకలో..’ పల్లవి ఆయనిచ్చినదే.

‘సిరివెన్నెల’ తీసేటప్పుడు ఇలాంటి సబ్జెక్ట్‌ని ఎందుకు ఎంచుకున్నామా? అని, ఎన్నో నిద్రలేని రాత్రులు గడిపానని ఓ సందర్భంలో విశ్వనాథ్‌గారు అన్నారు. మరి.. ఆ సినిమాకి పాటలు రాసేటప్పుడు మీకేమైనా?
విశ్వనాథ్‌: శాస్త్రికి బదులుగా నేను చెబుతా. అలాంటి సందర్భాలు తనకు అనేకం పెట్టాను. శాస్త్రిది యంగ్‌ బ్లడ్‌ కదా అని (నవ్వుతూ). ‘కష్టపెడుతున్నారు వీళ్లు’ అని ఏ సందర్భంలోనూ తను అనుకోలేదు. పెద్ద అదృష్టం ఏంటంటే మాకు నిర్మాతలు అడ్డు చెప్పలేదు. ఉదయం అని రాస్తే ‘సార్‌ అర్థం అవ్వదేమో... పొద్దునే, లేచినవేళ’ అని రాయండి అని చెప్పలేదు.

సిరివెన్నెల: కవిత్వం రాయడం అనేది  కేవలం విశ్వనాథ్‌గారి సినిమాల్లోనే సృష్టించబడింది. అందులో అతిశయోక్తి లేదు. ఎందుకంటే ప్రతి పాట కవిత్వం కానక్కర్లేదు. కవిత్వం అంటే చెప్పినదే కాకుండా చెప్పని భావం కూడా బోలెడంత కనబడాలి. ఆయన నాకు పది చాలెంజ్‌లు విసిరితే వాటిని నేను పన్నెండు చేసుకోవడానికి ఇష్టపడతాను.

విశ్వనాథ్‌: త్యాగరాజు, అన్నమయ్య కీర్తనలు వింటాం. ఆస్వాదిస్తాం. వాటికి ఇదే సందర్భం అనలేం కదా. మా పాట సినిమాలో సందర్భానికి సరిపోవడం ఒక్కటే కాదు... ఎవరు విన్నా కూడా ఎలా అయినా ఆపాదించుకునేలా ఉండాలి. అలాంటి పాటలను పెట్టాం.

సిరివెన్నెల: ఎక్కడైతే మాట ఆగిపోతుందో అక్కడ పాట మొదలవుతుంది. విశ్వనాథ్‌గారి సినిమాల్లో సంస్కారం ఉన్న పాత్రలే ఉంటాయి. ఆ మినిమమ్‌ సంస్కారం ఉన్న మనుషులకు రావాల్సిన సమస్యలే వస్తాయి. రిక్షావాడికి ఓ సంస్కారం ఉంటుంది. కసాయివాడికి ఓ సంస్కారం. ‘జీవన జ్యోతి’లో ఓ సన్నివేశంలో ఓ తాగుబోతు వాణిశ్రీని రేప్‌ చేస్తాడు అని ప్రేక్షకులు ఊహిస్తారు. కానీ వచ్చి దుప్పటి కప్పి వెళ్లిపోతాడు. అది వాడి సంస్కారం. 

విశ్వనాథ్‌: దర్శకుడిగా నేను స్క్రీన్‌ ప్లే రాసుకునేటప్పుడు ఓ పాటొస్తుంది సుమా అని ప్రేక్షకుడిని భయపెట్టను. ప్రియుడి దగ్గర నుంచి ఉత్తరం వచ్చేసింది. ఇన్ని పూలు పెట్టుకుంది. పాట రాబోతోంది... అలా ఉండదు. నిజంగానే జరిగిన విషయాన్ని పాట రూపంలో ఎలా అలంకారం చేస్తాం అన్నది ముఖ్యం. మరీ ఎక్కువ అలంకారం చేసినా బప్పీలహరి పాటలా ఉంటుంది. అది ఉండకూడదు. హ్యాండ్‌ ఇన్‌ గ్లౌ అంటారే అలాగ. 

సిరివెన్నెల: ఓవర్‌ డ్రమటైజేషన్‌ అనేది విశ్వనాథ్‌గారి సినిమాల్లో ఉండదు. సన్నివేశం తీసే ముందు డైలాగ్‌ పేపర్‌ని చూస్తూ, నేనైతే ఇంట్లో ఇలా మాట్లాడతానా? అని అనుకుంటారు ఆయన. అలా లేకపోతే దాన్ని పక్కన పెట్టేస్తారు. 

తొలి సినిమానే విశ్వనాథ్‌గారితో చేయడంవల్ల మీ పాటల్లో కవితాత్మక ధోరణి కనిపిస్తుందా?
సిరివెన్నెల: కవిగా నా స్వభావమే అది. ఏ సీన్‌కి అయినా నేను చాలా త్వరగా రియాక్ట్‌ అయి రాస్తుంటాను. సంఘటన, వ్యక్తులు, ప్రదేశాలకు రాయమంటే నేను రాసేవాణ్ణి కాదు. అవన్నీ కాదు.. ఏదైనా కాన్సెప్ట్‌ ఉంటే చెప్పండి రాస్తాననేవాణ్ణి. ఫలానా ఆయన్ని పొగిడి రాయమన్నా కూడా తత్వాన్ని పొగుడుతాను. 
విశ్వనాథ్‌: మామూలుగా అయితే దీన్ని  పొగరుబోతుతనం అనుకుంటారు కానీ వ్యక్తిత్వం అనుకోరు. ఆ రెంటినీ డివైడ్‌ చేసే లైన్‌ చాలా కష్టమైంది.

‘వ్యక్తిని పొగడను’ అని సిరివెన్నెలగారు కనబర్చిన వ్యక్తిత్వం గురించి కానీ, ఆయన తాను అనుకున్నదే రాస్తారని కానీ మీకేమైనా కంప్లైంట్స్‌ వచ్చాయా? 
విశ్వనాథ్‌: ఒక ఇరవై ఏళ్ల స్నేహంలో అలాంటి కంప్లైట్స్‌ని నిజమని నమ్మితే అది మూర్ఖత్వం అవుతుంది. ఎవరైనా నా దగ్గరకు వచ్చి ‘ఆయన నాకు చాన్స్‌ ఇవ్వడమేంటి? నాకు టాలెంట్‌ ఉంది కాబట్టే ఇచ్చారు’ అని సిరివెన్నెల అంటున్నాడు అని అన్నప్పుడు, దాన్ని నమ్మేసి ఇంట్లోవాళ్లందరితో వాగేసి, శాస్త్రి రేపొస్తే కడిగేస్తాను అనుకుంటే కరెక్ట్‌ కాదు. అలా చెప్పినవాడిని కొట్టాలి (నవ్వుతూ).
ఇలా సరదాగా సంభాషణ సాగుతున్న సమయంలో విశ్వనాథ్‌గారి సతీమణి (జయలక్ష్మి) వచ్చారు. మెల్లిగా నడుస్తూ వచ్చిన జయలక్ష్మిగారు సిరివెన్నెలగారి కుర్చీ పక్కన కూర్చుంటే.. విశ్వనాథ్‌గారి పక్కన కూర్చోమని అడిగిన ‘సాక్షి’తో నడవలేనేమో అన్నప్పుడు ‘ఇంతకాలం నన్ను నడిపించావు కదా’ అని విశ్వనాథ్‌గారు చమత్కరించడంతో అక్కడే ఉన్న ఆయన తనయుడు, కోడలు.. అందరూ హాయిగా నవ్వేశారు.  భర్త పక్కన కూర్చున్నాక  ‘‘నా బిడ్డ (సిరివెన్నెలను ఉద్దేశించి)ను నేనే మెచ్చుకుంటున్నానేమో కానీ ఎంతో లవ్లీగా అనిపిస్తోంది. నాలుగు రోజుల నుంచి   (పద్మశ్రీ వచ్చిన రోజు నుంచి) మా ఆనందం చెప్పలేనిది. మా కన్నబిడ్డకు వచ్చినట్లుగానే అనుకుంటున్నాం’’ అన్నారు జయలక్ష్మి.

సిరివెన్నెల:  ఈ సందర్భంలో ముఖ్యంగా చెప్పాల్సింది ఏంటంటే.. నాన్నగారు తీసిన ప్రతీ సినిమా కూడా వేదమే. వేదానికి కొన్ని వందల అర్థాలు ఉన్నాయి. సింపుల్‌ మీనింగ్‌ ఏంటంటే మనకు ఏది తెలియాలో అది వేదం.

మీ మధ్య వాదించుకోవడాలు ఉండేవా?  
సిరివెన్నెల: ఆయనకు నచ్చకపోవడం ఉండదు. 

విశ్వనాథ్‌: 75 ఏళ్లు కాపురం చేశాం. మా ఆవిడను అడగండి. ఆవిడ ఏం సమాధానం చెబుతుందో. శాస్త్రి, నా మధ్య సఖ్యత కూడా అంతే. నారాయణరెడ్డిగారు ఓ సందర్భంలో మేమిద్దరం ‘జంట కవులం’ అన్నారు.

సిరివెన్నెల: ‘స్వర్ణకమలం’ సినిమాకు నంది వచ్చినప్పుడు నాన్నగారి దగ్గరకు వెళ్లాను. ‘మూడు నందులు వరుసగా అందుకున్నాను. అయినా కానీ సంతృప్తిగా లేను’  అన్నాను. ఎందుకు? అని అడిగారు. మీ సినిమాల్లో ఏ క్రాఫ్ట్‌ వాళ్లకు అవార్డు వచ్చినా అందులో మీ పాత్ర ఉంటుంది. మీకు కాకుండా వేరే వాళ్లకు రాసి, నంది తెచ్చుకుంటే అప్పుడు నందికి అర్హుడిని అన్నాను. ఆ తర్వాత వేరేవాళ్ల సినిమాలకు కూడా చాలా వచ్చాయి. మనం జపనీస్‌ దర్శకుడు అకీరా కురొసావా గురించి చెప్పుకుంటుంటాం. ఆయన్ను తక్కువ చేయడం కాదు కానీ విశ్వనాథ్‌గారు తెలుగుకు పరిమితమైపోవడం వల్ల ఆయన గురించి అకీరా కురొసావా గురించి చెప్పుకున్నట్లు చెప్పుకోవడంలేదు.

విశ్వనాథ్‌: మన తెలుగు వాళ్లకు ఉన్నదే అది.
సిరివెన్నెల:  కేన్వాస్‌ అదే. దాని మీద బూతు బొమ్మ గీసుకోవచ్చు. మామూలు బొమ్మ గీయొచ్చు, ఎక్కాలు రాయొచ్చు. విశ్వనాథ్‌గారు చేసింది చూడటం వల్ల ఆయన్ని పొగడటం అవదు. మీ (ప్రేక్షకులు) జీవితాన్ని మీరు విస్తృతపరచుకోవడం అవుతుంది. అది ఒక ఉనికి. అతిశయోక్తిగా విశ్వనాథ్‌గారిని దేవుడు భూమి మీదకు పంపారు అనడం లేదు. మనకు ఆకలి, డబ్బు సంపాదన  ఇలా చాలా ఉంటాయి. ఇవి కాకుండా మన లోపల ఓ ఆర్తి ఉంటుంది. దాని కోసం ఆయన సినిమాలు చూడండి. మన మీద మనకు గౌరవం పెరుగుతుంది. మనం రోజూ చేస్తున్న ఘనతలు ఏమున్నాయి? తినడం, ఉద్యోగం చేయడం. ఇది తప్ప ఇంకేం ఉంది. ఆయన ‘శంకరాభరణం’ చూస్తే.. అంతకు ముందు మంచి సినిమాలు లేవని కాదు. ఆయన మనకు చాలా ఎక్కువ గౌరవం ఇచ్చారు. ప్రేక్షకులు వాళ్ల అర్హతను ఆయన సినిమాను విజయవంతం చేసి మాత్రమే నిరూపించుకోగలరు. నిరూపించుకున్నారు కూడా. 

‘సిరివెన్నెల’ మీ ఇంటి పేరుగా మారిపోవడం గురించి?
సిరివెన్నెల: ఆ సినిమా వల్ల నాకీ పేరు రాలేదు. ఆ సినిమా టైటిల్‌ కార్డ్స్‌లోనే ‘సిరివెన్నెల’ సీతారామశాస్త్రి అని వేశారు. మన శాస్త్రంలో ఆరు రకాల తండ్రులు ఉంటారు అంటుంటాం. విద్య నేర్పినవాడు, నామకరణం చేసినవాడు, జన్మనిచ్చినవాడు.. ఇలా.  మా నాన్నగారు జన్మనిస్తే, నాకు సినీ నామకరణం చేసి, కవి జన్మని ఇచ్చిన తండ్రి విశ్వనాథ్‌గారు. ఆ పేరు పెట్టేప్పుడు మీ అమ్మానాన్న చక్కగా సీతారామశాస్త్రి అని పెట్టారుగా.. మళ్లీ పేర్లెందుకు? స్క్రీన్‌ కోసమే కావాల్సి వస్తే ‘సిరివెన్నెల’ అని సినిమా పేరే ఉందిగా. దాన్ని ముందు జత చేసుకో అన్నారాయన. సిరివెన్నెలలానే నీ  కెరీర్‌ కూడా ఉంటుంది అన్నారు. వశిష్ట మహర్షి రాముడికి పేరు పెట్టినట్టుగా నాకు పేరు పెట్టారు. 

విశ్వనాథ్‌గారిని ‘నాన్నగారు’ అని ఎప్పటి నుంచి పిలుస్తున్నారు? 
సిరివెన్నెల: నాకు ముందు నుంచి పిలవాలని ఉండేది. కానీ బెరుకుగా కూడా ఉండేది. ఐదారేళ్ల క్రితం నుంచి పిలుస్తున్నాను. 
విశ్వనాథ్‌: శాస్త్రి నన్ను ఏనాడూ పేరు పెట్టి పిలిచింది లేదు. 
సిరివెన్నెల: మా అబ్బాయిని కూడా సాయి (అసలు పేరు యోగేశ్వర శర్మ. సిరివెన్నెల తండ్రి పేరు) అంటాను. నాన్న పేరుతో పిలవలేను. ఈయన్ను కూడా అంతే.

ఈతరంలో మీకు విశ్వనాథ్‌గారిలాంటి దర్శకుడు దొరికారా? 
సిరివెన్నెల: లేరు. ఒకటి విశ్వనాథ్‌గారు కథను చెప్పే విధానం. రెండు.. రచయితని నీ మనసు ఎలా పలుకుతుందో అలా రాయి అనే దర్శకుడు ఆయన. మొట్టమొదటి సినిమాలో మొట్టమొదటి పాట రాస్తున్నప్పుడే నీకు ఏం తోస్తే అది రాయి. నాకు అర్థం కాకపోయినా ఫర్వాలేదు అన్నారు. హిమాలయాలంత మనిషి తన స్థాయిని ఆపాదించుకుని నాకు అర్థం కానిది ఏదీ లేదు అనొచ్చు. నాకు అర్థం కాకపోయినా ఫర్వాలేదు అన్నారు. ‘నాకే అర్థం కాలేదు. జనాలకు ఎలా అర్థం అవుతుంది’ అని కొందరు దర్శకులు అంటారు. జనాలు అని ఎవరైనా సంబోధిస్తే నాకు కోపం వస్తుంది. మనం ఎవరి ముందు కూర్చుని మాట్లాడుకుంటున్నాం అంటే ఒక యుగం ముందర. ఒక శకం ముందర కూర్చొని. ఏనాడూ ఆయన ఆడియన్స్‌ను తక్కువ చేసి మాట్లాడలేదు. మనం కాదా జనం.. జనంలో నుంచి మనం రాలేదా? జనాన్ని తక్కువ చేస్తే మనల్ని మనం తక్కువ చేసుకున్నట్టే అని ఆయన అనుకుంటారు.

మీరు సినిమాల్లోకి వచ్చే నాటికే విశ్వనాథ్‌గారు గొప్ప పేరున్న వ్యక్తి. మరి.. ఆయనతో జర్నీ మొదట్లో భయంగా అనిపించేదా?
విశ్వనాథ్‌: నేను సమాధానం చెబుతా. మా గురువుగారు ఆదుర్తిగారు చాలా గొప్ప విషయాలు చెప్పారు. ‘మొదట్లో వచ్చేవాళ్లకు భయం, భక్తీ ఉంటాయి. మనం చనువు చేసి, జాగ్రత్తగా భయం పోగొడితే... అప్పుడు వాళ్లు భయం లేకుండా ఇలా ఇలా ఉంటే బావుంటుంది అని చెప్పగలుగుతారు. ఒకవేళ మనం భయం పోగొట్టకపోతే ఏమీ చేయకుండా బొమ్మల్లా మనల్ని ఫాలో అయిపోతుంటారు’ అని చెప్పారు. అందుకే నేను భయం పోగొట్టేవాణ్ణి. నిజానికి ఎదుటి వ్యక్తి స్థాయిని బట్టి మన ఫీలింగ్స్‌ ఉంటాయి. నేను అమితాబ్‌ బచ్చన్‌ దగ్గరకు వెళ్తే నిలబడతాను. ఆయన స్టేచర్‌కు నేను గౌరవం ఇస్తాను.  మా ఊళ్లో నేను గొప్పవాణ్ణి అంటే ఏం లాభం? ఈ లక్షణాలు చివరిదాకా ఉండాలి. ఇవే మా సినిమాల్లో పెడతాం. భయం పోయినా గౌరవం పోకూడదు.

సిరివెన్నెల: ఇప్పుడు వేల్యూ సిస్టమ్‌ అనేది లేదు. అవన్నీ పోయాయి. ‘కొత్త దర్శకులను తండ్రీ కొడుకులిద్దరూ స్నేహితులైతే కలసి కూర్చుని తాగాలా? ఆ సన్నివేశం లేకపోతే నష్టమా?’ అని అడుగుతుంటాను.

విశ్వనాథ్‌: అవన్నీ మీకెందుకు? మీ పాట మీరు రాయండి. (నవ్వుతూ).  

సిరివెన్నెల: నన్ను అలా అనే సాహసం ఎవ్వరూ చేయలేదు. ఎందుకంటే నేను ఏ స్కూల్‌ నుంచి వచ్చానో వాళ్లకు తెలుసు (నవ్వులు).

ఎంతటి ప్రతిభావంతులకైనా ప్రశంసలు ఆనందాన్నిస్తాయి. మీ సినిమాలను మెచ్చుకున్నప్పుడు మీకెలా అనిపిస్తుంది?
విశ్వనాథ్‌: మనం చేసినదాన్ని ఒకరు మెచ్చుకుని అందులో ఉన్న మెరుపును చెప్పినప్పుడు ‘అమ్మయ్య.. ఇంత ఇదిగా గుర్తించారు’ అని ఆనందం వస్తుంది. అది వీక్‌నెస్‌ అనండి ఇంకేదైనా అనండి. ఎంత బావుందో సినిమా అని అనిపించుకోబుద్ధి అవుతుంది (కళ్లల్లో ఆనందంతో).

సిరివెన్నెల: ఇక్కడ మమ్మల్ని పొగడక్కర్లేదు. సినిమాలో ఉన్న విషయం అర్థం చేసుకుని ఆనందించడం ముఖ్యం. సినిమా బావుండటం వేరు. ప్రయోజనం వేరు. రెండూ వేరే వేరే విషయాలు. చాలా బావున్నది మనకు దేనికీ పనికి రాకపోవచ్చు. నాన్నగారు తీసిన సినిమాలు చూడటం ఎవరికి వాళ్లు సంస్కారం పెంచుకోవడానికి రుజువు. ఇవాళ పనిగట్టుకుని శాస్త్రి వచ్చి ఆయన్ను పొగడక్కర్లేదు.
 
విశ్వనాథ్‌:
బాక్సాఫీస్‌ ఈజ్‌ నాట్‌ ది క్రైటీరియా. కొన్ని సినిమాలకు ఎందుకని డబ్బు రాలేదో అర్థం కాదు. కొన్నింటికి ‘దాంట్లో ఏమీ లేదు. ఊరికే డబ్బు వచ్చేస్తుంది’ అంటుంటారు.

సిరివెన్నెల: కళా తపస్వి అన్నది బిరుదు కాదు. మేం నాన్నగారిని వదిలి వెళ్లేటప్పుడు రాత్రి పది అయ్యేది. కానీ మరుసటి రోజు కొత్త కథ ఉండేది. అంటే ఆ రాత్రంతా ఏం చేస్తున్నట్టు? పొద్దునే ఇది తీస్తారు అని వెళ్తాం. కానీ అక్కడ వేరేది ఉంటుంది. నాకూ అదే అలవాటైంది అనుకుంటా. రాత్రంతా ఒక వెర్షన్‌ రాసి మరో వెర్షన్‌ రాసి... ఇలా రాత్రిళ్లు రాస్తుంటాను.

విశ్వనాథ్‌: శాస్త్రి రాత్రిపూట రాస్తాడంటే ఆ నిశ్శబ్దమే తనకు సహాయం చేస్తుంది. నాక్కూడా తెల్లవారుజాము నాలుగు గంటలకు కొత్త కొత్త భావాలు వస్తుంటాయి. వాటినే ఉదయం షూటింగ్‌ ప్రారంభించాక ఇలా చేయండి అని చెబుతుంటాను. మరి శాస్త్రి అందరి దగ్గర అలా చేస్తాడో లేక మా దగ్గరే అలా చేస్తాడో తెలియదు. వచ్చేటప్పుడు తెల్ల కాగితాలు తెచ్చుకుంటాడు. రీమ్‌ అంటామే. నాలుగు లైన్స్‌ ఏవో రాస్తాడు. పక్కన పెడతాడు. పడేయడు. మళ్లీ కాసేపు బయటకు వెళ్లిపోతాడు. అలా ఎప్పుడో రాసినవి ఇప్పటికీ తన దగ్గర ఉంటాయి.
సిరివెన్నెల: అవును.. ఇప్పటికీ ‘సిరివెన్నెల’ సినిమాకు రాసిన కాగితాలు ఉన్నాయి.  

చివరి ప్రశ్న... వేటూరిగారు, ఆరుద్రగారు.. ఇలాంటి గొప్ప రచయితలతో పాటలు రాయించుకున్నారు. ఆ తర్వాత సిరివెన్నెలగారితో రాయించుకున్నారు. ఆయనకు రీప్లేస్‌మెంట్‌గా..?
విశ్వనాథ్‌: అవసరం లేదు. ఆయన పైకి ఎదుగుతున్న స్టేజ్‌లో నేను కిందున్నాను. పదేళ్లుగా ఏ సినిమా చేయడం లేదు నేను. ఒకవేళ చేస్తే రాయను అనడు. కాబట్టి ఇప్పుడప్పుడే వెతుక్కోనవసరం లేదు. 
సిరివెన్నెల: నేనే ఆయనతో ఓసారి అన్నాను. మీ సినిమాల్లో నేను రాయకుండా వీలే లేదు. ఇప్పుడు నాన్నగారు సినిమా తీసి, ఏ కారణం చేతనైనా ఆయన సినిమాల్లో పాట రాయకపోతే నేను ఇండస్ట్రీలో ఉండనన్నది నా పంతం.
– డి.జి.భవాని

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు