ముగిసిన శ్రీదేవి అంత్యక్రియలు

28 Feb, 2018 17:33 IST|Sakshi

ముంబై : ప్రముఖ సినీనటి శ్రీదేవి అంత్యక్రియలు ముగిశాయి. దుబాయ్‌లో హఠాన్మరణం చెందిన శ్రీదేవి అంతిమ సంస్కారాలు ముంబై విల్లేపార్లేలోని సేవా సమాజ్‌ శ్మశాన వాటికలో మహారాష్ట్ర ప్రభుత్వ అధికార లాంఛనాలతో అంత్యక్రియలు జరిగాయి. దీంతో దివి నుంచి భువికి దిగి వచ్చి, దశాబ్దాలపాటు వెండితెరను రాణిలా ఏలిన అతిలోక సుందరి మళ్లీ దివికి వెళ్లిపోయింది. మరపురాని పాత్రలతో అర్థ శతాబ్దం పాటు అశేష అభిమానగణాన్ని అలరించి, కోట్లాది హృదయాల్లో శాశ్వత ముద్ర వేసుకున్న ఆమె... మానవా ఇక సెలవ్ అంటూ స్వర్గానికి సాగిపోయింది.

బాలీవుడ్‌, టాలీవుడ్‌, కోలీవుడ్ ప్రముఖులు అంతిమ యాత్రలో పాల్గొన్నారు. అశ్రునయనాల మధ్య ఆమెకు తుది వీడ్కోలు పలికారు. మధ్యాహ్నం 2 గంటలకు ప్రారంభమైన శ్రీదేవి అంతిమ యాత్ర ఏడు కిలోమీటర్ల మేర సాగింది.  మరోవైపు తమ అభిమాన నటిని కడసారి చూపు కోసం అభిమానులు శ్మశానవాటిక వద్దకు పోటెత్తారు. అంతకు ముందు సెలబ్రేషన్స్ క్లబ్ నుంచి విల్లేపార్లే వరకు  సాగిన శ్రీదేవి అంతిమయాత్రలో భారీ సంఖ్యలో అభిమానులు పాల్గొన్నారు. అభిమాన నటిని చివరిసారి చూసుకునేందుకు కడసారి వీడ్కోలు పలికి, నివాళి అర్పించేందుకు దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చారు. అశేష జనవాహినితో ముంబై పరిసరాలు కిక్కిరిసిపోయాయి.

అంతిమ సంస్కారం సందర్భంగా శ్రీదేవిని... ఆమెకు ఎంతో ఇష్టమైన ఎరుపు రంగు చీర కంచిపట్టు చీరతో అలంకరించారు. ఎప్పుడూ అందంగా కనిపించడం ఆమెకి అలవాటు. చివరిక్షణాల్లోనూ శ్రీదేవిని అలాగే తయారు చేశారు. అభిమానుల మనసుల్లో నుంచి ఆ మనోహర రూపం చెదిరిపోకుండా ఉండేలా ఆమె కుటుంబసభ్యులు చర్యలు తీసుకున్నారు. శ్రీదేవి భౌతికకాయాన్ని ఉంచిన వాహనాన్ని మల్లెపూలు, లిల్లీపూలతో అలంకరించారు. మల్లెపూలు అంటే శ్రీదేవి ఎంతో ఇష్టమట. అందుకే ఆమె పార్దీవదేహాన్ని తరలించే వాహనాన్ని ఆ పూలతోనే తీర్చిదిద్దారు. వాహనంలో శ్రీదేవి భౌతికకాయంతో పాటు ఆమె కుటుంబీకులు ఉన్నారు.

తరలి వచ్చిన తారాలోకం
అనంతలోకాలకు వెళ్లిపోయిన ప‍్రముఖ సినీనటి శ్రీదేవి చివరిచూపు కోసం స్నేహితులు, సన్నిహితులు, అభిమానులు పోటెత్తారు.హేమామాలిని, ఐశ్వర్యారాయ్, జయాబచ్చన్, సుస్మితాసేన్, మాధురి దీక్షిత్, అక్షయ్‌ కుమార్, టబు, అజయ్ దేవగన్, కాజోల్, అర్జున్ కపూర్, సంజయ్‌ లీలా బన్సాలి, సారా అలీఖాన్, జాక్వలైన్ ఫెర్నాండెజ్, రీతేష్ దేశ్‌ముఖ్, అర్భాజ్ ఖాన్, ఇషా డియోల్, కరణ్‌ జోహార్, ఫరా ఖాన్, సుభాయ్ ఘాయ్ తదితరులు భౌతికకాయం వద్ద అంజలి ఘటించారు.

అలాగే రజనీకాంత్, కమల్‌ హాసన్, చిరంజీవి, నాగార్జున, వెంకటేష్,అర్జున్ సహా పలువురు దక్షిణాది నటులు శ్రీదేవి భౌతికకాయాన్ని వద్ద అశ్రునివాళి అర్పించారు.  హిందీ, తెలుగు, తమిళ, మలయాళ,కన్నడ సినిమా రంగాలకు చెందిన ప్రముఖ నటీనటులంతా శ్రీదేవి ఇంటికి తరలివచ్చారు. తమతో కలసి నటించి, మెప్పించిన సహనటిని కడసారి సందర్శించి కన్నీటి నివాళి అర్పించారు. సినీ రంగంతో పాటు రాజకీయ, పారిశ్రామికరంగాలకు చెందిన ప్రముఖులు శ్రీదేవి ఇంటికి వచ్చి ఆమెకు అశ్రు నివాళి అర్పించారు.

మరోవైపు  విల్లేపార్లేలోని సేవా సమాజ్‌ శ్మశాన వాటికలో జరిగిన అంత్యక్రియల కార్యక్రమంలో సినీ నటులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.నటి విద్యాబాలన్‌, ఆమె భర్త సిద్ధార్థ్‌ రాయ్‌ కపూర్‌, ఫర్హాన్‌ అక్తర్‌, దియా మిర్జా, ఆమె భర్త సాహిల్‌, అనిల్‌ అంబానీ, అనుపమ్‌ ఖేర్‌, అర్జున్‌ రాంపాల్‌ తదితరులు హాజరయ్యారు.

మరిన్ని వార్తలు