ఆమె కోరిక తీరేనా?

31 Oct, 2018 11:25 IST|Sakshi

సినిమా: నటి తాప్సీ తన ధైర్యసాహసాల పురాణం మళ్లీ మొదలెట్టింది. ఏదో ఒక కథ చెబుతూ వార్తల్లో ఉండాలని తాపత్రయపడే ఈ సంచలన తార ఒక్కోసారి వివాదాస్పద వ్యాఖ్యలతో బుక్కైపోతుంటుంది కూడా. టాలీవుడ్, కోలీవుఢ్‌ దాటి బాలీవుడ్‌లో నటిగా రాణిస్తున్న ఈ అమ్మడు తాజాగా దక్షిణాదిలో ఒక ద్విభాషా చిత్రం చేస్తోంది. గేమ్‌ ఓవర్‌ పేరుతో తెరకెక్కుతున్న ఈ చిత్రం ప్రస్తుతం నిర్మాణంలో ఉంది. ఈ సందర్భంగా ఒక భేటీలో నటి తాప్సీ పేర్కొంటూ ఒకప్పుడు తాను దుడుకుగా ప్రవర్తించేదానినని చెప్పుకొచ్చింది. అసాధారణం అని భావించే విషయాలను ధైర్యంగా చేసేదాన్నని, అయితే ఇప్పుడు దాన్ని తగ్గించానని అంది. తాను ఢిల్లీలో నివసించినప్పుడు మధ్య ఢిల్లీలోని ఒక అటవి ప్రాంతం గురించి కథలు కథలుగా చెప్పేవారని అంది. అది అమానుషాలతో కూడిన భయంకరమైన ప్రాంతంగా చెప్పుకునేవారని, దీంతో ఆ సంగతేంటో తెలుసుకోవాలని, తాను ఒంటరిగా ఆ ప్రాంతానికి వెళ్లొచ్చానని చెప్పింది.

ఇకపోతే తాను నటినవుతానని ఊహించలేదంది. ఎంబీఏ పూర్తి చేసి ఏదైనా మంచి ఉద్యోగం చేసుకుంటూ జీవితంలో సెటిల్‌ అవ్వాలని ఆశించానని చెప్పింది. అలాంటిది నటిగా అవకాశాలు వచ్చాయని తెలిపింది. కొత్త విషయాలపై ఆసక్తి మెండు కావడంతో నటించడానికి రెడీ అయిపోయానని చెప్పింది. అలా తెలుగు, తమిళం భాషల్లో నటించడం మొదలెట్టానని అంది. పలు భాషల్లో పలు చిత్రాల్లో నటించినా తీరని కోరిక ఒకటి మిగిలిపోయిందని చెప్పింది. అదే దర్శకుడు మణిరత్నం దర్శకత్వంలో నటించాలని, మణిరత్నం హీరోయిన్‌ అనిపించుకోవాలన్నదేనని పేర్కొంది.  ఆ దర్శకుడు చిత్రాల్లో పాత్రలు వైవిధ్యంగా ఉంటాయని, నటనకు అవకాశం ఉంటుందని చెప్పింది. ఎప్పటికైనా మణిరత్నం దర్శకత్వంలో నటిస్తాననే ఆశాభావాన్ని నటి తాప్సీ వ్యక్తం చేసింది. మరి ఈమె తీరని కోరిక మణిరత్నం దృష్టికి చేరేనా? ఈ అమ్మడి ఆశ నెరవేరేనా? అన్నది వేచి చూడాల్సిందే.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా