ఏడుసార్లు రిజెక్ట్‌.. విర‌క్తితో ఆత్మ‌హ‌త్యాయ‌త్నం.. ఇప్పుడు ల‌క్ష‌ కోట్ల కంపెనీకి బాస్

4 Nov, 2023 20:30 IST|Sakshi

ఎడెల్వీస్ మ్యూచువల్ ఫండ్ మేనేజింగ్ డైరెక్టర్ అండ్ సీఈఓ 'రాధికా గుప్తా' షార్క్ ట్యాంక్ ఇండియా 3 (Shark Tank India 3) ప్యానెల్‌లో నమితా థాపర్, వినీతా సింగ్, పీయూష్ బన్సాల్, అమన్ గుప్తా, అనుపమ్ మిట్టల్‌లతో కలిసి కనిపించనున్నారు. షార్క్ ట్యాంక్ ఇండియా 3 లో కనిపిస్తున్న రాధికా గుప్తా ఎవరు? ఆమె బ్రాగ్రౌండ్ ఏంటి? ప్రముఖ వ్యాపారవేత్తగా ఎలా ఎదిగిందనే మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.

భారతదేశంలో అతి తక్కువ వయసులోనే ఎడెల్వీస్ మ్యూచువల్ ఫండ్‌కు చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్‌గా ఎదిగిన రాధికా.. ఒకానొక సమయంలో ఉద్యోగం రాక చనిపోదామని ఆత్మహత్య చేసుకోవడానికి ప్రయత్నించింది.స్నేహితురాలు కాపాడటంతో బ్రతికి ఈ రోజు ఎంతోమందికి ఆదర్శంగా నిలిచింది.

పాకిస్తాన్‌లో జన్మించిన రాధికా ఆమె కుటుంబంతో కలిసి ఖండాంతరాలు దాటింది. పుట్టుకతోనే సమస్యలున్న ఆమె మెడ విరిగిపోవడంతో తలా కొంత వంగిపోయింది. చదువుకునే రోజుల్లో చాలామంది ఎగతాళి చేసేవారు. ఆమె యూనివర్సిటీ ఆఫ్ పెన్సిల్వేనియా స్కూల్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ అప్లైడ్ సైన్స్ నుంచి కంప్యూటర్ సైన్స్‌లో బ్యాచిలర్ ఆఫ్ సైన్స్, 2005లో పెన్సిల్వేనియా యూనివర్సిటీ - ది వార్టన్ స్కూల్ నుంచి ఎక‌నామిక్స్‌లో బ్యాచిలర్ ఆఫ్ సైన్స్ డిగ్రీని పూర్తి చేసింది.

చదువు పూర్తయిన తరువాత ఉద్యోగం కోసం ప్రయత్నించే క్రమంలో ఏడు ఉద్యోగాలకు అప్లై చేసింది, కానీ ఒక్క ఉద్యోగానికి ఎంపిక కాలేదు. ఉద్యోగం రాకపోవడంతో నిరాశ చెంది ఆత్మహత్యా ప్రయత్నం చేసింది, స్నేహితురాలు కాపాడింది. ఆ తరువాత చాలా రోజులు నాలుగు చక్రాల కుర్చీకే పరిమితమైంది. 25 సంవత్సరాల వయసులో భారతదేశానికి వచ్చిన రాధికా తన భర్త, ఫ్రెండ్‌తో సొంతంగా అసెట్ మేనేజ్‌మెంట్ సంస్థను ఏర్పాటు చేసి.. కొన్నేళ్ల తర్వాత ఆ కంపెనీని ఎడెల్వీస్ మ్యూచువల్ ఫండ్ కొనుగోలు చేసింది.

ఇదీ చదవండి: పండుగ సీజన్‌లో కొత్త స్మార్ట్‌ఫోన్‌ కొనాలనుకుంటే.. ఇవి బెస్ట్ ఆప్షన్స్!

ఎడెల్వీస్ మ్యూచువల్ ఫండ్‌కి కొత్త సీఈవో ఎంపిక సమయంలో కొంత భయపడినప్పటికీ భర్త ప్రోత్సాహంతో 33 ఏళ్లలోనే దేశంలోనే అతి పిన్న వయస్కులైన సీఈవోలలో ఒకరిగా బాధ్యతలు చేపట్టింది. ఒకప్పుడు లోపాన్ని చూసి ఎగతాళి చేసిన వారు ఎందరో ఆదర్శంగా తీసుకోవడం మొదలుపెట్టారు.

మరిన్ని వార్తలు