మెగాస్టార్ కెరీర్ లోనే తొలిసారి..!

18 Nov, 2017 11:39 IST|Sakshi

ఖైదీ నంబర్ 150 సినిమాతో గ్రాండ్ గా రీ ఎంట్రీ ఇచ్చిన మెగాస్టార్ చిరంజీవి సూపర్ హిట్ అభిమానులను అలరించాడు. ఇప్పుడు అదే జోరులో మరో భారీ చిత్రానికి రెడీ అవుతున్నాడు. యువ దర్శకుడు సురేందర్ రెడ్డి దర్శకత్వంలో చారిత్రాత్మక చిత్రంగా సై రా నరసింహా రెడ్డి సినిమాను తెరకెక్కించనున్నారు. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నిర్మిస్తున్న ఈ సినిమా డిసెంబర్ తొలి వారంలో సెట్స్ మీదకు వెళ్లనుంది.

అయితే ఈ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్న మెగా టీం, ప్రతీ విషయాన్ని పర్ఫెక్ట్ ప్లాన్ చేస్తోంది. అందుకే ఈ భారీ చిత్రం కోసం చిరు తన కెరీర్ లో ఇంతవరకు చేయని ఒక పని చేశారట. 30 ఏళ్ల సుధీర్ఘ కెరీర్ లో చిరు ఎప్పుడూ తన సినిమా కోసం టెస్ట్ షూట్ చేయలేదట. కానీ సై రా నరసింహారెడ్డి లో తన లుక్ ఎలా ఉందో టెస్ట్ చేసుకునేందుకు కొన్ని సీన్లను షూట్ చేసి టెస్ట్ చేశారట. ఈ షూట్ తరువాత తన లుక్ తో పాటు సురేందర్ రెడ్డి విషయంలో కూడా చిరు చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నాడన్న ప్రచారం జరుగుతోంది.

భారీ బడ్జెట్ తో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో నయనతార హీరోయిన్ గా నటిస్తుండగా బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్, టాలీవుడ్ సీనియర్ నటుడు జగపతిబాబు, కన్నడ నటుడు సుధీప్, తమిళ స్టార్ విజయ్ సేతుపతిలు ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఆస్కార్ అవార్డు గ్రహీత ఏఆర్ రెహమాన్ సంగీతమందిస్తుండగా రత్నవేలు సినిమాటోగ్రఫి అందిస్తున్నారు.

మరిన్ని వార్తలు