ప్రకాష్రాజ్కే సిగ్గులేదు:శ్రీను వైట్ల

6 Oct, 2014 00:18 IST|Sakshi
ప్రకాష్ రాజ్ - శ్రీను వైట్ల

శ్రీను వైట్ల, ప్రకాశ్‌రాజ్... మధ్య నెలకొన్న వివాదం చినికి చినికి గాలివాన అయ్యేట్లు కనిపిస్తోంది. శనివారం హైదరాబాద్‌లో ‘గోవిందుడు అందరివాడేలే’ సినిమా ప్రమోషన్‌లో భాగం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో శ్రీను వైట్లపై ఓ స్థాయిలో ధ్వజమెత్తారు ప్రకాశ్‌రాజ్. ఆదివారం హైదరాబాద్‌లో విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి అదే స్థాయిలో కౌంటర్ ఇచ్చేశారు శ్రీను వైట్ల.  ‘‘ప్రకాశ్‌రాజ్ నిన్న ప్రెస్‌మీట్‌లో నాకు అహంకారం అన్నారు. ‘ఆగడు’ నుంచి ఆయన్ను తప్పించడానికి కారణం నా అహంకారం కాదు. ఆత్మాభిమానం. ఒక దర్శకునిగా నా విభాగంలోని సహాయ దర్శకుడిపై చెప్పుకోడానికి వీల్లేని మాటలతో దూషిస్తే... దాన్ని భరించలేక ఆ సినిమా నుంచి ఆయన్ను తీసేశాను. నేనా పని చేసినప్పుడు నా యూనిట్ మొత్తం కరతాళధ్వనులతో అభినందించింది. అది తప్పయితే... అందరూ అలా స్పందించరు కదా’’ అన్నారు. ఇంకా శ్రీను వైట్ల చెబుతూ-‘‘ప్రకాశ్‌రాజ్ వ్యాఖ్యలపై అప్పుడే దర్శకుల సంఘంలో ఫిర్యాదు చేశాం.
 
 ఒక ఫిర్యాదు అసోసియేషన్‌లో నమోదై ఉన్నప్పుడు నిబంధనలకు విరుద్ధంగా విలేకరుల సమావేశాలు పెట్టకూడదు. కానీ... ప్రకాశ్‌రాజ్ పెట్టారు. తెలుగు నేర్చుకొని మరీ నాపై ఓ కవిత రాసి, దాన్ని అందరి సమక్షంలో నాకు అంకితమిచ్చారు. నాకు డెడికేట్ చేసిన ఆ కవితపై నాకు అధికారం ఉంటుంది. అందుకే... దాన్ని ‘ఆగడు’లో వాడుకున్నా’’ అన్నారు. ‘‘సినిమా హాళ్లల్లో ప్రదర్శింపబడుతున్న సినిమాపై సినిమా పరిశ్రమకు చెందినవాడెవడూ ఫ్లాప్ అని కామెంట్ చేయడు. అలా మీడియా ఎదురుగా ఉండి మాట్లాడేవాడు అసలు సినిమావాడే కాదు. ఒక సినిమా వ్యక్తివి అయ్యుండి, సాటి వారి సినిమాను ఫ్లాప్ అని ప్రచారం చేస్తున్న నిన్ను ‘సిగ్గులేదా’ అనాలా? లేక అంతకంటే పెద్దమాట ఇంకేదైనా అనాలా?’’ అంటూ ఘాటుగా స్పందించారు శ్రీను వైట్ల. ‘‘పవన్‌కల్యాణ్, ఎన్టీఆర్‌లపై నేను సైటైర్లు వేశానని అన్నాడు. పవన్‌కల్యాణ్ అంటే నాకెంతో అభిమానం.
 
 ఇక ఎన్టీఆర్‌తో ఇప్పటికే నేను కలిసి పనిచేశాను. వారిద్దరిపై సెటైర్లు వేయాల్సిన అవసరం నాకేంటి?’’ అని ప్రశ్నించారు. ఒక దర్శకునిగా సినిమా ఎలా తీయాలో ప్రకాశ్‌రాజ్ దగ్గర నేర్చుకునే స్థితిలో తాను లేననీ, ఈ వివాదం తర్వాత విడుదలైన ప్రకాశ్‌రాజ్ ‘ఉలవచారు బిర్యాని’ సినిమా ఫలితం ఏంటో ఇటు పరిశ్రమకూ, అటు ప్రేక్షకులకూ తెలుసనీ శ్రీను వైట్ల ఎద్దేవా చేశారు. సినిమాలను ప్రేమతో తీయాలి కానీ, కక్షతో కాదని ‘ఆగడు’పై సెటైరు విసిరిన ప్రకాశ్‌రాజ్... ఆయన దర్శకత్వంలో తీసిన సినిమాలను ప్రేమతో తీశాడా, కక్షతో తీశాడా? మరి వాటి ఫలితాలు ఎందుకలా వచ్చాయని ప్రశ్నించారు. అహంకారం తగ్గించుకుంటే మంచిదని ప్రకాశ్‌రాజ్ హితవు చెప్పడం హాస్యాస్పదంగా ఉందని, అతనిపై ఉన్న ఎలిగేషన్స్ ఏ నటునిపైనా ఉండవనీ, ఎన్నిసార్లు అతనిపై నిషేదాజ్ఞలు జారీ అయ్యాయో అందరికీ తెలుసనీ శ్రీను గుర్తుచేశారు. తాను అహంకారంతో పైకొచ్చినవాణ్ణి కాననీ, హార్డ్‌వర్క్‌తో పైకొచ్చినవాణ్ణని ఆయన అన్నారు.
 
  విద్వేషాలు ఆపితే మంచిది - దర్శకుల సంఘం అధ్యక్షుడు వీరశంకర్
 శనివారం విలేకరుల సమావేశంలో ‘నటునిగా నాపై నిషేధాన్ని విధింపజేయడానికి కొందరు డ్రామాలు ప్లే చేశారు’ అని ప్రకాశ్‌రాజ్ వ్యాఖ్యానించడాన్ని దర్శకుల సంఘం అధ్యక్షుడు వీరశంకర్ తీవ్రంగా ఖండించారు. శ్రీను వైట్ల ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశానికి ఆయన కూడా హాజరై ప్రకాశ్‌రాజ్ వ్యాఖ్యలపై వివరణ ఇచ్చారు. ‘‘డ్రామాలు ప్లే చేశారు... అని ప్రకాశ్‌రాజ్ బహువచనంతో మాట్లాడటం దర్శకుల సంఘం మొత్తానికి అభ్యంతరకరంగా ఉంది. ఆయన్ను నిషేధించడానికి నాటకాలు ఆడాల్సిన అవసరం మాకు లేదు.
 
 ఇష్టం లేకపోతే కలిసి పనిచేయం అంతే. ఇది ఆత్మాభిమానానికీ, ఆత్మగౌరవానికీ సంబంధించిన ఇష్యూ. దర్శకుల సంఘం సభ్యుణ్ణి అభ్యంతరకర పదజాలంతో మాట్లాడటం అనేది తప్పు. దానిపై ఫిర్యాదు నమోదై ఉన్నప్పుడు విలేకరుల సమావేశం ఆయన పెట్టకూడదు. శ్రీను వైట్ల కూడా అప్పుడు ప్రెస్‌మీట్ పెడదామంటే మేమే వద్దన్నాం. కానీ.. ఇప్పుడు ‘గోవిందుడు అందరివాడేలే’ సినిమా ప్రమోషన్ నిమిత్తం ఏర్పాటు చేసిన ప్రెస్‌మీట్‌ని శ్రీను వైట్లను దూషించడానికి ఉపయోగించుకున్నారాయన. దీని కారణంగా.. ఆ సినిమాకు రావాల్సిన ప్రచారం రాలేదు. మీడియా మొత్తం వీరిద్దరి గొడవనే హైలైట్ చేసి రాసింది. అయినా.. ఒక నటుణ్ణి నిషేధించే రైట్స్ మాకుండవ్. ఇకనైనా ఈ విషయంపై ఇద్దరూ సంయమనం పాటిస్తారని ఆశిస్తున్నాను’ అన్నారు. కాదంబరి కిరణ్‌కుమార్, మద్దినేని రమేశ్ కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు.
 
 కొందరు మారరు: ప్రకాశ్‌రాజ్
 ‘‘తాటిచెట్టు కింద దొరికిపోయినవాణ్ణి ఏం చేస్తున్నావని అడిగితే పాలు తాగుతున్నా అని చెప్పాడంట. ఆల్ ది బెస్ట్ చీర్స్’’... శ్రీను వైట్ల సమావేశం తర్వాత ప్రకాశ్‌రాజ్ ట్విట్టర్‌లో కనిపించిన మాటలివి. మరి.. ప్రకాశ్‌రాజ్ ఎవరిని ఉద్దేశించి ఈ విధంగా అన్నారో...?