28 నుంచి బుల్లితెరపై..

10 Nov, 2018 11:24 IST|Sakshi

సినిమా: ఈ నెల 28 నుంచి శ్రుతిహాసన్‌ బుల్లితెర ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని కలిగించడానికి రెడీ అవుతోంది. ఆమె తండ్రి కమలహాసన్‌ బిగ్‌బాస్‌ రియాలిటీ గేమ్‌ షో అంటూ బుల్లితెర ప్రేక్షకులను టీవీల ముందు కట్టిపడేస్తే, తాజాగా ఆయన తనయ శ్రుతిహాసన్‌ హలో సాగో అంటూ బుల్లితెర ప్రేక్షకల ముందుకు రాబోతోంది. ప్రపంచ వ్యాప్తంగా ఓటీటీ వీడియో సేవలందిస్తున్న వైవ్‌ సంస్థ, మోషన్‌ కంటెంట్‌ గ్రూప్‌తో కలిసి వైవ్‌ హలో సాగో పేరుతో చర్చావేదిక కార్యక్రమాన్ని రూపొందిస్తోంది. ఈ కార్యక్రమానికి సంచలన నటి శ్రుతిహాసన్‌ వ్యాఖ్యాతగా వ్వవహరిస్తున్నారు. ఇలాంటి కార్యక్రమం తెలుగులో నంబర్‌ఒన్‌ యారీ పేరుతో ప్రసారం అవుతోంది. దానికి నటుడు రానా వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్నారు.

ఈ కార్యక్రమంలో ప్రముఖ నటీనటుల వ్యక్తిగత విషయాలను వెల్లడించి ప్రేక్షకుల ముందు తమ మరో కోణాన్ని ఆవిష్కరిస్తారని నిర్వాహకులు తెలిపారు. తారలు తమ నిజ జీవితాల్లోని రహస్యాలను ప్రేక్షకులతో పంచుకుంటారని చెప్పారు. ఈ కార్యక్రమానికి వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న నటి శ్రుతిహాసన్‌ ఈ సందర్భంగా స్పందిస్తూ సాధారణంగా ఎంటర్‌టెయిన్‌మెంట్‌ రంగానికి చెందిన వారు వారి అంతరంగ విషయాల గురించి బయట ప్రపంచానికి చెప్పుకోవడానికి ఇష్టపడరన్నారు. అయితే ఈ వైవ్‌ హలో సాగో కార్యక్రమం ద్వారా ప్రేక్షకులు తారల మరో ముఖాన్ని చూడగలరని చెప్పారు. తారలు నిజాయితీగా చెప్పే విషయాలు, వారి అందమైన జీవిత పయనాన్ని తెలుసుకునే అవకాశం ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో తానూ ఒక భాగం కావడం సంతోషంగా ఉందని అన్నారు. కాగా 13 ఎపిసోడ్స్‌తో కూడిన ఈ కార్యక్రమం ఈ నెల 28 నుంచి ఆదివారం రాత్రి 8.30 గంటలకు వైవ్‌ యాప్‌తో పాటు సన్‌ టీవీలోనూ ఏకకాలంలో ప్రసారం అవుతుందని నిర్వాహకులు వెల్లడించారు.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు