ప్రశ్నను చంపేవాడే దేశద్రోహి

11 Oct, 2019 01:17 IST|Sakshi

విశ్లేషణ

హత్యకన్నా ప్రజాస్వామ్యాన్ని చంపడం. రేప్‌ కన్నా ప్రజలను భజనపరులుగా మార్చడం, లించింగ్‌ అనే మూకుమ్మడిహత్యలకన్నా ప్రశ్నించే తత్వాన్ని హత్య చేయడం తీవ్రమైన నేరాలు. పరస్పర ద్వేషాలను రగిలించే విధానాలు అనుసరిస్తూ లించింగ్‌ సరైనదే అని పరోక్షంగా నేర్పే రాజకీయులు, రాజకీయాలే అసలైన నేరగాళ్లు. రాజకీయ పార్టీలను ప్రశ్నించడం ప్రజాస్వామిక బాధ్యత. కాళోజీ అన్నట్టు అప్పుడే అతను పౌరుడవుతాడు లేకపోతే పోరడు. కానీ అదే అడిగితే? అడిగిన వాడిపై దాడి చేయడం, వేటాడడం, దొంగకేసులు పెట్టడం, పాతకేసులు తవ్వడం, లేదా చెత్తకేసుల్లో ఇరికించడం దారుణాలు. కనిపిం చని హంతకులు చేసే అదృశ్య హత్యలు ఇవి. న్యాయంగా కేసులు నిర్ధారించిన జడ్జీలను కూడా వేధించడం, విభేదించిన వాడిని బాధించడం, నేరవిచారణ అధికారులమీదే నేరాలు బనాయించడం, కిందిస్థాయి అవినీతి పరులను కలుపుకుని తిరుగుబాట్లు చేయించి, వ్యవస్థలను ధ్వంసంచేయడం, మూకుమ్మడి అత్యాచారాలే.

కాకతీయ యూనివర్సిటీలో ప్రజాకవి పద్మభూషణ్‌ కాళోజీ నారాయణరావు ఎండోమెంట్‌ ప్రసంగం చేయాలని పిలిచారు. కాళోజీ వ్యక్తిత్వానికి సరిపోయే చర్చనీయాంశం ఏదంటే ‘ప్రజాస్వామ్యం, ప్రశ్నించే తత్వం’ కాక మరేది.  ‘ప్రజలను చంపే అధికారం ఎవరిచ్చార్రా వెంగళ్రావ్‌’ అంటూ నినదించిన గొంతు ఆయనది. అదీ ఎక్కడ.. వెంగళరావు సీఎం హోదాలో సత్తుపల్లిలో అసెంబ్లీ స్థానానికి పోటీ చేస్తున్న చోట. ముఖ్యమంత్రిగా కొనసాగడం కోసం వెంగళ్రావ్‌ పోటీ చేస్తే, కాళోజీ కేవలం ప్రశ్నించడం కోసం పోటీచేసినాడు. గెలిచింది సీఎంయే కానీ ప్రజాప్రతినిధి కావలసిన వ్యక్తి కాదు. ఓడింది ప్రజాస్వామ్యమేగాని కాళోజీ కాదు. బూటకపు ఎన్‌కౌంటర్లు జరిపించిన తొలి ఎమ ర్జెన్సీ సీఎం అని గొంతెత్తి చెప్పడమే విజయం. తిడితే తిట్టనీ, అడిగితే అడగనీ అని జలగం వెంగళరావు అడిగేవాడిని అడగనిచ్చాడు. జవాబు ఇవ్వలేకపోయినా. పోటీచేస్తే చేయనీ, అని పోటీ చేయనిచ్చాడు. రాజును రోజూ తిడుతున్నా రాజద్రోహం కేసు పెట్టించలేదు. జలగం ఎంత గొప్పవాడు? కాళోజీ ఇప్పుడు బతికి ఉంటే, అప్పుడెప్పుడో సత్తుపల్లిలో ప్రశ్న వేసినందుకు 2019లో రాజద్రోహం కేసు కింద అరెస్టయి పుణే ఎరవాడ జైల్లో వరవరరావుతోపాటు ఉండేవాడేమో?. 

కాళోజీ వంటి సెలబ్రిటీ వ్యక్తులు 49 మంది ఈమధ్య చేసిన నేరం ఏమంటే ప్రశ్నించడం. గుంపు హత్యలు ఈ దేశ పరువును ప్రతిష్ఠను ధ్వంసం చేస్తున్నాయని వారు విమర్శించారు. లించింగ్‌లు జరగకుండా చూడలేరా అని అడిగితే దేశ ద్రోహం ఏ విధంగా అవుతుందో చెప్పగలరా ఎవరైనా? గతవారం ముజఫ్ఫర్‌ పూర్‌ చీఫ్‌ జుడిషియల్‌ మేజిస్ట్రేట్‌ సూర్యకాంత్‌ తివారీ గారికి 49 మంది కళాకారులు  మేధావులు ప్రధానికి రాసిన ఈ లేఖలో దేశద్రోహపు రంగులు, కాంతులు, పొగలు, పగలు కనిపించడం ఆశ్చర్యకరం. దేశ ద్రోహం కేసు రిజిస్టర్‌ చేయాలని ఆదేశించిన ఆ న్యాయాధికారిగారి దృక్పథం ఇదా అని దేశం మ్రాన్పడిపోయింది. మరో 185 మంది సమాజశ్రేయోభిలాషులు అక్టోబర్‌ 8న ఆ ఉత్తరాన్ని సమర్థిస్తూ మరోలేఖ వ్రాసారు. వారిమీద కూడా దేశద్రోహం కేసు పెడతారా?

అయితే ఈ అవివేకపు కారు చీకటిలోనూ కొంత వెలుగు కనిపించింది. బిహార్‌ స్పెషల్‌ సూపరింటెండెంట్‌ ఆఫ్‌ పోలీస్‌ మనోజ్‌ కుమార్‌ దేశద్రోహపు ఆరోపణ చేసే ఈ ఫిర్యాదును బుట్టదాఖలుచేయాల్సిందే అని నిర్ణయించడంలో వివేకం విజ్ఞత ఇంకా బతికున్నాయనే ఆశాభావం కన్నుతెరిచింది. న్యాయాధికారి చూడలేకుండాపోయిన నిజాలు పోలీసు అధికారికి సులువుగా కనిపించాయి. ఇది దురుద్దేశపూరితంగా చేసిన తప్పుడు ఫిర్యాదు, దేశద్రోహం ఆరోపణ పైన విచారించడానికి అణుమాత్రం ఆధారంకూడా లేదు అని మనోజ్‌ కుమార్‌ వివరించారు. ఈ ఫిర్యాదు చేసిన ఓఝా అనే వ్యక్తి పిటిషన్‌ పైన జడ్జిగారు జారీ చేసిన ఆదేశం మేరకు కేసు రిజిస్టర్‌ చేయవలసి వచ్చిందని మరో ఉన్నతాధికారి చెప్పాడు. ‘‘ఒరేయ్‌ ప్రశ్నించేవానికి, ప్రశ్నకు కూడా ద్రోహం చేస్తావ్‌ రా ఎన్ని గుండెలు నీకు? అయితే నువ్వేరా దేశద్రోహివి, ఇది తెలిసినోడేరా అసలైన దేశభక్తుడు’’ అని కాళోజీ ఇప్పుడు ఉంటే అనేవాడేమో.

- మాడభూషి శ్రీధర్‌
వ్యాసకర్త బెన్నెట్‌ యూనివర్సిటీ ప్రొఫెసర్,
కేంద్ర సమాచార మాజీ కమిషనర్‌
madabhushi.sridhar@gmail.com

Read latest Guest-columns News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా