మరోసారి సీబీఐ ఆఫీసుకు వెళ్లిన హీరో విశాల్‌

29 Nov, 2023 12:17 IST|Sakshi

విశాల్ కథానాయకుడిగా అధిక్ రవిచంద్రన్ దర్శకత్వంలో తెరకెక్కిన మార్క్ ఆంటోని చిత్రం గత అక్టోబర్‌లో విడుదలై అభిమానుల నుంచి విశేష స్పందనను అందుకుంది. ఈ నేపథ్యంలో మార్క్ ఆంటోని సినిమాను హిందీలో కూడా విడుదల చేయాలని చిత్ర బృందం ముంబైలోని సెన్సార్ బోర్డు అధికారులను సంప్రదించింది.కానీ మార్క్ ఆంటోని సినిమాను హిందీలో విడుదల చేసేందుకు సెన్సార్ సర్టిఫికెట్ రావడం అంత ఈజీ కాదని హీరో విశాల్‌ అన్నారు. ఇక సెన్సార్ సర్టిఫికేట్ పొందేందుకు లంచం అడిగేలా ముంబై సెన్సార్ బోర్డ్ అధికారులు మెర్లిన్ మేనకా అనే బ్రోకర్ ద్వారా మార్క్‌ ఆంటోని చిత్ర బృందాన్ని సంప్రదించారు.

దీన్ని అస్సలు ఊహించని చిత్ర నిర్మాతలు.. తదనంతరం, విశాల్ మేనేజర్ హరికృష్ణన్ బ్రోకర్ మెర్లిన్ మేనకాతో మాట్లాడి లంచం ఇచ్చాడు. ఆపై సెంట్రల్‌ బోర్డు ఆఫ్‌ ఫిల్మ్‌ సర్టిఫికేషన్‌పై విశాల్ చేసిన ఆరోపణలతో  సీబీఎఫ్‌సీ ముంబయి శాఖ అధికారులపై సీబీఐ కేసు నమోదు చేసింది. ఆ కేసు విచారణలో భాగంగా తాజాగా విశాల్‌ సీబీఐ ఎదుట హాజరయ్యాడు. ఇదే విషయాన్ని సోషల్‌ మీడియా ద్వారా ఆయన ఇలా తెలిపాడు.

'మార్క్‌ ఆంటోని సినిమాకు సంబంధించిన ఈ కేసు పూర్తిగా కొత్త అనుభవాన్ని ఇచ్చింది. విచారణలో భాగంగా అక్కడి అధికారులు  వ్యవహరించిన తీరుపై నేను సంతృప్తిగా ఉన్నాను. నేను జీవితంలో సీబీఐ ఆఫీసుకు విచారణ కోసం వెళ్తానని అసలు అనుకోలేదు. రీల్‌ లైఫ్‌లోనే కాదు.. రియల్‌ లైఫ్‌లోనూ అవినీతిపై పోరాడాల్సిన అవసరం ఉంది.' అని విశాల్ పేపర్కొన్నాడు. నటుడు విశాల్‌, అతని మేనేజర్ హరికృష్ణలను ముంబైలోని సీబీఐ కార్యాలయానికి రెండోసారి పిలిపించిన అధికారులు వారికి ఎంత మొత్తంలో లంచంగా చెల్లించారనే దానిపై విచారణ చేపట్టారు. గత సారి సీబీఐ అధికారులు విశాల్ మేనేజర్ హరికృష్ణను 9 గంటల పాటు విచారించిన విషయం తెలిసిందే.

మరిన్ని వార్తలు