సినిమా రివ్యూ వివాదం: ఎవరి వాదన వారిదే!

28 Sep, 2017 14:39 IST|Sakshi

హైదరాబాద్‌: చలనచిత్ర సమీక్షలపై సినిమా ప్రముఖులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. సమీక్షలు బాధ్యతారహితంగా వ్యవహరిస్తున్నారని జూనియర్ ఎన్టీఆర్‌ వ్యాఖ్యలు చేయడంతో సినిమా ప్రరిశ్రమకు చెందిన చాలా మంది ఇదేరకమైన అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. తాము ఎంతో కష్టపడి సినిమా తీస్తే ఒక్క రివ్యూతో తమ శ్రమను వృధా చేస్తున్నారన్నది వారి ఆవేదన. సినిమా బాగుందో, లేదో చెప్పే అధికారం సమీక్షలకు లేదన్న వాదన బలంగా వినిపిస్తున్నారు. తీర్పును ప్రేక్షకులకే వదిలేయాలని కోరుతున్నారు.

తాజాగా హీరో మంచు విష్ణు, నిర్మాత శోభు యార్లగడ్డ కూడా సినిమా సమీక్షలపై స్పందించారు. కొంత మంది సినిమా చూస్తూనే అప్‌డేట్స్‌ ఇచ్చేస్తున్నారని, శ్రద్ధగా చూడకుండా రాసే సమీక్షలు ఎంతవరకు కచ్చితంగా ఉంటాయని మంచు విష్ణు ప్రశ్నించారు. సినిమా చూడకుండా రివ్యూ రాయడం సరైంది కాదని, సినిమా మధ్యలోనే సమీక్షలు రాసేస్తున్నారని శోభు యార్లగడ్డ అన్నారు. సమీక్ష రాసేముందు ఎంతో మంది శ్రమను గుర్తించాలని, ప్రతి సినిమాను నిశితంగా గమనించి రివ్యూలు రాయాలని ఆయన కోరారు.

సినిమా బాగుంటే ఆడుతుందని, లేకుంటే ఆడదని సమీక్షలు అంటున్నారు. బాలేదని తాము రాసినంతమాత్రాన ప్రేక్షకులు ధియేటర్లకు వెళ్లడం మానుకోరని చెప్పారు. ‘ఆస్పత్రిలో అత్యవసర వార్డులో ఉన్న వ్యక్తి బతకడని తెలిసినప్పుడు.. బతుకుతాడు అని చెప్పినా ఎలాంటి ప్రయోజనం ఉండద’ని ఎన్టీఆర్‌ చేసిన వ్యాఖ్యలను ఉద్దేశిస్తూ వ్యాఖ్యానించారు. సినిమాలు చూడొద్దని తాము చెప్పడం లేదని, సినిమాలో తప్పొప్పులను మాత్రమే ఎత్తి చూపుతున్నామని సమర్థించుకుంటున్నారు. మొదటి షో చూసిన ప్రేక్షకులు సినిమా ఎలా ఉందనేది సోషల్‌ మీడియా ద్వారా వెల్లడించేస్తున్నారన్న విషయాన్ని గుర్తు చేశారు. ఎవరేమన్నా మంచి సినిమాకు ప్రేక్షకులు బ్రహ్మరథం పడతారనేది ఎప్పటికప్పుడు రుజువవుతూనే ఉంది.

మరిన్ని వార్తలు