సైరాలాంటి సినిమాలు ఇంకా రావాలి

11 Oct, 2019 01:22 IST|Sakshi

– టి. సుబ్బరామిరెడ్డి

‘‘సైరా నరసింహారెడ్డి’లాంటి కథను ఎంచుకోవడమే పెద్ద సాహసం. ఇలాంటి సినిమాలు ఇంకా ఎన్నో రావాలి’’ అన్నారు ‘కళాబంధు’, నిర్మాత టి. సుబ్బిరామిరెడ్డి. చిరంజీవి హీరోగా సురేందర్‌రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘సైరా నరసింహారెడ్డి’. రామ్‌ చరణ్‌ నిర్మించిన ఈ సినిమా ఈ నెల 2న విడుదలైంది. చిత్రబృందాన్ని టి. సుబ్బిరామి రెడ్డి సన్మానించి, మాట్లాడుతూ–‘‘దాదాపు ఇరవై ఏళ్ల క్రితం చిరంజీవితో నేను ‘స్టేట్‌రౌడీ’ సినిమా నిర్మించాను.ఈ సినిమాను హిందీలో డబ్‌ చేస్తే సూపర్‌హిట్‌ సాధించింది. చరణ్‌లాంటి కుర్రాడు ఇంత పెద్ద సినిమా నిర్మించాడంటే ఆశ్చర్యంగా ఉంది’’ అన్నారు.

చిరంజీవి మాట్లాడుతూ– ‘‘సైరా’ సినిమా విజయం సాధిస్తుందని ధీమాగా చెప్పేవారు సుబ్బిరామిరెడ్డి. ఆయన కళాహృదయానికి చేతులెత్తి నమస్కరిస్తున్నా’’ అన్నారు. ‘‘సుబ్బిరామిరెడ్డిగారి ఫంక్షన్‌ లేకపోతే ఆ ఏడాది మాకు ఏదో వెలితిగా ఉంటుంది’’ అన్నారు రామ్‌చరణ్‌. ‘‘ఎక్కడ మంచి సినిమా ఉన్నా ఆ యూనిట్‌ని గౌరవించడం సుబ్బిరామిరెడ్డిగారి గొప్పతనం’’ అన్నారు నిర్మాత అల్లు అరవింద్‌.

‘‘తెలుగు చలన చిత్రపరిశ్రమకు అంతర్జాతీయంగా పేరు తెచ్చిన గొప్ప సినిమా ‘సైరా’’ అన్నారు నటుడు మురళీమోహన్‌. ‘‘తెలుగువారందరూ గర్వపడేలా చేసిన చిరంజీవిగారు నిజంగా గ్రేట్‌’’ అన్నారు నటుడు రాజశేఖర్‌. ‘‘చిరంజీవిగారి కెరీర్‌లో ఇదొక మైలురాయి సినిమా’’ అన్నారు నిర్మాత ‘దిల్‌’ రాజు. సురేందర్‌రెడ్డి, నటి తమన్నా, కెమెరామన్‌ రత్నవేలు, రచయితలు పరుచూరి వెంకటేశ్వరరావు, సాయి మాధవ్‌ బుర్రా మాట్లాడారు. ఈ కార్యక్రమంలో నటులు కృష్ణంరాజు, వెంకటేష్, దర్శకులు కోదండరామిరెడ్డి, క్రిష్, సుకుమార్, మెహర్‌ రమేష్, నిర్మాతలు అశ్వనీదత్, డి.సురేష్‌బాబు, బోనీ కపూర్, కేఎస్‌ రామారావులతో పాటు పలువురు ప్రముఖులు పాల్గొన్నారు.

(ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి)

మరిన్ని వార్తలు