‘శ్రీదేవికి మద్యం సేవించే అలవాటు లేదు’

26 Feb, 2018 19:07 IST|Sakshi

న్యూఢిల్లీ : ప్రముఖ సినీనటి శ్రీదేవి మృతిపై రాజ్యసభ ఎంపీ అమర్‌ సింగ్‌ అనుమానం వ్యక్తం చేశారు. శ్రీదేవికి మద్యం సేవించే అలవాటు లేదని ఆయన తెలిపారు. అయితే కొన్ని సందర్భాల్లో ఆమె వైన్‌ మాత్రం తీసుకునేవారని అమర్‌ సింగ్‌ పేర్కొన్నారు. అలాంటప్పుడు శ్రీదేవి రక్త నమునాల్లో మద్యం అవశేషాలు ఎలా ఉంటాయని ఆయన ప్రశ్నించారు. ఆమె మృతిపై లోతైన విచారణ చేపట్టాలన్నారు. శ్రీదేవి మృతి ఘటనపై అబుదాబి యువరాజు షేక్‌ మహమ్మద్‌ బిన్ జాయెద్‌ అల్‌ నహ్యాన్తో తాను మాట్లాడినట్లు అమర్‌ సింగ్‌ తెలిపారు. అన్ని ఫార్మాలిటీలు పూర్తి చేసి, శ్రీదేవి మృతదేహాన్ని భారత్‌కు పంపిస్తామని హామీ ఇచ్చారన్నారు. ఆమె భౌతికకాయం సోమవారం రాత్రికి ముంబై చేరే అవకాశం ఉన్నట్లు అమర్‌ సింగ్‌ పేర్కొన్నారు.

కాగా శ్రీదేవీ మృతిపై వస్తున్న అనుమానాలను నివృత్తి చేస్తూ యూఏఈ ఆరోగ్యశాఖ సోమవారం ఫోరెన్సిక్‌ నివేదికను విడుదల చేసింది. ఆ నివేదికలో ప్రమాదవశాత్తు ఆమె కాలు జారి నీటి టబ్‌లో పడిపోవడం వల్లే మృతి చెందినట్టు పేర్కొంది. అయితే శ్రీదేవి శరీరంలో ఆల్కహాల్‌ను గుర్తించినట్టు యూఏఈ రిపోర్టు పేర్కొది. అయితే ఆమెకు గుండెపోటు వచ్చిందనే విషయాన్ని ఫోరెన్సిక్‌ నివేదికలో ప్రస్తావించలేదు. మరోవైపు శ్రీదేవి భర్త బోనీకపూర్‌ను దుబాయ్‌ పోలీసులు సుమారు మూడున్నర గంటల పాటు ప్రశ్నించారు. ఆయన స్టేట్‌మెంట్‌ను రికార్డు చేశారు. కాగా ఈ కేసు విచారణను పోలీసులు...దుబాయ్‌ పబ్లిక్‌ ప్రాసిక్యూషన్‌కు బదిలీ చేశారు.

మరిన్ని వార్తలు