మా ప్రేమ పుట్టింది ముంబైలో

3 Dec, 2019 06:17 IST|Sakshi

‘‘నేను మోడలింగ్‌ నుంచి వచ్చాను. అందుకే ప్రతి సినిమాలో స్టయిలిష్‌గా కనిపిస్తాను. అది నా నటనలోనూ కనిపించేలా చూసుకోవడం నా బాధ్యత’’ అన్నారు నటుడు తరుణ్‌ రాజ్‌ అరోరా. నిఖిల్, లావణ్యా త్రిపాఠి జంటగా టి.సంతోష్‌ తెరకెక్కించిన చిత్రం ‘అర్జున్‌ సురవరం’. ‘ఠాగూర్‌’ మధు సమర్పణలో రాజ్‌కుమార్‌ ఆకెళ్ల నిర్మించిన ఈ చిత్రం గత శుక్రవారం విడుదలైంది. ఈ సినిమాలో విలన్‌గా నటించిన తరుణ్‌ రాజ్‌ అరోరా మాట్లాడుతూ – ‘‘అస్సామ్‌లో పుట్టాను. చెన్నైలో చదువుకున్నాను. బెంగళూర్‌లో మోడలింగ్‌ చేశా. సౌత్‌తో నాకు మంచి అనుబంధం ఉంది.

హిందీలో ఎక్కువ సినిమాలు చేసినా నన్ను సౌత్‌ యాక్టర్‌గా గుర్తిస్తున్నారు. ‘అర్జున్‌ సురవరం’ ఒరిజినల్‌ చిత్రం ‘కణిదన్‌’లో నేనే నటించాను. తెలుగు వెర్షన్‌లో సెంటిమెంట్‌ యాడ్‌ చేశారు. చూసినవాళ్లందరూ సినిమా బావుంది అంటున్నారు. భావం, భావోద్వేగాలు ఎక్కడైనా ఒక్కటే. నటనకి భాషతో సంబంధం లేదు. ప్రస్తుతం హిందీలో ‘లక్ష్మీ బాంబ్, మలయాళంలో ‘మామాంగం’, తమిళంలో ‘దగాల్తీ’ సినిమాలు చేస్తున్నాను. నా భార్య అంజలా జవేరి నేను చేసిన సినిమాలను బాగా ఎంజాయ్‌ చేస్తుంది. మేమిద్దరం ముంబైలో ప్రేమలో పడ్డాం. ముందు నేనే తనకి ప్రపోజ్‌ చేశాను. కావాలనే పిల్లలు వద్దనుకున్నాం. మేం ఒకరినొకరం పిల్లలుగా చూసుకుంటాం’’ అన్నారు.

మరిన్ని వార్తలు